శాంతి భద్రతల్లో రాజీ లేదు : జగన్

 


ఎంతటి వారైనా సరే తాట తీయండి
విజయవాడ, జూన్ 25, (globelmedianews.com)
శాంతిభద్రతల విషయంలో రాజీనే లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎవరు తప్పు చేసినా.. ఏ పార్టీ అయినా వదిలి పెట్టొద్దంటున్నారు. రెండు రోజు కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల ఎస్పీలతో కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శాంతిభద్రతల సమస్యలపై వారితో చర్చించారు. విజయవాడలో జరిగిన కాల్‌మనీ వ్యవహారంపై జగన్ సీరియస్‌గా స్పందించారు. కాల్‌మనీ వంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీని వెనుక ఏ పార్టీ వాళ్లున్నా విడిచిపెట్టొద్దని అధికారుల్ని ఆదేశించారు. విజయవాడలో వడ్డీ కట్టని మహిళలను బలవంతంగా సెక్స్ రాకెట్‌లో దించుతున్నారు.. ఈ వ్యవహారంలో మీరు ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పమని ప్రశ్నించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే.. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.


శాంతి భద్రతల్లో రాజీ లేదు : జగన్
రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే వారిని నవ్వుతూ పలకరించాలన్నారు జగన్. అమెరికా లాంటి దేశాల్లో పోలీసులను కూడా ఎన్నిక ద్వారా నియమిస్తారు. ప్రజల విశ్వాసం చురగొనటమే ఆ విధానం లక్ష్యమన్నారు. ప్రజా స్వామ్యాన్ని పోలీసులే గౌరవించకపోతే.. ప్రజలు పోలీసుల్ని ఎలా గౌరవిస్తారన్నారు. ఎమ్మెల్యేలను గౌరవించండి.. వారు అక్రమాలకు, లూటీకి పాల్పడితే సహించొద్దని చెప్పారు. ఏ రాజకీయ నేత చెడ్డ పేరు వస్తుందంటే ఏ పని చేయడు.. మన పోలీసుశాఖ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలన్నారు సీఎం. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. స్థానిక గిరిజనులకు ఉపాధి మార్గాలను అన్వేషించాలన్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో గంజాయి సాగవుతోందని.. గంజాయి సాగును రెవెన్యూ, పోలీసు, అటవీ, ఎక్సైజ్‌, వ్యవసాయ శాఖలు సమన్వయంతో అరికట్టాలన్నారు. స్పెషల్ ఆపరేషన్ చేపట్టాలన్నారు. గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం.. కాఫీ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని సూచించారు ప్రకాశం ఘటనపై ఆరా ఇటీవల ఒంగోలులో ఓ మైనర్ బాలికను వంచించి కొందరు దుర్మార్గులు రోజుల తరబడి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు.  ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రికి తెలిపారు. అనంతరం, బాధితురాలికి పరిహారం ఇవ్వాలంటూ సీఎం జగన్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను ఆదేశించారు. మైనర్ బాలికకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామంటూ హోంమంత్రి సుచరిత ఈ సందర్భంగా వెల్లడించారు.కాగా, ఒంగోలు ఘటనలో ప్రధాన నిందితుడు గతంలో జగన్ తో సెల్ఫీలు దిగడం, వైసీపీ కండువాలు మెడలో వేసుకుని ర్యాలీల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్ సైతం ఇదే అంశంపై అధికార పక్షాన్ని ప్రశ్నించడం తెలిసిందే

బాక్సైట్ తవ్వకాలకు అనుమతి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ.. టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తవ్వకాలు జరపడం సరికాదన్నారు. బాక్సైట్‌ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక నుంచి  ఏజెన్సీలో మైనింగ్‌ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు.కాగా వైఎస్‌ జగన్‌ గతంలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని అనేక సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నెలకోసారి తప్పనిసరి పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా రిత్యా... అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒకేసారి ఆయా ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలందరికీ ప్రభుత్వం సేవలు అందుతున్నాయా.? లేదా అన్నదానిపై సమీక్ష నిర్వహించాలన్నారు. గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి అభిమానాన్ని చూరగొనాలని సీఎం ఆదేశించారు.
ప్రత్యేక హోదా కేసులు ఎత్తేయండి
 ప్రత్యేకహోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలేకాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారులనుద్దేశించి ప్రసంగించారు. ‘ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దేశంలోనే ఏపీ పోలీస్‌ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలి. ప్రజాప్రతినిధులను గౌరవించాలి. తప్పు చేస్తే ఎవరైనా ఎంతటివారైనా సహించవద్దు. పాలనా వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమే. చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్‌ ఇగోలు పక్కనపెట్టి పనిచేయాలని సూచించారు.
మద్య నిషేధం దిశగా అడుగులు
తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్, మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఉదయం కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, అక్టోబర్ 1 నాటికి ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేయాలని ఆదేశించారు. ఈ విషయమై గతంలో తానిచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని కూడా జగన్ ఆదేశించారు. ఎటువంటి రహదారి అయినా, దాబాల్లో బ్రాందీ, విస్కీ తదితరాలను విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతమున్న మద్యం షాపుల లైసెన్స్ పరిమితి ముగియగానే, మరింత కఠినంగా ఉండేలా కొత్త పాలసీని తీసుకువస్తామని, ఈ దిశగా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. షాపుల సంఖ్యతో పాటు బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్యను కూడా తగ్గిస్తామని స్పష్టం చేశారు

No comments:
Write comments