స్పీకర్ కాకుండా... ఇంకేమైనా

 


గుంటూరు, జూన్ 7 (globelmedianews.com)
రాష్ట్రంలో అనూహ్యంగా విజ‌యాన్ని సొంతం చేసుకుని, అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎంగా ప్రమాణం చేశారు. ఇక‌, ఆయ‌న కేబినెట్ కూర్పుపై మంత‌నాలు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలో త‌మ‌కు కావాలంటే.. త‌మ‌కు కావాలంటూ.. మంత్రి ప‌ద‌వుల కోసం నాయ‌కులు వెంట‌బ‌డుతున్నారు. అదేస‌మ‌యంలో అసెంబ్లీ స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వులంటే మాత్రం నాయ‌కులు వెనక్కి జంకుతున్నారు. వ‌చ్చే నెల లేదా జూలైలోనో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కావాల్సి ఉండ‌డంతో అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వహించ‌డం అనివార్యం. మ‌రోప‌క్క, బ‌లం త‌క్కువ‌గానే ఉన్నా.. సీనియ‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రతిప‌క్షం టీడీపీని అదుపు చేసేందుకు ఇక్కడ వైసీపీ నుంచి బ‌ల‌మైన స్పీక‌ర్ అభ్యర్థి అవ‌స‌రం. జ‌గ‌న్‌.. కొంద‌రి పేర్లను ప్రతిపాదించిన‌ట్టు తెలుస్తోంది. బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో స‌త్తెన‌ప‌ల్లి నుంచి గెలిచిన కీల‌క నాయ‌కుడు, వైఎస్ ఫ్యామిలీకి ఆత్మ బంధువు.. అంబ‌టి రాంబాబును ఎంపిక చేయాల‌ని చూస్తున్నారు. 


స్పీకర్ కాకుండా... ఇంకేమైనా
న‌గ‌రి ఎమ్మెల్యే రోజా పేరును తెర‌మీదికి తెస్తున్న వారు కూడా ఉన్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ప్రత్తిపాడు నుంచి విజ‌యం సాధించిన మేక‌తోటి సుచ‌రిత‌కు కూడా కీల‌క ప‌ద‌వి ఇవ్వా ల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఎస్సీ కోటాలో సుచ‌రిత‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని భావించినా.. ఇప్పటికే ఇక్కడి నుంచి ఇద్దరికి మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని జ‌గ‌న్ మాట ఇచ్చిన నేప‌థ్యంలో ఇప్పుడు కేవ‌లం ఆయ‌న‌ముందు స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వులు మాత్రమే ఉన్నాయి.అయితే, ఈ రెండు ప‌దవుల విష‌యంలో నాయ‌కులు ముందుకు రావ‌డంలేదు. దీనికి ప్రదాన కార‌ణం.. గ‌తంలో స్పీక‌ర్లుగా చేసిన నాయ‌కుల‌కు రాజ‌కీయంగా ఫ్యూచ‌ర్ లేకుండా పోవ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. 1983 నుంచి 2014 వ‌ర‌కు కూడా రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. స్పీక‌ర్‌గా, డిప్యూటీ స్పీక‌ర్‌గా ప‌నిచేసిన వారు త‌ర్వాత కాలంలో రాజ‌కీయంగా ఉన్నత‌స్థాయికి కాదు క‌దా.. సాధార‌ణ స్థాయికి కూడా దూర‌మ‌య్యారు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నుంచి ప్రారంభిస్తే.. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్పీక‌ర్లు ఎక్కడా గెలిచిన సంద‌ర్భాలు లేవు. ఈ ప‌రిస్తితి ఒక్క ఏపీలోనే ప‌రిమితం కాలేదు. తెలంగాణ‌లోనూ ఇదే ఉంది. అక్కడ స్పీక‌ర్‌గా ప‌నిచేసిన మధుసూధ‌నాచారి .. గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు.ఇక ఏపీలో తాజా ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేసిన కోడెల శివ‌ప్రసాద‌రావు కూడా ఆ సెంటిమెంట్ నిజం చేస్తూ ఓడిపోయారు. ఇక 2004లో ప్రతిభాభార‌తి, 2009లో స్పీక‌ర్ సురేష్‌రెడ్డి, 2014లో స‌మైక్య రాష్ట్ర చివ‌రి స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇలా వీళ్లంద‌రూ కూడా ఈ సెంటిమెంట్‌కు బ‌లైన వారే. దీంతో నాయ‌కులు ఇక‌, త‌మ‌కు రాజ‌కీయాల‌పై ఆశ‌లు స‌న్నగిల్లాయ‌ని అనుకున్నవారు మాత్రమే ఈ ప‌ద‌వులు చేప‌ట్టాల‌ని డిసైడ్ అయ్యారు. దీంతో ఇప్పుడు వైసీపీలోనూ స్పీక‌ర్ సెంటిమెంట్ జోరుగా తెర‌మీద‌కి వ‌చ్చింది. దీంతో ఈ ప‌రిస్థితి జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఎవ‌రిని క‌దిపి, నీకు స్పీకర్ పోస్టు ఇద్దామ‌నుకుంటున్నాన‌ని అన్నా.. వెంట‌నే వ‌ద్దన్నా.. ఇంకేదైనా చూడు! అని బ్రతిమాలుతున్న ప‌రిస్తితి క‌నిపిస్తోంది. మ‌రి ఈ ప‌రిస్థితిని జ‌గ‌న్ ఎలా అధిగ‌మిస్తారో చూడాలి.

No comments:
Write comments