కూర’గాయాల’కు మందేదీ..? (కర్నూలు)

 

కర్నూలు, జూన్ 4 (globelmedianews.com): 
మారిన జీవనశైలి నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రజలు శాకాహారం వైపు మొగ్గు చూపుతున్నారు. పచ్చటి కూరగాయలు ఇంటికి తీసుకెళదామనుకునే వారికి నింగినంటుతున్న ధరలు చూసి ముచ్చెమటలు పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు మామూలుగా ఉన్న ధరలు ఒక్కసారి అమాంతం పెరిగిపోయాయి. వర్షాభావం, వేసవి, సాగునీటి కొరత వంటివి ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు అధికారులు. నిజంగా ఇవే కారాణాలా? ప్రత్యామ్నాయాలే లేవా? ఉండీ.. దృష్టిసారించడం లేదా? అంటే చివరి మాటే నిజమని చెప్పక తప్పదు. మరోవైపు జేసీ ఆధ్వర్యంలో ధరల నియంత్రణ కమిటీ దృష్టిపెట్టకపోవడంతో కూరగాయల ధరలు టపాసుల్లా పేలుతున్నాయి.జిల్లాలో ఉల్లి, కూరగాయల సాగు ఖరీఫ్‌లో 30 వేల నుంచి 40 వేల హెక్టార్లలో సాగవుతోంది. రబీలో 2,500 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తారు రైతులు. పండించిన పంటకు కర్నూలు, పత్తికొండ, ఆస్పరిలో టమోటా మార్కెట్లు ఉన్నాయి. జిల్లాలో కోడుమూరు, ఆదోని, డోన్‌, ఆస్పరి, నందికొట్కూరు పరిధిలో కూరగాయల సాగు ఎక్కువగా చేపడతారు. కూరగాయ రైతులకు ఎకరాకు రూ.600 వంతున ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. 

కూర’గాయాల’కు  మందేదీ..? (కర్నూలు)
2018-19లో 800 హెక్టార్లకు రాయితీ ఇచ్చారు. ఈ ఏడాది ఇంకా ఇవ్వలేదని అన్నదాతలు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న కూరగాయల ధరలకు రూ.వంద నోటు ఇస్తే ఒక పూటకు కూర చేసుకునే పరిస్థితి ఉంది. బహిరంగ మార్కెట్‌కు వెళ్లి అర కిలో టమోటా, పావు మిర్చి, అర కిలో బీర తీసుకుంటే రూ.వంద నోటు ఇవ్వాల్సిందే. ఈ నెల 1వ తేదీన కిలో రూ.32 ఉన్న టమోటా ప్రస్తుతం రైతుబజారులో కిలో రూ.54 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రూ.58, బీన్స్‌ రూ.90, బీర రూ.64, కాకర రూ.60, క్యారెట్‌ రూ.34, వంకాయ రూ.32 పలుకుతోంది. ఇవే కూరగాయలు బహిరంగ మార్కెట్‌లో అయితే టమోటా రూ.60-70, పచ్చిమిర్చి రూ.65-70, బీర రూ.70, కాకర రూ.65-70, వంకాయ, క్యారెట్‌ రూ.40 చొప్పున అమ్ముతున్నారు. పెరటి సాగును ప్రోత్సహించడం జిల్లాలో కానరావడం లేదు. 15 మంది రైతులు సంఘంగా ఏర్పడి పది రకాల కూరగాయలను పండించి పట్టణాలు, నగరాలకు వ్యాన్‌లో తీసుకెళ్లి అమ్ముకోవచ్ఛు దీనికోసం ఉద్యాన శాఖ రూ.2 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. రైతుల్లో అవగాహన కల్పించి క్షేత్రస్థాయిలో అమలు చేయడం పూర్తిగా మరిచారు. వేసవిలో ముఖ్యంగా తీగ జాతి పందిరి పంటలను ప్రోత్సహించవచ్ఛు శాశ్వత, పాక్షిక శాశ్వత పందిళ్లకు రాయితీలు అందించే అవకాశం ఉంది. షేడ్‌నెట్లు, ఉమ్మడి సాగు, ఊతకట్టు పద్ధతులను ప్రోత్సహిస్తే వేసవిలో దిగుబడిని పెంచవచ్ఛు అన్నింటికంటే ప్రధానంగా భూగర్భ జలం అందుబాటులో ఉన్న మండలాల్లో రైతులకు వేసవిలో తొమ్మిది రకాల కూరగాయ విత్తనాలను 90 శాతం రాయితీపై అందించి వాటి సాగు దిశగా ప్రోత్సహించాల్సిన అధికారులు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది రాయితీ విత్తనాల కిట్లు పంపిణీ చేశారు కానీ ఈ ఏడాది అనుమతులు రాలేదన్న సాకుతో ఇప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. జిల్లాలో 53 మండలాలకు కేవలం 14 మంది ఉద్యాన శాఖ అధికారులే ఉన్నారు. దీంతో ఒక్కొక్కరు ఒక నియోజకవర్గం తిరగాల్సి రావడంతో రైతులపై శ్రద్ధ పెట్టడం లేదు.

No comments:
Write comments