మొదటి నుంచి సన్యాస రాజకీయమే

 


విశాఖపట్టణం, జూన్ 20, (globelmedianews.com)
న్యాసి అంటేనే అన్నీ త్యజించిన వారు అంటారు. వారికి రాగద్వేషాలు ఉండవు అని అంటారు. తన పర భేధం అంతకంటే ఉండదని చెబుతారు. అయితే ఆధునిక జీవనంలో ఆధ్యాత్మికత కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. దేవుళ్ళను ఎటూ డబ్బున్న వాళ్ళ పరం చేసి వీఐపీ సేవలు అందిస్తున్న వ్యవస్థలో స్వాములు సైతం పేరున్న, నోరున్న వారికే అనుగ్రహ భాషణం చేస్తున్నారు. వారినే గుండెల్లో పెట్టుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి ఎంతమందికి గుండెధైర్యం ఉంది. విశాఖ శారదాపీఠం స్వామీజీకి మాత్రం ఆ తెగింపు చాలా ఎక్కువగానే ఉంది. అందుకే నిండు సభలో ఆస్తిక జనులంతా చూస్తూండంగానే తనకు జగన్ ప్రాణమమని బాహాటంగా చెప్పుకుంటారు. తన ఆత్మ జగన్ పేరు చెబుతోందని కూడా అన్నారు.అసలు విశాఖ శారదాపీఠం ఏర్పాటు వెనుకా తరువాతా కూడా మొత్తం రాజకీయ వాసనలే ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు ద్రోణం రాజు సత్యనారాయణ, టీ సుబ్బరామిరెడ్డి వంటి వారే స్వామీజీకు వెన్ను దన్ను. 


మొదటి నుంచి సన్యాస రాజకీయమే
ఆ తరువాత ఎందరో రాజకీయ ప్రముఖులు ఆశ్రమానికి వస్తూ పోతూ ఉండేవారు. వారిలో అధిక భాగాం కాంగ్రెస్ నేతలే. అప్పట్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. దాంతో ఆ హడావిడే వేరుగా ఉండేది. ఇక విభజన జరిగి ఏపీలో చంద్రబాబు, తెలంగాణాలో కేసీయార్ వచ్చిన తరువాత స్వరూపానందేంద్ర విమర్శలకు రాజకీయ పదును ఎక్కువైంది. చంద్రబాబు రాత్రి పూట సీఎం గా ప్రమాణం చేశారని,దాని వల్ల రాష్ట్రానికి అనర్ధం అంటూ స్వామీజీ అప్పట్లో చేసిన సంచలన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అయ్యాయి. నాటి నుంచి టీడీపీ స్వామీజీ మీద ఓ కన్నేసి ఉంచగా ఆయన సైతం బాబుకు వ్యతిరేక పంధాను తీసుకుని దూకుడుగా సాగిపోయారు. జగన్ స్వామీజీకి ఆయుధంగా దొరికారు. ఓ వైపు యాగాలు, హోమాలతో కేసీయార్ తో సాన్నిహిత్యం పెంచుకున్న స్వరూపానందేంద్ర తరువాత కాలంలో జగన్ని కూడా దగ్గర చేసుకున్నారు. ఈ క్రమంలో వర్తమానంలో తాను కోరుకున్న వారు ఇద్దరూ అధికారంలో ఉండడంతో స్వామీజీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే ఆయన నోట నిండు సభలో జగన్ మీద ఉన్న ప్రేమను అలా చెప్పించింది అని అంటారు. ఇక జగన్ సైతం హిందూ ధర్మం పట్ల తన విశ్వాసాన్ని చాటుకోవడానికి స్వామీజీని దగ్గర మార్గంగా భావించారు. ఇలా ఉభయకుశలోపరిగా సాగుతున్న స్వాముల కధలో తాజా ప్రకటన ఓ విధంగా సంచలనమనే చెప్పాలి. స్వామీజీలు ఏకాంత చర్చల్లో ఎలా ఉంటారో తెలియదు కానీ బాహాటంగా మాత్రం భక్తులంతా ఒక్కటేనని బోధిస్తారు. ఆలాగే ప్రవర్తిస్తారు. కానీ స్వామీజీ అత్యుత్సాహంతో తన జగన్ మీద అభిమానాన్ని చాటుకుని హద్దులు చెరిపేశారు.బంధాలను తెంచుకున్నానని ఓ వైపు చెబుతూ జగన్ తో అనుబంధాన్ని పెంచేసుకున్నారు. . మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

No comments:
Write comments