అయిష్టంగా రాజకీయాల్లోకి..

 


ఇష్టపూర్వకంగా పార్టీ నుంచి బయిటకు
న్యూఢిల్లీ, జూలై 6(globelmedianews.com)
మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదేనేమో. ఒక్కసారిగా రాహుల్ గాంధీ కాడి వదిలేశారు. నాకేం సంబంధం అంటూ అందరిలాగానే తానూ కాంగ్రెస్ ఓ కార్యకర్తగా ఉంటానని ముచ్చటపడుతున్నారు. ఆలిండియా ప్రెసిడెంట్ బాధ్యతలు చాలా బరువు గురూ అంటూ గట్టిగానే నిట్టూరుస్తున్నారు. నిజమే కాంగ్రెస్ పార్టీని నిభాయించడం అంటే చిన్న విషయమా ఆసేతు హిమాచలం తెలిసిన పార్టీ, ఇప్పటికీ ప్రతీ గ్రామంలో బడి, గుడి ఉంటుందో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ జెండా మాత్రం ఎగురుతుంది.

అయిష్టంగా రాజకీయాల్లోకి..

అంతటి లోతుల్లోకి వెళ్ళగలిగిన ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ తప్పుడు విధానాల వల్ల ఇపుడు ఈ గతి పట్టింది. పార్టీలో అనువంశిక పాలన మొదలై అర్ధ దశాబ్దం పై దాటింది. నిజమైన నాయకులకు ఎదిగే చోటు లేదు. అసలైన కార్యకర్తలకు అందలాలూ దక్కేది లేదు. అయినా చెట్టు పేరు చెప్పుకునే ఇన్నాళ్ళూ కాలక్షేపం చేస్తూ వచ్చింది. ఇపుడు చెట్టు పేరు కూడా జనం మరచిపోయిన వేళ కాంగ్రెస్ కి చెప్పుకునేందుకు కూడా ఏమీ మిగలని పరిస్థితి.కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ మరణమే అతి పెద్ద శాపం. ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినపుడు కొన్నాళ్ళు తెలుగువాడైన మన పీవీయే సారధ్యం వహించి గాడిన పెట్టారు. అయితే భజన బృందానికి మాత్రం ఇది గిట్టలేదు. నిజానికి పీవీనే అలా ఉంచినట్లైతే కాంగ్రెస్ సొంతంగా ఈ పాటికి ఎదిగేది, గాంధీ కుటుంబం చాయలు కూడ లేకుండా మనుగడ సాగించేది. కానీ సోనియమ్మను తెర మీదకు తీసుకువచ్చారు. ఆమె కాంగ్రెస్ ని నడపగలదా అన్న డౌట్లు అప్పట్లో అందరికీ కలిగినా తన పరిధులు, పరిమితులూ తెలుసుకుని ఆమె పార్టీని జాగ్రత్తగా నడిపారు. దేశంలోని రాజకీయ వాతావర‌ణాన్నికూడా సరిగ్గా అంచనా వేసి సంకీర్ణ రాజకీయాలకు దారి చూపారు. అలా రెండు సార్లు యూపీయేను అధికారంలోకి తెచ్చారు. అయితే ఆమె వారసుడిగా వచ్చిన రాహుల్ గాంధీకి మాత్రం ఈ ధోరణి, తెలివిడి బొత్తిగా లేదంటారు. ఆయన నిలకడ లేని తత్వం కూడా రాజకీయంగా దుర్బలుడిని చేసింది. ఫలితంగా అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ ఇపుడు ఇష్టపూర్వకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.దేశంలో అతి పెద్ద పార్టీ, అర్ధ శతాబ్దం పైగా దేశాన్ని ఏలిన పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడానికి ఇపుడు సిధ్ధంగా ఉంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఎవరికైనా ఇది బాధను కలిగించే విషయమే. దేశంలో జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ నే ముందు చెప్పుకోవాలి. ఇప్పటికీ బీజేపీకి ప్రత్యామ్న్యాయం అంటే కాంగ్రెస్ మాత్రమే. అటువంటి పార్టీ ఇపుడు ఇలా సారధి లేని రధంలా మారడం అంటే దారుణమే. ఇది స్వయంకృతాపరాధం అయినా కూడా కాంగ్రెస్ మళ్ళీ కోలుకోవాలని, దేశంలో మనుగడ సాగించాలని అంతా కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ రెండు పరాజయాలకే పార్టీని వదిలేశారు. ఆయన 2024 వరకూ ఓపిక పట్టి ఉంటే బాగుండేది అన్న భావన కూడా కలుగుతోంది. ఏమైనా కూడా కాంగ్రెస్ కి ఇపుడు కాని కాలమే. ఈ సంక్షోభం కొత్త తీరాలకు చేరుస్తుందో, ఉన్న చోటనే ముంచేస్తుందో చూడాలి మరి

No comments:
Write comments