కేసీఆర్ విధానాలు ప్రమాదకరం

 


హైద్రాబాద్, జూన్ 8 (globelmedianews.com)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి పట్ల విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.ఉన్నతస్థాయి రాజ్యాంగ పదవులలో వున్న వ్యక్తులు కేసీఆర్ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వరస చూస్తుంటే గౌరవనీయ స్పీకర్ వ్యవహార శైలిపైనా అనుమానాలు కలుగుతున్నాయని, విపక్షాల వాదనలను ఉద్దేశపూర్వకంగా కొన్ని వారాల పాటు పట్టించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరించినట్టు అర్థమవుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 


కేసీఆర్ విధానాలు ప్రమాదకరం
సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మరోమారు విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్కు వద్ద దీక్షకు దిగారు. టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దీక్షకు టీడీపీ, తెలంగాణ జన సమితి మద్దతు తెలిపారు. వీహెచ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఉండకూడదనే కేసీఆర్ ఆలోచనా తీరు సరికాదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికే ఇది వెన్నుపోటు అని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వైఖరి లేదని దుయ్యబట్టారు. పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా, ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లో కలుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచిన నేతలు, మరో పార్టీలో చేరడం సరికాదని అభిప్రాయపడ్డ వీహెచ్, ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.  టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై హైదరాబాద్, ఇందిరాపార్కు వద్ద టీ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు టీడీపీ, టీజేఎస్ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడంపై ఆ  పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పందించకపోవడం దారుణమని అన్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన స్పీకర్ అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వైఖరికి విరుద్ధమని ధ్వజమెత్తారు. ఇటువంటి వైఖరితో సభలో తమకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.  

No comments:
Write comments