ప్రాణాలు మీదకు తెస్తున్న బైక్ స్టంట్స్

 


హైద్రాబాద్, జూన్ 6 (globelmedianews.com)
ఎంత వేగంగా బండి నడిపితే అంత క్రేజ్. ఇది ఇప్పుడు కుర్రకారును కమ్మేసిన ప్రమాదకర వ్యసనం. వారి వరకు ఇది ఎలా వున్నా దీనివల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అత్యంత వేగంగా 200 సిసి బైక్ లపై రివ్వున దూసుకువస్తున్న కుర్రకారు బైక్ విన్యాసాలకు ఆ ప్రాంతం… ఈ ప్రాంతం అని లేదు సర్వత్రా ఇదే ట్రెండ్ నడుస్తుంది. దాంతో రోడ్లపైకి వెళ్ళాలంటే జనం హడలి చచ్చే పరిస్థితి దాపురించింది. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడటం తో పాటు ప్లస్ టూ కి రాకుండానే తల్లితండ్రులు చిన్నారులకు అత్యంత వేగంగా ప్రయాణించే బైక్ లను కొనివ్వడం వారి ప్రాణాలతో బాటు సామాన్యుల ప్రాణాలకు చెలగాటంగా మారేలా చేస్తుంది.హెల్మెట్ లేదని, ట్రిబుల్ రైడింగ్ అంటూ చలానాలు బాదేసే పోలీస్ శాఖ సామాజికంగా ప్రమాదంగా మారిన కుర్రోళ్ళ బైక్ రైడింగ్ లను, రేస్ లను తెలుగు రాష్ట్రాల్లో కంట్రోల్ చేయలేకపోతుంది. ఫలితంగా అనేక ప్రాణాలు నిత్యం గాల్లోకి కలిసి పోవడం లేదా క్షతగాత్రులుగా ఆసుపత్రుల పాలు అయ్యే వారి సంఖ్యను క్రమేణా పెరిగేలా చేస్తుంది. ఇటీవల అమరావతిలో కొందరు టీఎస్ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా జిగ్ జాగ్ డ్రైవింగ్ చేస్తూ తమ బైక్ లపై సృష్టించిన అరాచకం తాజాగా యువత చేస్తున్న విన్యాసాలకు మచ్చు తునక. 


ప్రాణాలు మీదకు తెస్తున్న బైక్ స్టంట్స్
వారు బస్సుకు సైడ్ ఇవ్వడం మాని దానికి అడ్డంగా సాగించిన అరాచకం వికటిస్తే 50 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి. ఇదొక్కటే కాదు ఇంకా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు గా కాలేజ్ ల వద్ద రద్దీ రోడ్లపైనా, ఖాళీగా వుండే రహదారులపై నిత్య కృత్యంగా మారిపోయాయి.మాజీ మంత్రి నారాయణ కుమారుడు, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దిన్ కుమారుడు ఇలా అనేకమంది సెలబ్రెటీల పిల్లలే ర్యాష్ డ్రైవింగ్ తో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎక్కువసార్లు ఇలా రిస్కీ ఫీట్లు చేసేవారే మరణిస్తూ వున్నా ఆ సమయంలో సామాన్యులు సైతం అసువులుబాస్తున్న సందర్భాలు ఎక్కువ అయ్యాయి. బైక్ రేస్ ల కారణంగా ఇటీవలే చెన్నయ్ మెరీనా బీచ్ లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాగే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో రొటీన్ గా మారిపోయాయి. వీరిని అదుపు చేయడంఖాకీల వల్ల కానీ పనిగా తయారయ్యింది. ఇలా రేష్ డ్రైవింగ్ చేసిన వారిని పట్టుకున్నా వారు విద్యార్థులు కావడం, రాజకీయ వత్తిడులు కారణంగా ఈ సూసైడ్ బాంబర్లపై ఎలాంటి చర్యలు లేకుండా కౌన్సిలింగ్ లతో పోలీసులు సరిపెట్టేస్తున్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో ఈ సూసైడ్ బాంబర్ల అరాచకాలను అరికట్టే అవకాశం వుంది. ఇప్పుడు అన్ని చోట్లా కొలువైన సిసి కెమెరాలను ఉపయోగించి భారీ జరిమానాలు విధిస్తే కొంతమేరకు ఆకతాయిల ఆగడాలకు చెక్ పడుతుంది. 18 సంవత్సరాలు దాటని యువత బైక్ లపై దొరికితే బండి సీజ్ చేయడం భారీ జరిమానాతో పాటు తల్లితండ్రులకు శిక్షలు అమలు చేసే విధానం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అత్యంత వేగంగా ప్రయాణించే బైక్ లను తమ పిల్లలకు కొని ఇవ్వకుండా ముందు తల్లితండ్రుల్లో చైతన్యం తీసుకురావాలని పోలీసులు సైతం కోరుతున్నారు. అడిగిందల్లా వారికి కొని చివరికి తమ కళ్లెదుటే వారు కట్టెలుగా మారిన తరువాత కన్నీళ్ళు కార్చి ప్రయోజనం లేదని పేరెంట్స్ ను హెచ్చరిస్తున్నారు పోలీసులు. అతివేగంగా బైక్ లు కారులతో దూసుకుపోతున్న వారికి బ్రేక్ లు వేయకపోతే ప్రమాదాల సంఖ్య గణనీయం గా పెరిగే ప్రమాదం పొంచి వుంది. ఏపీలో కొలువైన కొత్త సర్కార్ అయినా ఈ విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టాలని జనం కోరుకుంటున్నారు.

No comments:
Write comments