మరో వివాదంలో చింతమనేని

 


ఏలూరు, జూన్  20, (globelmedianews.com)
పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదం చిక్కుకున్నారు. పోలవంర కాలువపై ఉన్న పైపులు దొంగలించారనే ఆరోపణలపై ప్రభాకర్ సహా మరికొందరు అనుచరులపై కేసులు నమోదయ్యాయి. రైతులు ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో పెదవేగి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేస్ ఫైల్ చేశారు. మూడేళ్ల క్రితం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి నీళ్లు వెళుతున్నాయి. అయితే ఆ గోదావరి నీటిని దెందలూరు నియోజకవర్గంలోని పంట పొలాలు, చెరువులకు మళ్లించేందుకు అప్పటి ఎమ్మెల్యే చింతమనేని పైపులు ఏర్పాటు చేశారు.


 మరో వివాదంలో చింతమనేని
పెదవేగి, పెదపాడు మండలాల్లో పంటలు పండాయట. నీళ్లను మళ్లించడానికి ఉపయోగించిన పైపులు ప్రభాకర్‌ కొనుగోలు చేశారట. దీంతో రెండు రోజుల క్రితం చింతమనేని అనుచరులు ఆ పైపుల్ని అక్కడి నుంచి తొలగించి తీసుకెళ్లడంతో వివాదం మొదలయ్యింది. కాలువ దగ్గర ఏర్పాటు చేసిన పైపులకు సంబంధించి.. నీటిని పెట్టుకున్నందుకు ఏటా ఎకరానికి రూ.వెయ్యి వరకు చెల్లించామంటున్నారు రైతులు. పైపుల ధరకు రెట్టింపు డబ్బు ఇచ్చామని.. ఎన్నికల్లో తనను ఓడించారన్న కక్షతో ఈ పైపులను అనుచరులతో తొలగించి తన తోటల్లో వేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. మూడేళ్లపాటు ఉంచిన పైపులను ఇప్పుడు తీసుకెళ్లడంపై రైతులు ఆక్షేపిస్తున్నారు. అయితే చింతమనేని మాత్రం రైతులిచ్చిన సొమ్ము ఏటా నిర్వహణ ఖర్చులకే సరిపోలేదంటున్నారు. రైతులకు వైసీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. వెంటనే పైపుల్ని అక్కడే పెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు కాలువపై పైపుల దౌర్జన్యంగా తీసుకెళ్లారని చింతమనేనితో పాటూ కొందరు అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్‌, మరో నలుగురిపై పెదవేగిలో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే పైపుల వివాదంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలను పిలిచి చర్చిస్తామంటున్నారు. 

No comments:
Write comments