గ్రేటర్లో ఉన్న 457 పురాతన శిథిల భవనాలపై చర్యలు - దానకిషోర్

 

హైదరాబాద్, జూలై 22(globelmedianews.com)
"జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా 457 పురాతన శిథిల భవనాలు ఉన్నాయి. వీటిని కూల్చివేయడానికి వీలుగా మరోసారి నోటీసులు సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేయాలి. లేదా ఆ భవనాలలో నివాసితులను ఖాళీ చేయించి సీల్ చేయాలి. ప్రమాదానికి తావులేకుండా మరమ్మతులు చేయించాలి."  అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్, డిప్యూటి కమిషనర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫ్రెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి కాట, అద్వైత్ కుమార్ సింగ్, సిక్తాపట్నాయక్, కెనడి, కృష్ణ, చీఫ్ ఇంజనీర్లు సురేష్, జియాఉద్దీన్, టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారులు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. 
గ్రేటర్లో ఉన్న 457 పురాతన శిథిల భవనాలపై చర్యలు - దానకిషోర్

ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ సర్కిల్లో ఆదివారం జరిగిన శిథిల భవనం కూలిన సంఘటనలో 13ఏళ్ల బాలుడు మరణించడం తీవ్ర విచారకరమని, ఇంకా నగరంలో ఉన్న 457 శిథిల భవనాలను కూల్చివేయడం, సీజ్ చేయడం వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ శిథిల భవనాల తొలగింపు, సీజ్ చేయడం, మరమ్మతులు నిర్వహించడం తదితర అంశాలపై దీర్ఘకాలికంగా సమీక్షిస్తున్నప్పటికీ ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులకు చార్జ్ మెమోలు జారీచేయాలని కమిషనర్ ఆదేశించారు. 2016లో 485, 2017లో 294, 2018లో 402 శిథిల భవాలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూల్చివేయగా ఈ సంవత్సరం 765 శిథిల భవాలను గుర్తించగా వీటిలో ఇప్పటి వరకు 176 భవనాలను కూల్చివేయడం జరిగిందని, మరో 132 శిథిల భవనాలను సీజ్ చేయడం, లేదా మరమ్మతులు చేయించడం జరిగిందని దానకిషోర్ తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న 457 శిథిల భవనాల పై వెంటనే తగు చర్యలు చేపట్టాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ జోన్లో అత్యధికంగా 197 శిథిల భవనాలు, చార్మినార్ జోన్లో 122, సికింద్రాబాద్ జోన్లో 104, ఎల్బీనగర్ జోన్లో 19, శేరిలింగంపల్లి జోన్లో 8, కూకట్పల్లి జోన్లో 7 శిథిల భవనాలు ఉన్నాయని కమిషనర్ వివరించారు. వీటిలో అత్యధికంగా గోషామహల్ సర్కిల్లో 99 శిథిల భవనాలు ఉండగా బేగంపేట్ సర్కిల్లో 64, చార్మినార్ సర్కిల్లో 55, ఖైరతాబాద్ సర్కిల్లో 41 శిథిల భవనాలు ఉన్నాయని తెలిపారు. బోనాలు జరిగే ఆలయాల వద్ద హరితహారం మొక్కల పంపిణీ జీహెచ్ఎంసీ పరిధిలో బోనాలు జరిగే ఆలయాల వద్ద భక్తులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. హరితహారం పై సమీక్షిస్తూ నగరంలో హరితహారానికి కోటి మొక్కలు సిద్దంగా ఉన్నాయని, వీటిని నాటడంతో పాటు ఆగష్టు మాసాంతం వరకు ఉచిత పంపిణీని పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 47 థీమ్ పార్కులను కొత్తగా నిర్మించాలని నిర్ణయించామని, ఈ పార్కుల్లో కనీసం రెండు నుండి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వాటిని గుర్తించి ప్రతి జోన్లో రెండు స్వచ్ఛ భారత్ అంశాలు ప్రతిభింబించేలా స్వచ్ఛ థీమ్ పార్కులను నిర్మించాలని, జోన్‌కు ఒక వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరంలోని జంక్షన్లు, పార్కులను ఏవిధంగా వినూత్న పద్దతిలో నిర్మించాలి, నిర్వహణ, డిజైనింగ్ తదితర అంశాలపై త్వరలోనే ఈ రంగంలో నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు దానకిషోర్ తెలిపారు. నగరంలో ఉన్న ఎస్.టి.పిల నుండి వచ్చే నీటిని అన్ని పార్కులకు ఉపయోగించేందుకు ఎస్.టి.పిల నుండి ప్రత్యేక పైప్లైన్లను నిర్మించాలని సూచించారు. 57-64 మధ్య వృద్దులను గుర్తించేందుకు 175 బృందాలు హైదరాబాద్ జిల్లాలో 57 ఏళ్ల నుండి 64 ఏళ్ల మధ్య వయస్కులను గుర్తించేందుకు సర్కిళ్ల వారిగా 175 బృందాలు నియమించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్దాప్య పించన్ల మంజూరు వయస్సును 57 సంవత్సరాలకు నిర్థారించినందున, ఈ వయస్సు గల వారి ముసాయిదా జాబితాను జూలై 25వ తేదీలోపు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను రోజువారి లక్ష్యాలను నిర్థారించుకోవాలని సూచించారు.

No comments:
Write comments