అంతా అగమ్య గోచరం (పశ్చిమగోదావరి)

 

ఏలూరు, జూలై 25 (globelmedianews.com): 
అన్నపూర్ణగా పేరుపొందిన జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సార్వా (ఖరీఫ్‌) మొదలై దాదాపు నెలన్నర కావస్తోంది. కానీ జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే లోటు వర్షపాతమే. అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడుతున్నా...సాగుకు అనుకూలించే పరిస్థితి లేదు. చాలా చోట్ల నారుమళ్లు పోయలేదు. పోసిన చోట్ల నాట్లు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. వరుణుడు కరుణిస్తేనే సార్వా సక్రమంగా సాగుతుంది. ఆలస్యంగా సాగితే ఖరీఫ్‌కు కష్టకాలం...తర్వాత వచ్చే రబీకి కూడా గడ్డుకాలం తప్పేట్టు లేదు. వచ్చే వారంలో కూడా తేలికపాటి వర్షాలు తప్పితే ..భారీ వర్షాలు కురిసే అవకాశం అంతంత మాత్రమేనని వాతావరణ విభాగపు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేసే దిశగా వ్యవసాయశాఖ సమాయత్తమైంది. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా మూడు దశల్లో వేర్వేరు పంటల సాగుకు కార్యాచరణ రూపొందించింది.
అంతా అగమ్య గోచరం (పశ్చిమగోదావరి)

జిల్లా మొత్తం మీద 2.29 లక్షల హెక్టార్లలో సార్వా సాగుకానుంది. దీనికి 11,450 హెక్టార్లలో నారుమళ్లు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 8,650 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. అంటే 75శాతం పూర్తయ్యింది. ఇదే సమయానికి గత ఏడాది నూరుశాతం నారుమళ్లు పోశారు. జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో ఇప్పటి వరకు 12,500 హెక్టార్లలో నాట్లు వేశారు. గత ఏడాదిలో ఈ సమయానికి 40శాతం వేశారు. ఇటీవల తాడిపూడి, పట్టిసీమ కాలువల ద్వారా నీరు వదలడంతో నాలుగు రోజుల నుంచి సార్వా సాగు కొద్దిగా ఊపందుకుంది. ఎత్తిపోతల పథకాలు, కాలువలు, బోర్లకు తోడు వరుణుడు కరుణిస్తేనే సార్వా సజావుగా సాగుతుంది. అయితే జిల్లాలో జులై నెలలో ఇప్పటి వరకు చిరుజల్లులు తప్ప భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. చాలాచోట్ల నారుమళ్లు కళతప్పాయి. దుక్కి దున్ని వదిలేశారు.గత ఏడాదితో పోల్చుకుంటే జూన్‌, జులై నెలల్లో వర్షాలు బాగా తగ్గాయి. కిందటి ఏడాది జులై నెలలో భారీవర్షాలు కురిశాయి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్నాయి. జూన్‌, జులై నెలలో పరిశీలిస్తే జిల్ల్లావ్యాప్తంగా 30 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. సాధారణ వర్షపాతం నమోదైన మండలాలు రెండు కాగా 16 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 2018-19 జూన్‌ నెలలో 114.7 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 165.1 మి.మీ. వర్షం కురిసింది. అంటే 50.4 మి.మీ. అధికంగా నమోదైంది. ఈ ఏడాదిలో 42 మి.మీ. వర్షం కురిసింది. అంటే 72.7 మి.మీ. లోటుగా నమోదైంది. 2018-19 జులై నెలలో 250.2 మి.మీ. కురవాల్సి ఉండగా 306.2 మి.మీ వర్షం కురిసింది. అంటే 56.7 మి.మీ వర్షపాతం అధికంగా నమోదైంది. ఈ ఏడాది జులై నెల చూసుకుంటే ఈనెల 11వ తేదీ నాటికి 75.0 మి.మీ. కురవాల్సి ఉండగా 33.2 మి.మీ. లోటు వర్షపాతం నమోదైంది.వర్షాలు కురవని నేపథ్యంలో సాగు ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గుచూపేలా వ్యవసాయశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆయా మండలాల వ్యవసాయశాఖాధికారులను సాగుకు సంబంధించిన నివేదిక అందించాలని ఆదేశాలు జారీచేసింది. తదనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేలా విత్తనాలను అందించేందుకు వ్యవసాయశాఖ సమాయాత్తం అయ్యింది. తొలిదశలో జులై 15 తర్వాత జిల్లాలో 10,075 ఎకరాల్లో తృణధాన్యాలను పండించాలని ప్రణాళిక రచించింది. మినుము, పెసర, కంది, అలసంద, మొక్కజొన్న, జొన్న విత్తనాలను అందించేందుకు ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ రూపొందించింది. రెండో దశలో అంటే ఈ నెలాఖరుకు వర్షాలు లేకపోతే జిల్లాలో 25,050 ఎకరాల్లో 1945 క్వింటాళ్ల విత్తనాలను అందించి ప్రత్యామ్నాయ పంటలు వేయించాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. ఇదే పరిస్థితి ఆగస్టు నెలలో ఉంటే ఇందుకు అవసరమయ్యే విత్తనాల కోసం ముందుగానే ప్రభుత్వానికి తగు నివేదిక అందజేసింది.సార్వా నాట్లు ఆలస్యం అయ్యే కొద్దీ రైతులకు ఇబ్బందులు తప్పవు. చేలు కోతకు వచ్చే సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పలు తెగుళ్లు సోకుతాయి. ఖరీఫ్‌ పంట చేతికి రావడానికి ఆలస్యమైతే ఈ ప్రభావం రబీపంటపై పడుతుంది. రబీసాగు ఆలస్యమైతే వేసవి వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఎత్తిపోతల పథకాలు, కాల్వలు, బోర్లు ఉన్న చోట నాట్లు వేస్తున్నారు. వర్షాలు లేక ఎండ, ఉక్కబోత ప్రభావంతో వేసిన నాట్లు వేసినట్లుగానే ఎదుగుదల లేకుండా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. దుబ్బు చేసే దశలో ఉల్లికోడు, కాండంతొలుచు పురుగు, అగ్గి, పొడ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇదే వాతావరణ పరిస్థితులుంటే రెట్టింపు ఎరువులు, పురుగుమందులు వాడాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులతో సాగుకు వెనుకడుగు వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే సాగు చేయలేమంటూ కౌలు రైతులు తీసుకున్న భూములను సైతం వదిలేసే పరిస్థితిలో ఉన్నారు.

No comments:
Write comments