వివాదంలో కొత్త సచివాలయ భవనాలు

 


హైద్రాబాద్,  జూన్ 18, (globelmedianews.com)
హైదరాబాద్ నడిబొడ్డున 25 ఎకరాల స్థలంలో కోట్లాది రూపాయలు విలువ చేసే సచివాలయం భవనాలు చెక్కుచెదురకుండా అన్ని హంగులతో 15 ఏళ్ల క్రితమే నిర్మించారని, వీటిని కూల్చి కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందన్నారు. ప్రస్తుతం సచివాలయంలో ఉన్న భవనాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశశ్‌లో 2004లోనే నిర్మించారన్నారు. పది కోట్ల జనాభాను, 42 మంది మంత్రులకు సరిపడ అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించారన్నారు. 2004లోనే ఈ భవనాలను నిర్మించారన్నారు. ఈ భవనాలు మరో 70 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయన్నారు. ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటే కచ్చితంగా కొత్త భవనాలు నిర్మించవచ్చన్నారు. ప్రజాప్రయోజననాలకు తూట్లు పొడిచే విధంగా అధికారం ఉందని ఉన్న భవనాలను కూల్చి కొత్త భవనాలు నిర్మించడం సహేతుకమైన నిర్ణయం కాదన్నారు. 


వివాదంలో కొత్త సచివాలయ భవనాలు
ప్రస్తుతం ఉన్న సచివాలయంలో 10 బ్లాక్‌లు, 9.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం 25 ఎకరాల్లో ప్రస్తుతం సచివాలయం ఉంది. ఉమ్మడి ఆంధ్రాలోనే విలువైన భవనాలు నిర్మించారు. ఇక్కడ ఒక మసీదు, ఒక దేవాలయం అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు 58 శాతంలో భాగంగా 5.31లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి. ఆంధ్రాకు 15.21 ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు 42 శాతంలో భాగంగా, 3.85లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం ఉన్న భవనాలు కేటాయించారు. దాదాపు 10.29 ఎకరాల్లో ఈ భవనాలను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన తర్వాత తన భవనాలను ఇటీవల తెలంగాణకు కేటాయించింది. ఆంధ్ర ప్రభుత్వం కూడా 2014 తర్వాత దాదాపు రూ.30 కోట్లను ఖర్చుపెట్టి భవనాలు మరమ్మత్తు చేసింది. ఈ భవనాలన్నీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. ప్రస్తుతం సచివాలయం వెలుపల అనేక తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద మొత్తంలో అద్దెలు చెల్లిస్తూ ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయి. వీటిని సచివాలయంలో భవనాలకు తరలించి ప్రభుత్వ ధనాన్ని ఆదా చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీన సచివాలయంలోని అన్ని భవనాలను కూల్చి వేసేందుకు ముహుర్తం పెట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ రోజు కొత్త సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో 18 మంది మంత్రులు ఉన్నారు. వీరికి సచివాలయంలోని భవనాలు చక్కగా సరిపోతాయన్నారు. వీటి నిర్మాణాలు కూడా బలంగా ఉన్నాయన్నారు. ఈ భవనాలను కూల్చివేయడం వల్ల ప్రజలకు ఒరిగేదేముందన్నారు. భవనాలను కూల్చివేయడానికి సహేతుకమైన కారణం లేదన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయల వ్యయమవుతుందన్నారు. దీని బదులు ఇరిగేషన్, రైతులు, వైద్య బిల్లులకు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టవచ్చన్నారు. ప్రజల ధనంతో లగ్జరీ ఎందుకన్నారు. ప్రభుత్వం తన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ విషయమై తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

No comments:
Write comments