26 సాయంత్రం 4 గంటలకు యడ్డీ ప్రమాణం

 

బెంగళూర్, జూలై 24 (globelmedianews.com):
కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ చర్యలు ముమ్మరం చేసింది. కర్నాటక బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ప్రభుత్వం ఏర్పాటు అంశాలపై చర్చించనుంది. గవర్నర్ ని కలిసి ప్రభుత్వ  ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనుంది. కర్నాటక సీఎంగా యడ్యూరప్ప(76) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. శుక్రవారం (జూలై 26, 2019) సాయంత్రం 4 గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోలేకపోయిన కాంగ్రె‌స్-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. 
 26 సాయంత్రం 4 గంటలకు యడ్డీ ప్రమాణం

గవర్నర్‌ ఆహ్వానించగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసే అవకాశం ఉంది. యడ్యూరప్ప నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినట్టు అవుతుంది. ఇక కర్నాటకలో అభివృద్ధిపరంగా నూతన శకం ప్రారంభమవుతుందని బీజేపీ చీఫ్ యడ్యూరప్ప అన్నారు. 2018 అసెంబ్లీ  ఎన్నికల్లో ప్రజలు అతి పెద్ద పార్టీగా బీజేపీని ఆశీర్వదిస్తే.. ప్రజా తీర్పుని తుంగలో తొక్కి కాంగ్రెస్‌-జేడీఎస్ లు అధికారం కోసం అపవిత్ర పొత్తు పెట్టుకున్నాయని యడ్యూరప్ప మండిపడ్డారు. చివరికి ప్రజాస్వామ్యమే  గెలిచిందన్నారు.దక్షిణ భారత దేశంలో బీజేపీకి చెందిన తొలి సీఎం యడ్యూరప్పే కావడం విశేషం. యడ్యూరప్ప ఇప్పటివరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు (2007, 2008, 2018) సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు నాలుగోసారి సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారు. యడ్యూరప్ప పూర్తి పేరు బూకనకెరె సిద్దలింగప్ప యడ్యూరప్ప. ఆయన స్వస్థలం కర్ణాటకలోని మాండ్యా జిల్లా కేఆర్ పేట్ తాలూకాలోని బూకనకెరె గ్రామం. సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943 ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. తుమకూరు జిల్లా యెడియూర్ గ్రామ సిద్ధలింగేశ్వరుడు వారి కులదైవం. అందుకే యడ్యూరప్పకు ఆ పేరు పెట్టారు.

No comments:
Write comments