తండ్రి విలువ తెలుసుకున్న అఖిలేష్

 


లక్నో, జూన్ 3 (globelmedianews.com)
అఖిలేష్ యాదవ్. తండ్రి మాటను లెక్క చేయకుండా చతికల పడ్డారు. తండ్రి ఏర్పరిచిన ఓటు బ్యాంకు నంతా ఆరేళ్లలో హరీమనిపించారు. దూకుడు నిర్ణయాలు, దూరాలోచన లేకపోవడం వంటి అంశాలు అఖిలేష్ ను రాజకీయంగా దెబ్బతీసాయన్నది ఆపార్టీ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్న విషయం. ఉత్తరప్రదేశ్ లో రెండే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన తన తండ్రి ములాయం సింగ్ బాటలో అఖిలేష్ నడవలేదు. భారతీయ జనతా పార్టీని పూర్తిగా అణిచివేయాలనుకోవడంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఆయనను, ఆయన పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లో పడేశాయి.2012 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ క్రెడిట్ అంతా అఖిలేష్ కే దక్కింది. తండ్రి ములాయం సింగ్ తన వారసుడిని ముఖ్యమంత్రిగా అంగీకరించార. 


తండ్రి విలువ తెలుసుకున్న అఖిలేష్
మొత్తం 403 స్థానాల్లో 224 స్థానాలు సాధించడంతో కుమారుడిని ముఖ్యమంత్రిని చేసి ములాయం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే ముఖ్యమంత్రిగా పాలన కొంత మెరుగ్గా చేసినప్పటికీ, పార్టీ క్యాడర్ ను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు అఖిలేష్ ఎదుర్కొనాల్సి వచ్చింది. దీనికి తోడు కుటుంబ సభ్యులను, పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉండే బాబాయ్ శివపాల్ యాదవ్ ను దూరం చేసుకున్నారు. ఫలితంగా 2017 ఎన్నికల్లో చావుదెబ్బ తినాల్సి వచ్చింది.చివరకు తండ్రి ములాయంను, బాబాయి శివపాల్ యాదవ్ ను తప్పించారు. ఇది పార్టీ క్యాడర్ కు ఏమాత్రం నచ్చలేదు. పార్టీ నుంచి గెంటి వేయడంతో శివపాల్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నారు. ప్రత్యేక పార్టీతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇటు సోదరుడు, అటు కుమారుడుల మద్య ములాయం నలిగిపోయారు. ఇద్దరి సమావేశాలకూ హాజరై ఆయనలో ఆయన సంతృప్తి పడ్డారు తప్ప క్యాడర్ మాత్రం అంగీకరించలేదు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం కూడా దుందుడుకుతోనే తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.చిరకాల ప్రత్యర్థి మాయావతి పార్టీతో పొత్తు వద్దని ములాయం వారిస్తున్నా తనకు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి అడ్డులేకుండా చేసుకోవాలని అఖిలేష్ యాదవ్ మాయావతితో చేతులు కలిపారు. కానీ సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా ఐదు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. చివరకు మాయావతి, ములాయం సింగ్ ఒకే వేదికపైకి వచ్చి కలసి ఉన్నామని సంకేతాలు పంపినా ప్రజలు దానిని తిప్పికొట్టారు. మొత్తం మీద అఖిలేష్ యాదవ్ రాంగ్ స్టెప్ లతో తండ్రి మాటను లెక్క చేయకుండా పార్టీని కష్టకాలంలోకి నెట్టారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

No comments:
Write comments