పట్టా దార్ పాస్ పుస్తకాల్లో మళ్లీ మార్పులు

 


వరంగల్, జూన్ 1, (globelmedianews.com)
భవిష్యత్‌లో ఎలాంటి భూవివాదాలు తలెత్తకుండా పటిష్టమైన రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ చట్టం అమలులోకి వచ్చాక ప్రజలకు ఆధార్‌ నంబర్‌ ఇచ్చినట్లుగానే ఒక్కో కమతానికి ఒక్కో టైటిల్‌ నంబర్‌ కేటాయించనున్నారు. అయితే ముందు సమగ్ర భూసర్వే చేపట్టాల్సిందేనని, కచ్చితమైన భూవిస్తీర్ణాన్ని రికార్డుల్లో నమోదు చేసిన తర్వాతే కంక్లూజివ్‌ టైటిల్‌ జారీ చేయాలని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జారీ చేసిన పాస్‌ పుస్తకాలు, రిజిస్ట్రేషన్‌ సేల్‌ డీడ్‌ డాక్యుమెంట్ల పరిస్థితి ఏమిటనే సందేహం రైతులు, ఇతర వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే వీటి స్థానంలో మళ్లీ కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వకపోవచ్చని, డాక్యుమెంట్లలో ఉన్న వివరాలను  మరోసారి క్షేత్ర స్థాయిలో సరిచూసి నంబరింగ్‌ ఇవ్వడమే మేలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.వ్యవసాయ భూముల్లోగానీ, ఖాళీగా వదిలేసిన ప్లాట్లలో వివిధ కారణాలతో హద్దులు జరగడం సాధారణమే. 


పట్టా దార్ పాస్ పుస్తకాల్లో మళ్లీ మార్పులు
ఏళ్లుకేళ్లు భూములను కొలవకపోవడం, తరాలు మారే క్రమంలో వారసత్వంగా వచ్చిన భూముల విస్తీర్ణం, గెట్లపై కొందరు వారసులకు సరైన అంచనా లేకపోవడంతో పక్కనే ఉండే భూమి యజమాని తమ భూమిని ఆక్రమించినా గుర్తించే పరిస్థితి ఉండడం లేదు. సమగ్ర భూసర్వే చేసే క్రమంలో రికార్డుల్లో ఉన్న భూవిస్తీర్ణానికి, వాస్తవ విస్తీర్ణానికి మధ్య ఉన్న తేడాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. భూరికార్డుల ప్రక్షాళనలో కేవలం అనుభవదారు కాలమ్‌లో ప్రస్తుతం కాస్తులో ఉన్న యజమాని పేరు చేర్చి కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేశామని, ఫీల్డ్‌లో ఎంత భూమి ఉందనే విషయం చూడలేదని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. కంక్లూజివ్‌ టైటిట్‌ జారీకి  ఖచ్చితంగా సమగ్ర భూసర్వే చేపట్టాల్సిందేనని, అయితే రికార్డుల్లో ఉన్న భూమికి, సర్వేలో తేలిన లెక్కకు గుంట తేడా వచ్చినా వివాదాస్పదంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదని పేర్కొంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళనకు సమాంతరంగా అప్పుడే సర్వే నిర్వహించి ఉంటే అనేక వివాదాలు అక్కడికక్కడే పరిష్కారమయ్యేవని, పాస్‌బుక్కుల్లోనూ ఖచ్చితమైన విస్తీర్ణం నమోదయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో మొత్తం భూ కమతాల పరిమాణం -61.97 లక్షల హెక్టార్లు ఉండగా, భూకమతాలు కలిగిన వారు – 55.54 లక్షలు మంది ఉన్నారు. -రాష్ట్రంలో గత రెండేళ్లలో భూములు కలిగిన 90 శాతం మందికి పట్టాదార్‌ పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ.. కొత్త పాస్‌పుస్తకాల కోసం, పుస్తకాల్లో దొర్లిన తప్పులను సవరించేందుకు రైతులు ఇంకా తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలా ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. చనిపోయిన పట్టాదారు పేరు మీద 37 వేలకుపైగా పాస్‌పుస్తకాలు జారీకాగా, ఆధార్‌ నంబర్లు తప్పుగా నమోదైనవి 27 వేలు, ఫొటోలు తప్పుగా ముద్రించినవి 18 వేలు, తండ్రి పేరు తప్పుగా వచ్చినవి 11 వేలు, పట్టాదారు పేరు తప్పుగా వచ్చినవి 17 వేలు, విస్తీర్ణం తక్కువగా నమోదైనవి 43 వేలు, ఎక్కువగా నమోదైనవి 37 వేలు, రెండు ఖాతాలు వచ్చినవి 34 వేలు, తప్పుడు సర్వే నంబర్లు ప్రింట్‌ అయినవి 12 వేలు, అటవీ శాఖతో ఉన్న వివాదాలకు సంబంధించిన దరఖాస్తులు10 వేలకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి.అయితే ధరణి వెబ్‌సైట్‌లో భూముల వివరాలను సరిచేసేందుకు అవసరమైన కొన్ని ఆప్షన్స్‌ను తహసీల్దార్లకు ఇవ్వకపోవడం, వారికి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ అంశాన్ని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments:
Write comments