2022 ప్లాస్టిక్ రహిత నగరంగా హైద్రాబాద్

 


హైద్రాబాద్ జూలై 1, (globelmedianews.com)
నాలాలు, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి ఏటా ముంపు సమస్య ఎదురవుతున్నది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడానికి కారణం కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలేనని రుజువైంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు బల్దియా కార్యాచరణ రూపొందించింది. దీని ప్రకారం 2022 నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం తయారీ కేంద్రాల నుంచి అన్ని చోట్ల ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నిషేధాన్ని విజయవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సర్కిళ్ల వారీగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తే జరిమానాలు విధిస్తున్నారు. మళ్లీ మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులు సీజ్ చేయడానికి కూడా బల్దియా వెనకాడడం లేదు. ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్‌ను వాడకుండా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. దీంతోపాటు ప్లాస్టిక్ కవర్ల ప్రత్యామ్నాయాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 

2022 ప్లాస్టిక్ రహిత నగరంగా హైద్రాబాద్

సుమారు 10 లక్షల మందిని వీటిలో భాగస్వాములను చేయడానికి బల్దియా సన్నాహాలు చేస్తున్నది.పర్యావరణానికి ముప్పు గా పరిణమించిన ప్లాస్టిక్‌ను లేకుండా చేయడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ మూకుమ్మడి యుద్ధం ప్రకటించింది. 2022 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని సాకారం చేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించిం ది. ఓ వైపు భారీ జరిమానాలు విధిస్తూ తయారీ, విక్రయాలను నిర్మూలించడంతోపాటే మరోవైపు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నగరంలో రోజుకు సుమారు నాలుగున్నర వేల మెట్రిక్ టన్ను ల వ్యర్థాలు వెలువడుతుండగా, అందులో దాదాపు 30శాతానికిపైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు మున్నగు వ్యర్థాలు అధికంగా ఉంటున్నాయి. ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న అనర్థాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపాలని గతంలోనే ఆదేశించింది. మన నగరంలో సైతం నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానాకి ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డంకిగామారి ఏటా తీవ్ర ముంపు సమస్య ఎదురవుతోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడానికి కారణం కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలేనని అనేకమార్లు అనుభవపూర్వకంగా రుజువైంది.  దేశంలోని దాదాపు సగానికిపైగా రాష్ర్టాలు 50మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాయి. ఢిల్లీ, ముంభై, బెంగళూరు, చెన్నై తదితర 25ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. మన నగరంలో సైతం దాదాపు ఐదేళ్ల క్రితమే 50మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌ను నిషేధించారు. అయితే దేశంలో ఎక్కడా నిషేధం ప్రభావవంతంగా అమలవుతున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యం లో మన నగరం లో నిషేధాన్ని పక్కాగా అమలుచేస్తూ వచ్చే 2022నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తయారీ కేంద్రం నుంచి వినియోగం వరకు అన్నిచోట్లా నిర్భందం విధించడం ద్వారా నిషేధాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు. నిషేధం అమల్లో భాగంగా సర్కిళ్లవారీ తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు 50 మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌ను వినియోగించేవారికి రూ. 500జరిమానా విధిస్తున్నారు.అంతేకాదు, విక్రయించేవారికి మొదటిసారి రూ. 10వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 25వేలు జరిమానా లు విధిస్తున్నారు. మూడోసారికి దుకాణాన్ని సీజ్‌చేయడమే కాకుండా వస్తువులను జప్తుచేయాలని నిశ్చయించా రు. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు సర్కిళ్లవారీగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నారు. ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు బల్దియా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. స్కూలు పిల్లల్లో చైతన్యం కలిగించడం ద్వారా పెద్దల్లో మార్పు వస్తుందనే ఉద్దేశంతో స్కూళ్లలో అవగాహనా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ ఏడాది సుమారు 10లక్షలమందిని స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించా రు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ముందు ప్రత్యామ్నాయంగా కాగితం, గడ్డతో తయారుచేసిన సంచులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) నివేదిక ప్రకారం భారత నగరాలు ప్రతిరోజు 15000టన్నుల ప్లాస్టి క్ వ్యర్థాలను ఉత్పత్తిచేస్తున్నాయి. ఒక్కో ట్రక్కులో 10టన్నుల చొప్పున రోజుకు 1500ట్రక్కుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. అందులో 9000 టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేస్తుండగా, మిగిలిన 6000టన్నులు, అంటే 600 ట్రక్కుల వ్యర్థాలు చెత్త డంపింగ్ కేంద్రాలు, రోడ్లు, నాలా లు తదితరవాటిల్లో పడేస్తున్నారు. వ్యర్థాల్లో దాదాపు 66 శాతం ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు సంబంధించినవి కాడా, ఇవి ఆయా నివాస ప్రాంతాలనుంచి వెలువడుతున్నాయి. దేశంలో ఏటా 5.6మిలియన్ టన్ను ల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతుండగా, అందులో 60 శాతం వ్య ర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ వ్యర్థాల కా రణం గా ఏటా దాదాపు ఒక మిలియన్ సముద్రపు పక్షు లు, ఒక లక్ష వరకూ సముద్ర జంతువులు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల బారినపడి చనిపోతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర సహా ప్రపంచంలోని పది నదుల ద్వారా 90శాతం ప్లాస్టిక్ వ్యర్థా లు సముద్రంలో కలుస్తున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.

No comments:
Write comments