ఫడ్నవిస్ కు మరోసారి కలిసొచ్చేనా

 


ముంబై, జూన్ 10, (globelmedianews.com)
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. కేంద్రంలో సర్కార్ కొలువు తీరింది. ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి సారించింది. భారీ విజయం కమలం శ్రేణులు ఖుషీగా ఉండగా, ఘోర పరాజయంతో విపక్ష కాంగ్రెస్ నిండా నిరాశలో మునిగి ఉంది. పరాజయానికి గల కారణాలపై పోస్ట్ మార్టం జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో మరో ఎన్నికల సమరం ముంచుకొస్తోంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబరు నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ఎన్నికలపై సహజంగానే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 228 స్థానాలుగల మహారాష్ట్ర దేశంలో యూపీ తర్వాత అతిపెద్ద రాష్ట్రం. దేశ ముఖ్య రాజధాని ముంబయి నగరం పలు ప్రత్యేకతలున్న దృష్ట్యా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. భారతీయ జనతా పార్టీ,శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ లు కూటమిగా పోటీ చేశాయి. ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. త్రిశంకు సభ ఏర్పడింది. 122 స్థానాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 63 స్థానాలతో దాని మిత్రపక్షం శివసేన రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 41స్థానాలతో కాంగ్రెస్, 41 స్థానాలతో ఎన్సపీ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. బీజేపీ 130, శివసేన 119 స్థానాల్లో పోటీ చేయగా మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకూ వదిలేశారు. 


ఫడ్నవిస్ కు మరోసారి కలిసొచ్చేనా

ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు పొడచూపాయి. చివరకు మద్దతు ఇచ్చేందుకు శివసేన అంగీకరించడంతో దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటయింది. విదర్భం ప్రాంతానికి చెందిన ఫడ్నవిస్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆర్ఎస్ఎస్ కేంద్రకార్యాలయమైన నాగపూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర చరిత్రలో రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఫడ్నవిస్. మరాఠాల ప్రాబల్యం కలిగిన రాష్ట్రంలో ఒక యువకుడు పెద్దగా ఓటు బ్యాంకు లేని బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంలో సాహసం చేశారు. గత ఐదేళ్లుగా మిత్రపక్షమైన శివసేన బీజేపీకి చిక్కులు సృష్టించింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో శివసేన సృష్టించిన చికాకులు అన్నీ ఇన్నీ కావు. ఒకదశలో సంకీర్ణం నుంచి వైదొలగాలని కూడా హెచ్చరికలు పంపింది. పదిహేడో సార్వత్రిక ఎన్నికల సమరంలో కలసి పోటీ చేసేందుకు కూడా శివసేన విముఖత కనపర్చింది. చివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దౌత్యంతో కథ సుఖాంతమైంది.తాజాగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో శివసేన దిగివచ్చిన మాట వాస్తవం. బీజేపీ భారీ ఆధిక్యం సాధించడంలో తన హెచ్చరికలు పనిచేయలేదని శివసేనకు అర్థమయింది. అందువల్లే ఎన్నికల ముందు నాటి దూకుడును తగ్గించింది. బీజేపీ, మోదీ స్థానాలు బలోపేతం కావడంతో వెనక్కు తగ్గింది. తాజా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 23 స్థానాలను గెలుచుకుని పై చేయి సాధించింది. మిత్రపక్షమైన శివసేన 14 స్థానాలకే పరిమిత మయింది. అందువల్ల బీజేపీతో కలసి పనిచేయడం తప్ప శివసేనకు మరో ప్రత్యామ్నాయం లేదు. అది ఇచ్చినన్ని సీట్లు తీసుకోక తప్పదు. మరీ బెట్టుకు పోతే తలబొప్పి కడుతుంది. అంతిమంగా కమలం ఆధిపత్యాన్ని అంగీకరించక తప్పదు.లోక్ సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలతో నైరాశ్యంలో మునిగిన ఎన్సీపీ, కాంగ్రెస్ ఇంకా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టలేదు. ఎన్సీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క స్థానం చంద్రపూర్ లో గెలుపొందింది. ఔరంగాబాద్ నుంచి ఎంఐఎం గెలుపొందడం విశేషం. బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే విజయకేతనం ఎగుర వేసింది. రాయ్ ఘడ్, సతారా, షీర్ పూర్ స్థానాలను ఎన్సీపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి చెందిన ఏడుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిలో నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ వంటి ఉద్దండులున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ కూటమి గెలుపు అనివార్యం కానుంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి దానిని నిలువరించే పరిస్థితిలో ఎంతమాత్రం లేదు. ఎవరు కదన్నా… అవునన్నా…ఇది చేదునిజం.

No comments:
Write comments