ఔను...మహాఘట్ బంధన్ తెగిపోయింది

 


క్పో, జూన్ 5 (globelmedianews.com)
ఉత్తర్ ప్రదేశ్ లో మహాగడ్బంధన్ కు తెరపడింది. ఇరు పార్టీలదీ ఆత్మీయ కౌగిలి కాదని తేలిపోయింది. ఎన్నికల ఫలితాలను చూసిన వారెవరైనా ఇట్టే ఇలా చెప్పేయగలరు. గుప్పిట మూసేంత వరకే…. నన్న సామెతి అక్షరాలా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రుజువయింది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేస్తే తిరుగుండదని భావించారు. ఇద్దరం కలిస్తే ఓట్ల శాతం ఎంత పెరుగుతుందో కూడా లెక్కలు మీద లెక్కలు వేసుకున్నారు.అయితే ఆ లెక్కలన్నీ తప్పులని రుజువయ్యాయి. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఏదేదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిపోయింది. ఎన్నికల్లో ఓటమి భారం ప్రాంతీయ పార్టీల కూటమిలో కుంపటి రాజేసింది. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓ ఆట ఆడిద్దామనుకొని బొక్కాబోర్లాపడ్డ మహాకూటమిలాగే దేశవ్యాప్తంగా కూటమి పార్టీలు విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఎస్పీ నుంచి బీఎస్పీ బయటకు రావడం వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటమేనని మాయావతి తేల్చిచెప్పడంతో ప్రాంతీయ పార్టీల కూటముల అస్పష్ట వైఖరి తేలిపోయినట్టయింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదమే.. కొద్దిరోజుల క్రితం యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకొని అధికార బీజేపీని చిత్తుగా ఓడించారు. దీంతో మాయ రెచ్చిపోయారు. తమ మహాకూటమిని ఎదుర్కోవడం బీజేపీ వల్ల కాదని బీరాలు పలికారు. 


ఔను...మహాఘట్ బంధన్ తెగిపోయింది 

అఖిలేష్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ మహాకూటమి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో మాయా మరోసారి కూటమి నుంచి బయటకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. భవిష్యత్‌లో ఇక ఎస్పీతో పొత్తు ఉండదని మాయావతి తాజాగా కుండబద్దలు కొట్టేశారు. యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన బీజేపీ శ్రేణులకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి యూపీ ప్రజలు జాతీయ కోణంలో కాకుండా రాష్ట్రీయ కోణంలో ఆలోచిస్తారు. ఎస్పీ-బీఎస్పీ కలిసి ఉంటే వారికే ఓటేస్తారు. అందుకే ఇప్పుడు మాయవతి తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా బీజేపీ శిబిరాన్ని సంతోషపెట్టగా ఎస్పీ అఖిలేష్ యాదవ్‌ను షాక్‌కు గురిచేసిందనే చెప్పాలి. మొదటి నుంచీ మాయావతిలో దూకుడు ఎక్కువ. స్థిరంగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండరని భావన. ఓడినా గెలిచినా కట్టుబడి ఉండే రకం కాదు. అందుకే అలా ఓడగానే ఇలా ప్రత్యర్థులకు అస్త్రాలను అందిస్తుంటారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు జాతీయ పార్టీకి పట్టం కట్టడంతో ఎస్పీతో దోస్తీకి స్వస్తి పలికారు. నిజానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీలు అయిన ఎస్పీ- బీఎస్పీకి ఓటేస్తే అది వేస్ట్ అన్న భావన ఆ రాష్ట్ర ప్రజల్లో ఉంటుంది. అందుకే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జాతీయ కోణంలో ఆలోచించి బీజేపీ-కాంగ్రెస్‌ను గెలిపించారు. అలా అని కూటమి విచ్చిన్నం చేసుకుంటే మాత్రం మునిగేది మాయావతియే. రాష్ట్ర అసెంబ్లీ విషయంలో ఓటర్లు స్థానిక పార్టీల వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి తొందరపడి మాయావతి ముందేకూసి ఎస్పీతో దోస్తీ కట్ చేసుకోవడం తప్పుడు నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పుడు రెండు పార్టీలు కలిసినా బీజేపీని ఏం చేయలేక చతికల పడ్డారన్న అపప్రధను మూటగట్టుకున్నాయి. అఖిలేష్ యాదవ్, మాయావతి కలిశారు. ఇంకేముంది…? యూపీలో క్లీన్ స్వీప్…ఎన్నికలకు ముందు… పోలింగ్ తర్వాత కూడా వచ్చిన విశ్లేషణలు. అయితే దీనికి విరుద్దంగా ఫలితాలు వచ్చాయి. బీఎస్పీ, ఎస్సీల కూటమిని మీడియా ఆహ్వానించినా ప్రజలు మాత్రం ఆదరించలేదని తేలిపోయింది.ఫలితాలు వచ్చిన తర్వాత మౌనంగా ఉన్న మాయావతి ఎట్టకేలకు తేల్చి చెప్పారు. ఎస్పీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మాయావతి చెప్పిన దానిలోనూ నిజముందని ఒప్పుకోక తప్పదు. వచ్చే ఉప ఎన్నికల్లో తాను ఒంటరిగా పోటీ చేస్తామని మాయా తెలిపారు. అంతేకాదు యాదవులు తమ పార్టీకి ఓట్లు వేయలేదని తేల్చిచెప్పారు. కనీసం అఖిలేష్ యాదవ్ తన భార్య డింపును కూడా ఈ ఎన్నికల్లో గెలిపించుకోలేక పోయారని తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు.నిజమే కనోజ్ నియోజకవర్గంలో దాదాపు 3.5 లక్షల మంది యాదవ ఓటర్లు ఉంటే డింపుల్ యాదవ్ ఎందుకు ఓడిపోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడ దళితులు కూడా డింపుల్ కు ఓట్లు వేయలేదని సమాజ్ వాదీ పార్టీ చెబుతోంది. మాయావతి కూడా ఎస్పీ ఓట్లు తమకు పడలేదని చెప్పేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో అఖిలేష్ యాదవ్ కూడా ఉప ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేేసేందుకు సిద్దమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 మంది శాసనసభ్యులు ఎంపీలుగా పోటీ చేసి గెలవడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం మీద ఊరించి.. ఊహించిన ఈ కూటమి ఫలితాల తర్వాత మాత్రం కుదేలయిందనే చెప్పాలి. అయితే ఫలితాల తర్వాత ఇది ఊహించిన పరిణామమేనంటున్నారు ఎస్పీ నేతలు.

No comments:
Write comments