47 రోజుల తర్వాత హైద్రాబాద్ కు మంచినీటి కష్టాలు

 

హైద్రాబాద్, జూలై 15 (globelmedianews.com)
హైదరాబాద్ నగరానికి తాగు నీటి గండం పొంచి ఉంది. రిజర్వాయర్లలో రోజురోజుకి నీటి నిల్వలు పడిపోతున్నాయి. మరో 47 రోజులకు సరిపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత తాగునీటి కష్టాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో వర్షాలు కురవడం లేదు. దీంతో రిజర్వాయర్లలలో నీటి రాక తగ్గిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోటి మందికి తాగు నీరు సప్లయ్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వర్షాలు పడకపోతే.. అగస్టు నెలాఖరుకి రిజర్వాయర్లు ఎండిపోతాయని అధికారులు చెప్పారు. హైదరాబాద్ లో తాగునీటికి తీవ్ర కష్టాలు తప్పవు, సెప్టెంబర్ రెండో వారం నుంచి నీటి సంక్షోభం ఏర్పడుతుంది'' అని వాటర్ బోర్డు అధికారి వాపోయారు.2018 జూలైతో పోలిస్తే.. 2019 జూలైలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. 
47 రోజుల తర్వాత హైద్రాబాద్ కు మంచినీటి కష్టాలు

12 అడుగుల వరకు తగ్గాయి నీటి నిల్వలు.. వాటర్ బోర్డు అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అసలే రుతుపవనాలు తెలంగాణలోకి వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. వర్షాలు కూడా పడడం లేదు. దీంతో రిజర్వాయర్లలో నీటి ప్రవాహం తగ్గింది. నాగార్జునసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో నీరు లేదు. సాధారణంగా జూలై నాటికి  రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగేవి. 5 నుంచి 10 అడుగుల నీరు వచ్చేది. ఈసారి మాత్రం పరిస్థితి దారుణం. కనీసం 1 అడుగు నీరు కూడా రాలేదని డైరెక్టర్ టెక్నికల్ వి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో ఆగస్టు వరకు సమస్య లేదన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ లో 2018 జూలై 11 నాటికి 468 మీటర్ల నీరు ఉంది. ఈసారి 459 మీటర్ల నీరే ఉంది. అంటే 9 మీటర్లు తక్కువే. నాగార్జునసాగర్ లోనూ అదే పరిస్థితి. 2018 జూలై 11 నాటికి 507 మీటర్లు ఉండగా.. ఈసారి 511 మీటర్ల నీరే ఉంది. మంజీరా రిజర్వాయర్ లో పరిస్థితి మరీ దారుణం. రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది. సింగూరూలో అదే సీన్. 2018 జూలై 11 నాటికి 1,697 ఫీట్ వాటర్ ఉంటే.. ఈసారి 1,669 ఫీట్ మాత్రమే ఉంది. నగరానికి నీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లు మంజీరా, సింగూరు. రానున్న రెండు మూడు వారాల్లో వర్షాలు బాగా కురవాలి. అప్పుడు పరిస్థితి మారుతుంది. లేదంటే తీవ్ర నీటి సంక్షోభం తప్పదని వాటర్ బోర్డు అధికారులు చెప్పారు.తాగు నీటి గండం పొంచిఉందన్న వార్త నగవాసులకు చెమట్లు పట్టిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీటి సమస్యతో నరకం చూస్తున్నారు. ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా మారనుందన్న వార్తలు వారికి నిద్రలేకుండా చేస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు బాగా కురవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

No comments:
Write comments