ధాన్యానికి డబ్బులేవీ..? (తూర్పుగోదావరి)

 

రాజమండ్రి, జూన్ 24 (globelmedianews.com): 
జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుల కష్టాలను తీర్చలేక పోతున్నాయి. 45 రోజుల కిందటే ఈ కేంద్రాలను ప్రారంభించగా ఇప్పటికీ రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. ధాన్యం నిల్వలకు తగిన సంఖ్యలో గోదాములు లేకపోవడంతో పాటు మిల్లర్లకు లక్ష్యాలు పూర్తవడం ఇందుకు కారణంగా ఉంది. మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వారు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని అధికారులు అంచనా వేశారు. ఇందులో కనీసం ఏడు లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. 
ధాన్యానికి డబ్బులేవీ..? (తూర్పుగోదావరి)

ఇప్పటి వరకు ఈ కేంద్రాల ద్వారా కేవలం 3,88,762 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కొందరు రైతులు నేరుగా వ్యాపారులకు అమ్మేశారు. ప్రస్తుతం రైతుల వద్ద 1.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా బొండాలు రకానికి చెందినదే. ఈ రకం ధాన్యానికి డిమాండ్‌ లేకపోవడంతో కొనుగోలు చేయడానికి అధికారులు పలు కారణాలు చెబుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు రూ.680.93 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ.150 కోట్ల మేరకు బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలి. కానీ ప్రస్తుతం నగదు జమ కావాలంటే 16 నుంచి 20 రోజులు పడుతోంది. గత నెలలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి నగదు ఇప్పటికీ రైతులకు అందలేదు. ఆలమూరుకు చెందిన కె.సత్యనారాయణ అనే రైతు గత నెల 29న 328 బస్తాల ధాన్యాన్ని విక్రయించారు. దీనికి సంబంధించి రూ.2,29,600 ఆయన ఖాతాలో జమ చేయాల్సి ఉండగా ఇప్పటికీ చెల్లించలేదు. కాజులూరు మండలం ఆర్యవటానికి చెందిన తలాటం వీరభద్రరావు అనే రైతు మే 29న 287 బస్తాల ధాన్యాన్ని విక్రయించారు. ఈమేరకు ఆయనకు రూ.2,00,900 చెల్లించాల్సి ఉండగా ఇప్పటికీ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయలేదు. ఇలా పలు మండలాల్లో రైతులు ధాన్యం అమ్మిన నగదు కోసం నిరీక్షిస్తున్నారు.

No comments:
Write comments