గోదావరి వినియోగమే అజెండా

 


కొనసాగుతున్న సాగునీటి రంగ నిపుణుల మేధో మధనం
విజయవాడ, జూన్ 27, (globelmedianews.com)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగునీరందని ప్రదేశాలకు గోదావరి నీటిని తీసుకెళ్లడంపై అధికారులు మేధోమధనం చేస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టును స్థిరీకరించేలా గోదావరి నీటిని ఎక్కడెక్కడి నుంచి ఎంత మేర తీసుకోవచ్చనే అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు. బంగాళాఖాతంలోకి వృధాగా వెళ్లే జలాలను వీలైనంతగా వాడుకుంటూ, తెలంగాణ, ఎపిలోని ప్రతి ఎకరాను తడపాలని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సూత్రప్రాయంగా నిర్ణయించినా, చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి.ముఖ్యమంత్రుల స్థాయిలో 27న సమావేశం జరిగే అవకాశం ఉంది. గవర్నర్ సమక్షంలో రాజ్‌భవన్‌లో, ప్రగతిభవన్‌లోనా, లేకపోతే మరో వేధికనా అన్నది కూడా తెలియాల్సి ఉంది. తొలుత ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం అయ్యాక, తదుపరి ఇరిగేషన్ సెక్రెటరీలు, ఇఎన్‌సిలు, చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో వరుస సమావేశాలు ఉంటాయి.రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అంశాలపై అధికారులు సిద్ధమవుతున్నారు. 


గోదావరి వినియోగమే అజెండా
గోదావరి నదీ జలాల లభ్యత. భవిష్యత్తు డిమాండ్, కృష్ణా జలాల లభ్యత, భవిష్యత్తు డిమాండ్‌పై గణాంకాలు తీస్తున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమి, సాగు, తాగు నీళ్ల డిమాండ్ ఎంత అనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో సైతం వ్యవసాయ యోగ్యమైన భూమెంత, నీటి వనరులేంటి, ఎంత శాతం, ఇప్పటి వరకు దానికి ఉన్న ఇరిగేషన్ సౌకర్యాలపై పాత లెక్కలు తీస్తున్నారు. ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తును 5 మీటర్లు పెంచితే భవిష్యత్తులో కృష్ణా జలాల ప్రవాహం భారీగా తగ్గిపోతుంది. ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడి రెండు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణలో శ్రీశైలం ఆధారంగా కల్వకుర్తి ఎత్తిపోతలలో 4 లక్షల ఎకరాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 12.3 లక్షల ఎకరాలు, డిండి ఎత్తిపోతలకు 4 లక్షల ఎకరాలకు సరిపడా నీరు ఇవ్వాల్సి ఉంది. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో హంద్రీ నీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి, శ్రీశైలం కుడి గట్టు కాలువ, తెలుగుగంగ, ఇలా లక్షలాది ఎకరాల ఆయకట్టు రాయలసీమలో ఉంది.కరవు జిల్లాగా పేరొందని మహబూబ్‌నగర్, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు సైతం నీటిని తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. వరద జలాలు, నికర జలాలన్న తేడాలు చూపకుండా రైతుల చెం తకు నీళ్లు తీసుకెళ్లడమే ధ్యేయ ంగా, మరో రీడిజైన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. అయితే ఈ రీడిజైనింగ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఉ న్నాయి. తెలంగాణ ఆవిర్బావం తర్వాత జరిగిన ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో తెలంగాణ బహుముఖ ప్రయోజనాలు, ధీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలతో పాటు తెలంగాణ ఆ యకట్టు స్థిరీకరణకు వీలవుతుంది.నదీ జలాల వినియోగంతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుకు సంబంధించిన పెండింగ్ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అధికారికంగా ఎటువంటి సమాచారం లేకపోయినా, అధికారులు మాత్రం అన్ని అంశాలతో సిద్ధమవుతున్నారు. గోదావరి నీటిని వినియోగించుకోవాలంటే, తెలంగాణ పరిధిలో దుమ్ముగూడెం, ఆంధ్రప్రదేశ్ పరిధిలో పోలవరం ప్రాంతం నుంచే వినియోగించుకోవాల్సి ఉంది. ఇంధ్రావతి నదీ జలాలను వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తుపాకులగూడెం బ్యారేజిని నిర్మిస్తుంది. దీంతో దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత కొంత పెరిగి, ఎక్కువ నీటిని వినియోగించుకునేందుకు వీలవుతుంది. దిగువ గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో వరద జలాలు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రా ప్రాంతంలో శబరి నది సైతం వీటికి పోటీగా ప్రవహిస్తుంది. అయితే ఈ వరద వర్షాకాలంలోనే ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఈ నదులు నిండుగా ప్రవహిస్తూ, బంగాళాఖాతాన్ని వెతుక్కుంటూ దిగువకు వెళతాయి. నాగార్జునసాగర్ సాగర్‌పై ఆధారపడి తెలంగాణలో ఎడమ గట్టు కింద ఉన్న ఆయకట్టు, హైదరాబాద్ తాగునీటికి ఎఎంఆర్‌పి, నల్లగొండలో ఎఎంఆర్‌పి కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి గట్టు కింద 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఎడమకాలువ కింద కూడా కొంత ఆయకట్టు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. మొత్తానికి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడి తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని ఆయకట్టుకు సాగు, తాగునీరు ఇవ్వాలి. ఇప్పుడు గోదావరి నీటిని పలు దశల్లో తీసుకువచ్చి, నాగార్జునసాగర్, శ్రీశైలంలను వినియోగించి, ఈ ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి ఉన్నప్పటికీ, సాధ్యాసాధ్యాలపై సాంకేతిక అధ్యయనం చేయాల్సి ఉంది. అంతకు ముందుగా ఎక్కడెక్కడ ఏమేం చేస్తే బాగుంటుంది. ఏ విధంగా నీళ్లు తీసుకువస్తే బాగుంటుందన్న దానిపై సూత్రప్రాయంగా నిర్ణయం కావాల్సి ఉంది. ముఖ్యమంత్రుల స్థాయిలో ఓ నిర్ణయం జరిగితే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments:
Write comments