ప్రధాన పార్టీలకు చెక్ పెట్టేలా సమతూకం

 


విజయవాడ, జూన్ 8 (globelmedianews.com)
తన మంత్రి వర్గాన్ని వినూత్న రీతిలో కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాటు చేసి సంచలనం సృష్టించిన వైసిపి అధినేత ఎపి లో ప్రధాన పార్టీలకు చెక్ పెట్టేలా వ్యూహం అమలు చేశారని రాజకీయ పండితుల మాట. సాధారణంగా జాతీయ పార్టీలు మాత్రమే సామాజిక సమీకరణాలను అనుసరించి మంత్రి వర్గాలను ప్రకటించే పరిస్థితి ఉంటూ వస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ అధినేత సామాజిక వర్గానికే పెద్ద పీట వేసే సంస్కృతినే అనుసరిస్తూ ఆ విధానాన్ని సంప్రదాయంగా మార్చేశాయి. అయితే తొలి సారి ఎపి నవయువ ముఖ్యమంత్రి జనాభాలో అత్యధిక శాతం వున్న వారి కులాలను ప్రాతిపదికగా తీసుకుని చాలా నేర్పుగా క్యాబినెట్ కూర్చారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. సొంత సామాజిక వర్గం నుంచి ఎదురయ్యే వత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. అయినా ప్రజలు ఇచ్చిన బంపర్ మెజారిటీ వైసిపి అధినేత ధృడ సంకల్ప నిర్ణయం అమలు చేసేలా చేసింది.తెలుగుదేశం పార్టీ కులాల వారీగా చేసే సమీకరణాలు ఆ పార్టీకి బలమైన పునాదిని నిర్మించాయి. అయితే అసెంబ్లీ సీట్ల నుంచి క్యాబినెట్ వరకు 50 శాతం కమ్మ సామాజిక వర్గం ఉండేలా ఆ పార్టీ ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు హయాంలో రూపాంతరం చెందుతూ వచ్చింది. ఫలితంగా అన్ని సామాజిక వర్గాల్లో అసంతృప్తి పెల్లుబికుతు వస్తుంది. 


ప్రధాన పార్టీలకు చెక్ పెట్టేలా సమతూకం
అది సోషల్ మీడియా వేదికలపై చాలా తీవ్రంగా ప్రస్ఫుటిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఈ అసంతృప్తి జ్వాలలకు ఒకే ఒక్క చారిత్రక నిర్ణయంతో జగన్ చెక్ పెట్టేయడమే కాదు ఏపీలో తన ప్రధాన ప్రత్యర్థికి రాజకీయంగా వేసిన ఎత్తుగడతో చుక్కలు చూపించారు.ఇక బిజెపి హిందుత్వ నినాదంతో దేశవ్యాప్తంగా దూసుకుపోతుంది. కులాల వారీగా ఓటర్లలో చీలికలు తేవడం తద్వారా రాజకీయ లబ్ది సాధించడంలో మోడీ షా ద్వయాన్ని దేశంలోనే కొట్టే మొనగాళ్ళు ఇంకా రాలేదు. అయితే ఏపీలో అనితర సాధ్య విజయాన్ని అందుకున్న జగన్ భవిష్యత్తులో అలాంటి రాజకీయ వ్యూహాలు ఎపి పై పని చేయకుండా వైసిపికి ఎలాంటి నష్టం చేయని విధంగా తన తాజా టీం కూర్పు చేపట్టి అందరికి షాక్ ఇచ్చారు.మమ్మి రిటర్న్స్ లా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పటికైనా పుంజుకునే అవకాశాలు వున్నాయి. వచ్చే ఎన్నికలకు చంద్రబాబు వృద్ధాప్య కారణాలతో తప్పుకుని లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ కి అవకాశాలు మళ్ళీ చిగురించే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పై వున్న కోపం క్రమంగా ప్రజల్లో తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ కిందనుంచి పై వరకు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది కూడా. యువతకు పెద్ద పీట వేయడం, వృద్ధ జంబూకాలకు టాటా చెప్పడం వంటి నిర్ణయాలు త్వరలో ఆ పార్టీ లో రాహుల్ నేతృత్వంలో చోటు చేసుకోవడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం ఇచ్చి తీరతామని గత ఎన్నికల్లో మాటిచ్చిన కాంగ్రెస్ బలమైన సామాజిక వర్గానికి ఎపి పగ్గాలు అప్పగించి తెరపైకి వచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఇది ముందే పసిగట్టిన జగన్ ఆ పార్టీకి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని బలమైన పునాదులు వైసిపికి వేసే ప్రయత్నం చేశారు.కోస్తా ఆంధ్ర లో బలమైన సామాజిక వర్గాలు మూడే మూడు. ఎస్సి, కాపు, బిసి సామాజిక వర్గాలు అధికార మార్పిడి చేయగలిగే శక్తులు. వీటన్నింటిని అధ్యయనం చేసిన వైసిపి చీఫ్ ఏ ఒక్కరిని తక్కువ చేయలేదు. సోషల్ ఇంజనీరింగ్ లో గత పదేళ్లలో ఢక్కా మొక్కీలు తిన్న జగన్ వీరందరిని సంతృప్తి పరిచేలా క్యాబినెట్ కూర్పు చేసి పొలిటికల్ విశ్లేషకులనే ఆశ్చర్య పరిచారు. గత రెండు ఎన్నికల్లో జనసేన కాపు సామాజిక వర్గం అండగా అధికార విపక్షాలకు చెమటలు పట్టించింది. ఒకసారి టిడిపి అధికారంలోకి రావడానికి జనసేన ప్రధాన కారణం అయ్యింది. తాజా ఎన్నికల్లో వైసిపి అఖండ విజయంలో కూడా జనసేన విడిపడి పోటీ చేయడం కూడా ఒక కారణమనే చెప్పొచ్చు.ఒక్క సీటు మాత్రమే తాజా ఎన్నికల్లో దక్కించుకున్న వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి జనసేన సన్నద్ధం అవుతుంది. వైఎస్ జగన్ ఆదర్శంగా ప్రజాక్షేత్రంలో వుండి సమర్ధవంతంగా పని చేసి వచ్చే ఎన్నికల్లో గణనీయమైన సీట్లు ఓట్లు మరింతగా సాధించే ప్రయత్నాలకు వ్యూహాలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని సైతం దూరం చేసుకోకుండా ఆ వర్గానికి వైసిపి అండగా ఉంటుందని భరోసా కల్పించారు జగన్. దాంతో జనసేన కు ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ తో వున్న ఓటు బ్యాంక్ ను చాలా వరకు చీల్చే పరిస్థితి స్పష్టం అవుతుంది. ఇలా ప్రతి రాజకీయ పార్టీని వారి ఓటు బ్యాంక్ లను లక్ష్యంగా చేసుకుని జగన్ వేసిన అడుగు ఇప్పుడు ప్రధాన రాజకీయ పక్షాల్లో వణుకు పుట్టిస్తుంది.

No comments:
Write comments