రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆపరేషన్

 

జైపూర్, జూన్ 7 (globelmedianews.com)
రాజస్థాన్ లో సమూల ప్రక్షాళనకు పార్టీ అధినేత రాహుల్ గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని మొత్తం 25 స్థానాలకు గాను ఏ ఒక్కటీ కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ ప్రజల మెప్పును పొందలేకపోయిందన్నది వాస్తవం.అయితే ఇందుకు రాజస్థాన్ ముఖ్మమంత్రి అశోక్ గెహ్లాట్ ను బాధ్యుడిగా చేసేందుకు రాహుల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తన కుమారుడిని గెలిపించుకోవడం కోసమే అశోక్ గెహ్లాట్ ప్రయత్నించారని, మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోలేదని రాహుల్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆపరేషన్
ఈనేపథ్యంలో త్వరలోనే రాజస్థాన్ ప్రభుత్వంలో భారీ మార్పులు జరగనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.పార్టీ అధిష్టానం ముందరికాళ్లకు బంధం వేయడానికి అశోక్ గెహ్లాట్ కొత్త ఎత్తుగడకు దిగినట్లు కనపడుతోంది. తనకు పదవి పోయినా పరవాలేదు.. పార్టీలో ఉన్న తన ప్రత్యర్థి సచిన్ పైలట్ కు సీఎం పదవి దక్కకూడదన్న ఆలోచనలో ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉన్నట్లు కనపడుతోంది. అందుకే ఆయన సచిన్ పైలట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి ఓటమికి సచిన్ పైలట్ మాత్రమే బాధ్యత వహించాలని సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన ప్రకటన వెనక పార్టీని ఇరకాటంలోకి నెట్టడానికేనని అంటున్నారు.అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ జోధ్ పూర్ నుంచి పోటీ చేశారు. ఇది కాంగ్రెస్ కు కంచుకోట. అయితే వైభవ్ బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్ చేతిలో ఓటమి పాలయ్యారు. సచిన్ పైలట్ జోద్ పూర్ లో మనదే గెలుపు అని నమ్మించి మోసం చేశారన్నది అశోక్ గెహ్లాట్ ఆరోపణ. అయితే కుమారుడిని గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గాన్ని వదలకుండా తిరిగారని, దాని మాటేమిటని సచిన్ పైలట్ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఇలా తన పదవి ఊడటం ఖాయమని భావిస్తున్న అశోక్ గెహ్లాట్ ఆ పదవి సచిన్ పైలట్ కు దక్కకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆయనపై ఆరోపణలు చేశారంటున్నారు.

No comments:
Write comments