అయిల్ ఫెడ్ కథ కంచికేనా

 


హైద్రాబాద్, జూన్ 28, (globelmedianews.com)
ఆయిల్‌ఫెడ్‌కు వ్యాట్‌ దెబ్బతగిలింది. ఉన్నతాధికారుల అలక్ష్యమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అమ్మకాల్లో అనవసరంగా వ్యాట్‌ను అదనంగా చెల్లించడంతో కోట్లతో ఆ సంస్థ ఆర్థికంగా నష్టపోయింది. వ్యాట్‌ మినహాయించుకోవాల్సిన అధికారులు సంస్థకు పంగనామాలు పెడుతూ మౌనం వహిస్తున్నట్టు తెలిసింది. ఆయిల్‌ఫెడ్‌కు వ్యాట్‌ మినహాయింపు కోరే అవకాశం ఉన్నా...దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో సంస్థకు రూ 3.76 కోట్ల నష్టం జరిగింది. ఈ వ్యవహారంలో సీనియర్‌ అధికారుల పాత్ర ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయిల్‌ఫెడ్‌లో ఆలస్యంగా 'వ్యాట్‌' కుంభకోణం వెలుగు చూసింది. కొందరు అధికారుల నిర్లక్ష్యంవల్ల ఆయిల్‌ఫెడ్‌ దాదాపు రూ 3.76 కోట్ల మేర నష్టపోయినట్టు విశ్వసనీయ సమాచారం. 

 అయిల్ ఫెడ్ కథ కంచికేనా

అంత పెద్ద స్థాయిలో నష్టం జరగడానికి బాధ్యులను గుర్తించినా చర్య తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు లోనవుతున్నారన్న చర్చ జరుగుతున్నది. పైగా దానికి బాధ్యులైన కొందరు సీనియర్‌ ఉద్యోగులు పైస్థాయిలో అండదండలు చూసుకుని జరిగిన నష్టానికి ఏమాత్రం బాధ్యత వహించడం లేదని తెలిసింది. వ్యవహారం బయటకు పొక్కకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఈ వ్యవహారాన్ని తెలియకుండా దాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది నిర్లక్ష్యమా? లేక కోట్ల రూపాయల నష్టం చవిచూడడంలో ఎవరికైనా లబ్ది జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయిల్‌ఫెడ్‌లో ఇతర ఉద్యోగులు కూడా దీనిపై ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేక ఎవరికివారు మిన్నకుండిపోయారు. 2016 నుంచి 2017 జూన్‌ మధ్య కాలంలో జరిగిన వ్యవహారం ఇది. అప్పట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అప్పారావుపేటలో కొత్తగా ఆయిల్‌ఫామ్‌ ఫ్లాంటును నెలకొల్పారు. అందుకోసం అయిల్‌ఫెడ్‌ పామాయిల్‌ ఫ్లాంటుకు, సివిల్‌ పనులకు, అన్ని రకాల పనుల కోసం రూ 75.13 కోట్లు ఖర్చు చేసింది. పామాయిల్‌ ఫ్లాంటు, ఇతర యంత్రాల నెలకొల్పే బాధ్యత ప్రీ యూనిక్‌ అనే సంస్థకు అప్పగించారు. అందులో ఆ ఒక్క దానికే రూ 45.42 కోట్లు ఖర్చు చేసింది. ఇలా ఆయా కంపెనీలకు పలు రకాల పనులను అప్పగించింది. ఆయా కంపెనీలన్నీ కూడా యంత్రాలను కొనుగోలు చేసి అప్పారావుపేటలో ఫ్యాక్టరీని, దానికి సంబంధించిన ఇతర పనులను పూర్తి చేశాయి. మెటీరియల్‌ విలువను ఆధారం చేసుకొని ఆ కంపెనీలు వ్యాట్‌ను ప్రభుత్వానికి చెల్లించాయి. ఆ మొత్తం వ్యాట్‌ విలువ రూ 3.63 కోట్లు. మరోవైపు అశ్వారావుపేటలో అప్పటికే ఉనికిలో ఉన్న పాత పామాయిల్‌ ఫ్యాక్టరీ ఆధునీకరణ పనుల కోసం ఆయిల్‌ఫెడ్‌ కొన్ని కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఆ కంపెనీలు రూ 6 కోట్లకు పైగా విలువైన మెటీరియల్‌ను వాడారు. అందుకోసం దాదాపు రూ 12.74 లక్షలకు పైగా వ్యాట్‌ సొమ్ము చెల్లించాయి. రెండూ కలిపి మొత్తంగా రూ 3.76 కోట్ల వ్యాట్‌ను రెండు ఫ్యాక్టరీలకు కలిపి జరిగిన పనులకు ఆయా కంపెనీలు ముట్టజెప్పాయి. ఆయా కంపెనీలు రూ 3.76 కోట్లు వ్యాట్‌ చెల్లించాయి. కంపెనీ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ, మరో ఫ్యాక్టరీ ఆధునీకరణ అనంతరం అక్కడ పామాయిల్‌ ఉత్పత్తి జరుగుతున్నది. అలా ఉత్పత్తి అయిన పామాయిల్‌ను ఆయిల్‌ఫెడ్‌ విక్రయిస్తుంది. అలా అమ్మకం పామాయిల్‌కు కూడా వ్యాట్‌ను చెల్లిస్తుంది. ఇక్కడ జరిగిందేంటంటే ఒకవైపు ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన యంత్రాలకు ఆయా కంపెనీలు అప్పటికే వ్యాట్‌ చెల్లించాయి. మరోసారి ఆయిల్‌ఫెడ్‌ అవే ఫ్యాక్టరీల ద్వారా తాను ఉత్పత్తి చేసిన పామాయిల్‌ విక్రయాలపైనా వ్యాట్‌ను చెల్లించింది. కానీ ఇలా చేయాల్సిన అవసరంలేదని ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్పందించేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. ఆయా ఫ్యాక్టరీల మెటీరియల్‌కు వ్యాట్‌ చెల్లించినందున, వాటి ద్వారా ఉత్పత్తి అయి విక్రయించిన దానికి వ్యాట్‌ చెల్లించాల్సిన అవసరం లేదని సమాచారం. అంటే అక్కడ మినహాయింపు కోరాల్సిన అవసరం ఉంది. ఆయా కంపెనీలు చెల్లించిన రూ 3.76 కోట్లను మినహాయింపు కోరే అవకాశం ఆయిల్‌ఫెడ్‌కు ఉంది. అంటే ఆయిల్‌ఫెడ్‌ తాను అమ్మే పామాయిల్‌కు చెల్లించే వ్యాట్‌ సొమ్ములో నుంచి రూ 3.76 కోట్లు మినహాయించుకోవాలి. కానీ అలా కొద్ది సొమ్మును మాత్రమే మినహాయించినట్టు తెలిసింది. దీంతో ఆ మేరకు సంస్థ నష్టపోయిందని ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

No comments:
Write comments