తెలంగాణలో కమలం వడివడిగా అడుగులు

 


హైద్రాబాద్, జూన్ 14,  (globelmedianews.com)
తెలంగాణలో బలోపేతమయ్యే దిశగా భారతీయ జనతాపార్టీ పావులు కదుపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా నిలవాలనే లక్ష్యంతో చక్రం తిప్పుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో దక్షిణ భారతదేశంలో తెలంగాణను గేట్‌వేగా మార్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటివరకు అండగా నిలిచిన సామాజిక వర్గానికి చెందిన నేతలకు గాలం వేసే పనిని ముమ్మరం చేసింది.ఛాన్స్ ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే గెలుచుకున్నా... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా 4 స్థానాలు సాధించిన కమలం పార్టీ... 2023లో తెలంగాణలో అధికారం తమదేనని అంటోంది. టీఆర్ఎస్‌కి తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులు.. అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా... మునిగిపోయే నావలా మారిన కాంగ్రెస్‌ నుంచీ నేతలు తలో దారీ చూసుకుంటుంటే... అలాంటి వారిని తమవైపు  లాక్కునేందుకు కమల దళం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇద్దరు కీలక ఎంపీలను తమవైపు తిప్పుకుంటోందని తెలిసింది.తెలంగాణ కాంగ్రెస్‌‌కు చెందిన ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డితో... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చర్చలు జరిపినట్లు తెలిసింది. 


తెలంగాణలో కమలం వడివడిగా అడుగులు
వాళ్లతోపాటూ... ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌, కేసీఆర్‌ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు కూడా రామ్‌మాధవ్‌ను కలిశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ చర్చలేవీ జరగట్లేదనీ, ఇదంతా ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు. తెరవెనక మంతనాలు మాత్రం జరుగుతున్నాయనీ... ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... టీఆర్ఎస్‌లో చేరిపోవడం, మరి కొందరు కూడా చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం కలగలిపి... జంపింగ్‌లు జోరందుకుంటున్నాయి. ఐతే... లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచీ గెలిచింది ముగ్గురు ఎంపీలు. వారిలో ఇద్దరు పార్టీ మారితే... మిగిలింది ఒక్కరే. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోలుకోవడం చాలా కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో వైపుతెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చాడా సురేశ్‌రెడ్డి వంటి నేతలు బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. పెద్దిరెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు టీడీపీలో మిగిలిపోయిన నేతలను గుర్తించి వారందరినీ బీజేపీలో చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన లెంకల దీపక్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన కొత్తకోట దయాకర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీకి బలం లేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం కోల్పోవడంతో ఇదే అదనుగా టీడీపీని ఖాళీ చేసే పనిలో కాషాయపార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘టీడీపీలో ఉన్న నేతలకు కనుచూపు మేరలో రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. వారు ఆ పార్టీలో ఎన్ని రోజులున్నా అదే పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, చంద్రబాబుకు దగ్గరగా ఉండే రావుల చంద్రశేఖర్‌రెడ్డి మినహా ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరేమో’ అని ఓ బీజేపీ ముఖ్య నేత వ్యాఖ్యానించడం చూస్తే టీడీపీని ఖాళీ చేయడమే కమలనాథుల లక్ష్యమని అర్థమవుతోంది. 

No comments:
Write comments