తెలంగాణలో ప్రైవేట్ వర్శిటీలు

 

అమల్లోకి వచ్చిన కొత్త చట్టం
హైద్రాబాద్, జూలై 20, (globelmedianews.com)
రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం అమల్లోకి వచ్చింది. దీనిని ‘తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్టు -2018’ గా వ్యవహరిస్తారు. గతేడాది 
మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం బిల్లుకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు.  ఉన్నత విద్యలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల సాధన, విద్యార్థులను సుశిక్షితులు చేయడం, వాస్తవికమైన పరిశోధనలు లక్ష్యంగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రైవేట్ యూనివర్సిటీలలో తెలంగాణ స్థానికులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులో నిబంధన పొందుపర్చారు. ఈ యూనివర్సిటీల సీట్ల భర్తీకి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు తప్పనిసరిగా యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్(యుజిసి), 2003 నిబంధనలు పాటించాలి. ఈ వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్స్ ఇవ్వమని, ఎలాంటి ఆర్థిక సహకారం అందించదని బిల్లులో స్పష్టం చేశారు. 
తెలంగాణలో ప్రైవేట్ వర్శిటీలు

అలాగే ఈ వర్సిటీలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీతో అయినా ఒప్పందం చేసుకోవచ్చు. ఈ వర్సిటీలను విస్తరించుకునే స్వేఛ్చ కల్పించారు. ఒక క్యాంపస్‌తో వర్సిటీని ప్రారంభించుకుని, తర్వాత వాటిని నిబంధనల మేరకు మూడు క్యాంపస్‌లకు విస్తరించుకునేందుకు అనుమతిస్తామని బిల్లులో పేర్కొన్నారు. ఉన్నత విద్యలో పరిశోధనలు,ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని, క్యాంపస్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పాలి. నిధుల సేకరణ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. సంబంధిత చట్టాలకు లోబడి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమల నుంచి నిధులు, స్థిరచరాస్తులు సమకూర్చుకోవచ్చు.ప్రైవేట్ వర్సిటీలకు తమ కోర్సులకు సొంతంగా ఫీజులు నిర్ణయించుకునే అధికారం కల్పించారు. ఆయా వర్సిటీల ఫీజు నిర్థారణ కమిటీలు వాటి కోర్సులకు ఫీజును నిర్ణయించాలని పేర్కొన్నారు. యూనివర్సిటీలుగా మారాలనుకునే విద్యాసంస్థలు యూనివర్సిటీగా మారే వరకు ప్రవేశాలలో ప్రస్తుత రిజిర్వేషన్లు అమలు చేయడంతో పాటు టిఎఎఫ్‌ఆర్‌సి నిర్థారించిన ఫీజునే కొనసాగించాలి. ఆయా వర్సిటీలు తమ కోర్సులు ప్రారంభించిన ఐదేళ్లలోపు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్(నాక్) గుర్తింపు పొందాలి. ఏ వర్సిటీకి ఏ గ్రేడ్ కేటాయించారో ప్రభుత్వానికి తెలియజేయాలి. అలాగే ఆయా కోర్సుల సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణపై ప్రైవేట్ వర్సిటీల యాజమాన్యాలకే నిర్ణయాధికారం ఉంటుంది. సొంతంగా కోర్సులు రూపొందించుకోవచ్చు. గౌరవ డిగ్రీలు కూడా ఇచ్చుకునే అవకాశం కల్పించారు. వర్సిటీలలో హాస్టళ్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. యూనిరవర్సిటీ గవర్నింగ్ బాడీలో సభ్యుడిగా సెక్రటరీ స్థాయి ప్రభుత్వ అధికారి ఉండాలి. ఏడాదికి నాలుగు సార్లు గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించాలి.ప్రైవేట్ వర్సిటీ ఏర్పాటుకు వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు నిపుణులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ వర్సిటీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను, ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను పరిశీంచి, ప్రభుత్వానికి 60 రోజుల్లో సిఫార్సులు చేయాలి. ఈ కమిటీ నుంచి సిఫార్సుల అందిన తర్వాత ఆయా వర్సిటీలకు అనుమతి ఇవ్వడం లేదా తిరస్కరించడం లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో మార్పులు ప్రతిపాదించడం చేయవచ్చు.రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలు ప్రైవేట్ యూనివర్సిటిలుగా మారే అవకాశం కనిపిస్తుంది. అందుకు ఆయా కళాశాలల యాజమాన్యా లు అనుమతి కోరితే ప్రైవేట్ వర్సిటి హోదా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మక సంస్థలకే ప్రైవేట్ వర్సిటిల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.

No comments:
Write comments