ఎమోషనల్ బాండేజ్ నిర్మూంచుకోలేని పవన్

 


నెల్లూరు, జూన్ 10, (globelmedianews.com)
ఎంత చుట్టరికం అయినా వంగతోటలో మాత్రం బావ వరస కాదు. రాజకీయాల్లోనూ అదే సూత్రం వర్తిస్తుంది తెర మీద కనిపించే హీరోను చూసేందుకు కాసులు, కాలాన్ని ఖర్చు చేసి మరీ సినిమా హాళ్ళ వద్ద కాపలా కాసే వారంతా నిజ జీవితంలోనూ వెంట వుంటారనుకుంటే పొరపాటేనని సినీ సెలిబ్రిటీల రాజకీయ ప్రస్తానం కఠిన సత్యంగా చెబుతోంది. తెర నీద వేలుపులు ఇలలో మాత్రం మానవులే అంటూ జనం ఇచ్చిన సందేశం కాస్తా ఆలస్యంగానైనా జనసేనాని పవన్ కి చేరినట్లుగా కనిపిస్తోంది. తన ఓటమికి గల కారణాలను ఆయన జాగ్రత్తగానే విశ్లేషించుకున్నారనుకోవాలి. ఎన్నికల ఫలితాలపై పవన్ చాలా ఆశలు పెట్టుకుంటున్నట్లు ఉన్నారు. సమీక్షలో ఆయన మాటలను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. చాలా మంచి ఫలితాలు సీట్లు ఆశించిన పవన్ చాలా నిరాశాజనకమైన ఫలితాలపై ఆరా తీశారు. లోపాలను గుర్తించే పనిలో పడ్డారు. జనసేన ఎంతో స్వచ్ఛమైన రాజకీయంతో ముందుకు వచ్చినా ఎందుకు ఇంత దారుణంగా విఫలమైందా అన్న దానికి పవన్ కళ్యాణ్ రెండు ప్రధాన కారణాలు గుర్తించారు.గత టెర్ము ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఈ ఎన్నికల నాటికి మన బలం, క్యాడర్ చాలా పెరిగేది. 


ఎమోషనల్ బాండేజ్ నిర్మూంచుకోలేని పవన్
కాబట్టి అపుడు పోటీ చేయకపోవడంతో 2019కి పూర్తిగా బలపడలేకపోయాం.ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు విపరీతంగా డబ్బులు పంచాయని, కొన్నినియోజకవర్గాల్లో అందరూ కలిసి 150 కోట్ల వరకు పంచారని, కానీ జనసేన ఒక్క రూపాయి పంచకుండా రాజకీయం చేసిందని అందుకే వెనుకపడ్డామని.. అయినా కూడా ఇదే మార్గంలో ముందుకెళ్దాం అన్నారు. ఎన్నికలు సక్రమ పద్ధతిలో జరగలేదని... సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ అభిప్రాయపడ్డారు. ఓటర్లకు డబ్బు ఎరవేయకుండా, స్వచ్ఛమైన రాజకీయాలు చేశామన్న సంతృప్తి ఉందన్నారు. జనసేన సిద్ధాంతాలు చాలామందిని ఆకర్షించాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. యువతీయువకులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని... అందుకే తమకు లక్షల ఓట్లు వచ్చాయని తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలతో డీలా పడకుండా ప్రజల కోసం మరింత బలంగా ముందుకు సాగుదామని పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. ఎన్నికల్లో వాళ్లు మన వెనుక నిలబడతారని అన్నారు. తాను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రచారం సరిగ్గా చేయకపోవడం వల్లనే గాజువాక, భీమవరంలలో ఓటమి చవి చూడాల్సివచ్చిందని సమీక్ష సందర్భంగా పవన్ చెప్పడం సబమైన మాటే.ఇక గాజువాకలో మెగాభిమానులు నీరాజనమే పలికారు. నామినేషన్ వేళ వెల్లువలా తరలివచ్చారు. అదే సమయంలో మిగిలిన పార్టీలకు డబ్బులిచ్చిన జనాలతో జెండాలు మోయిస్తే పవన్ కి మాత్రం పైసా ఖర్చు లేని అభిమానం వెన్నంటి నిలబడింది. నామినేషన్ రోజు వచ్చిన ఊపు చూసి పవన్ మంచి మెజారిటీతో గెలుస్తారని కూడా అంతా అనుకున్నారు. అయితే పవన్ ఇలా వచ్చి ఆలా నామినేషన్ వేసి వెళ్ళిపోయారు. అంతే కాదు ఆ మరుసటి రోజు భీమవరంలో నామినేషన్ వేసి ఇదే నా పుట్టినిల్లు అంటూ భారీ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అక్కడ బాగా తేడా కొట్టింది. ఇక ప్రచారాని రండి మహా ప్రభో అని అభిమానులు ఎంత మొత్తుకున్నా పవన్ వినిపించుకోలేదుగా. చివరకి అదే దెబ్బ కొట్టేసింది. ఓట్లు అడగడానికే తీరిక లేని వారు ఇక జనాలకు ఏం చేస్తారన్న విపక్షాల ప్రచారం కూడా పవన్ని జనానికి దూరం చేసింది.ఇక రాజకీయ నాయకులుగా మారిన సినీ జీవులకు ఓ అంచనా ఉంటుంది. తాము రోజూ టీవీ తెరపై ఏదో సినిమాలో కనిపిస్తాం, పైగా జనాలకు పరిచయం బాగా ఉన్నవాళ్ళం, మేము వేరేగా ఇంటింటికీ వచ్చి ఓట్లు అడగాలా అన్నది కూడా ఉంటుంది. కొందరికి అలా ప్రచారం చేయడం కూడా నామోషీగా భావిస్తారు. పెద్ద నాయ‌కులు నామినేషన్ వేసి వెళ్తే ఎంచక్కా గెలుస్తున్నారు. మేము కూడా అంతే అనుకుంటారు. అయితే జనం మాత్రం తొలిసారి పోటీ చేసే నాయకులు, సినిమా స్టార్స్ విషయంలో నిబద్ధత చూస్తారు. వారిని నిశితంగా గమనిస్తారు. ముఖ్యంగా తమకు అందుబాటులో ఉంటున్నారా లేదా అన్నది ప్రధానంగా చూస్తారు.పవన్ ఓటమి అయినా, చిరంజీవి పరాజయం అయినా ఈ విశ్లేషణ నుంచే చూడాలి. జనాలకు చేరువగా ఉన్నవారెవరూ ఓటమి పాలు కాలేదు. ఒక్కసారి వారి మన్నన పొంది మార్కులు సంపాదిస్తే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు కూడా. ఈ అద్భుతమైన ఎమోషనల్ బాండేజ్ నిర్మించుకోలేకనే పవన్ సహా సెలిబ్రిటీలు విఫలమవుతున్నారు. తప్పు ఎక్కడో తెలిసింది కాబట్టి పవన్ ఇకపై గెలుపునకు దారేదీ అంటూ ముందుకు సాగుతారని అభిమానులతో సహా అంతా ఆశించవచ్చు.

No comments:
Write comments