నిజామాబాద్ జిల్లాలో పార్టీ వ్యూహాలు

 


నిజామాబాద్, జూన్ 15, (globelmedianews.com)
నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని తొలిసారిగా కైవసం చేసుకున్న బీజేపీ.. నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల నుంచి.. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే లోక్‌సభ స్థానాన్ని గెలుచుకునే స్థాయికి చేరేందుకు దోహదం చేసిన అంశాలను విశ్లేషించుకుంటోంది. ఇదే జోష్‌ను కొనసాగిస్తూ క్యాడర్‌ను బలోపేతం చేసుకోవాలని పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ఓట్లు పొందిన విషయాలపై సమీక్షించుకుంటూ ఓటు బ్యాంకును ఇంకా పెంచుకొనే దిశగా సాగాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ చతికిలపడింది. కానీ పార్లమెంట్‌ నాటికి ఓటర్లలో స్పష్టమైన మార్పు కనిపించింది. జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం కూడా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ అసలు ప్రభావమే చూపలేదు. 


నిజామాబాద్ జిల్లాలో పార్టీ  వ్యూహాలు
దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులా, మోదీ ప్రభావమా అనేది పక్కన పెడితే.. బలపడేందుకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దనే ఆలోచనతో నాయకులు ఉన్నారు.బీజేపీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపీ అర్వింద్‌.. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్యుల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాజకీయ వేడి తగ్గకముందే.. ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న ఆలోచన కొనసాగేలా కార్యాచరణను అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని అర్వింద్‌, పార్టీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి ఇప్పటికిప్పుడు క్షేత్రస్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటనే విషయాలను వారికి వివరించినట్లు తెలిసింది. నేతలు సైతం అర్వింద్‌ ఆలోచనలతో ఏకీభవించారని స‌మాచారం. ఇందుకోసం ఇప్పటి నుంచే కష్టపడాల్సి ఉంటుందని, ఆయా పట్టణాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా.. స్థానికంగా పేరున్న వారిని పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. పెద్ద నాయకులను చేర్చుకునే దిశగా పార్టీ పెద్దల ఆకర్ష్‌ వ్యూహాలు ఎలాగో ఉంటాయి.గత మున్సిపల్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో అయిదు వార్డులు, బోధన్‌లో మూడు, ఆర్మూర్‌లో ఒకటి, కామారెడ్డిలో ఎనిమిది వార్డులను బీజేపీ గెలుచుకుంది. నిజామాబాద్‌ జిల్లాలో భీమ్‌గల్‌ కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పాటైంది. గ‌తంలో నిజామాబాద్‌ మున్సిపాలిటీగా ఉన్న సందర్భంలో ఛైర్మన్‌ పదవిని రెండుసార్లు బీజేపీ కైవసం చేసుకుంది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టణ ఓటర్లు బాగా మద్దతు పలికారు. ఇదే ఓటింగ్‌ సరళి రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఉండేలా చూసుకుంటే బల్దియాల్లో బాద్‌ షాలుగా నిలవొచ్చనేది బీజేపీ వ్యూహంగా కనబడుతోంది. ఆ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది. ఎంత వరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారనేది వేచి చూడాల్సిందే.

No comments:
Write comments