విత్తనం పత్తనం (విజయనగరం)

 

విజయనగరం, జూన్ 18 (globelmedianews.com) : 
ఖరీఫ్‌ సీజన్‌ మొదలు నుంచి.. ముగిసే వరకూ రైతుకు దినదినగండమే. విత్తనాల సేకరణ నుంచి.. పంట చేతికంది, విక్రయించుకుని డబ్బులు చేతికందే వరకూ పరీక్షే. ఖరీఫ్‌లో సాగు చేస్తున్న వరి పంట విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలను వ్యవసాయశాఖ అందించలేని పరిస్థితి. దీంతో ఏటా 40 వేల క్వింటాళ్ల విత్తనాల వరకు రైతాంగం ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడుతోంది. ఇదే అదునుగా వ్యాపారులు అన్నదాతలను నిలువునా మోసం చేస్తున్నారు. ఖరీఫ్‌లో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,21,977 హెక్టార్లు. ఇందుకు 90వేల క్వింటాళ్ల వరకు విత్తనం అవసరం ఉంటుంది. ఏపీ సీడ్స్‌ ద్వారా 41,493 క్వింటాళ్ల మేర రైతులకు రాయితీపై సరఫరా చేస్తున్నారు. ఇందులో 10 శాతం రైతులు సొంతంగా విత్తనం కట్టుకుంటారు. మిగిలిన వాటికి ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 70 వేల క్వింటాళ్ల వరకు రాయితీపై విత్తనాలను అందిస్తున్నారు. విజయనగరం జిల్లాకు వచ్చే సరికి సాగుకు సరిపోయే విత్తనాన్ని ఏపీ సీడ్స్‌ సమకూర్చలేకపోతోంది. పలు రకాలను ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు.జిల్లాలో 70 శాతానికిపైగా పంటలు వర్షాధారంపైనే సాగవుతున్నాయి. 

విత్తనం పత్తనం (విజయనగరం)
తొలకరి పలకరించినప్పుడు అన్నదాతలు వరి విత్తనాలు కొనుగోలు చేసి నారుమళ్లు పోస్తుంటారు. సమయానుకూలంగా వర్షాలు కురవకపోతే నారుమళ్లు బతికించుకోవడానికి నానా అవస్థలు పడాల్సిందే. విత్తనాలు జల్లిన తర్వాత వర్షం పడకపోతే మొలక రాకుండా పోతుంది. దీంతో వేసిన విత్తనం వృథా అయినట్లే. మళ్లీ విత్తనం కోసం రైతులు పాట్లు పడాల్సిందే. అధికారుల నిర్లక్ష్యంతో మొలకశాతం పరిశీలించకుండా పంపిణీ చేపడితే నష్టపోయేది రైతాంగమే. ఏపీ సీడ్స్‌లో విత్తనాల్లో మొలకశాతం పరిశీలించినాకే వాటిని మండల కేంద్రాల్లో గోదాములకు తరలిస్తుంటారు. అక్కడ గాలి, వెలుతురు లేని గోదాముల్లో రోజుల తరబడి ఉంచడం వల్ల జర్మినేషన్‌ దెబ్బతిని మొలకశాతం తగ్గిపోతోంది. విత్తనాలు తీసుకువెళ్లిన రైతులు నారుమడి వేసినపుడు కొంత వరకు మొలకలు వస్తాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి రైతు చేరుకుంటున్నాడు. మరోవైపు సాగుకు సిద్ధమై.. సమయానికి విత్తు అందక రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు జిల్లాలో అనేకం ఉన్నాయి.ప్రైవేటు వ్యాపారుల వద్ద ఉన్న విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది నమూనా తీసి మొలకశాతం పరిశీలించిన తర్వాతే అమ్మకాలు చేపట్టేలా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇప్పటికే జేసీ-2 సీతారామారావు వ్యవసాయాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో జరిగిపోవాలని సూచించారు. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నా అవసరం మేరకు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఉచితంగా విత్తనాలు అందజేస్తే ఎంతో ఉపయోగమని అంటున్నారు. ఏపీ సీడ్స్‌ ద్వారా 41,493 క్వింటాళ్ల అధిగ దిగుబడులిచ్చే వరి వంగడాల విత్తనాలు పంపిణీకి చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 27,890 క్వింటాళ్ల మేర మండల కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచారు. తొలకరి  వర్షాలు పడిన వెంటనే విత్తనాల సేకరణకు రైతులు పరుగులు తీస్తారు. పదేశ్లకు పైబడిన వరి రకాలకు 50 శాతం లేదా గరిష్టంగా కిలోకు రూ.10లకు మించకుండా, పదేళ్లలోపు రకాల వరి విత్తనాలకు 50 శాతం లేదా గరిష్టంగా కిలోకు రూ.20లకు మించకుండా రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది.

No comments:
Write comments