ఇస్రో సాయంతో గోదావరిపై సర్వే

 

హైద్రాబాద్, జూలై 6, (globelmedianews.com)

తెలంగాణ జలవనరుల వ్యవస్థను ఇప్పుడు గోదావరి వరద జలాల తరలింపునకు ప్రభుత్వం వినియోగిస్తుంది. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహాయంతో రాష్ట్రంలో జలవనరుల సమాచారాన్ని శాటిలైట్‌తో అనుసంధానం చేస్తూ గతంలోనే ప్రభుత్వం చిత్రీకరించింది. ఇప్పుడు గోదావరి వరదను కృష్ణా బేసిన్‌కు, శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడంతో గతంలో జరిపిన శాటిలైట్ చిత్రీకరణను సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఇంజనీర్లు ఉపయోగిస్తున్నా రు. ముందుగా చెరువులతో మొదలుపెట్టి, మేజర్ ఇరిగేష న్ ప్రాజెక్టులు, వాటి ఆయకట్టు వరకు, కెనాల్ వ్యవస్థ, అంతా డిజిటలైజ్ చేశారు. దీనికి తోడు కొత్తగా గొలుసుకట్టు వ్యవస్థ పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణానికి సైతం ఇదే విధానాన్ని ప్రభుత్వం ఉపయోగించింది. తాజాగా గొలుసుకట్టును వ్యవస్థ ఏ చెరువు నుంచి ఎక్కడెక్కడ కలి సి, వాగుల్లో చేరుతుందో సమగ్ర నివేదిక డిజిటలీకరణ చేసి ఇరిగేషన్ శాఖ చేతిలో ఉంది. గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే క్రమంలో ఈ గొలుసుకట్టు వ్యవస్థను వినియోగించుకోవాలని ఇంజనీర్లు నిర్ణయించారు

ఇస్రో సాయంతో గోదావరిపై సర్వే

జలాశయంలోకి కొల్లాపూర్ సమీపం నుంచి నీరు వెళ్లేలా చేస్తే అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు, ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని ఇంజనీర్లు భావిస్తున్నారు.ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు కొంత అధ్యయనం చేశారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన ఎల్లూరు రిజర్వాయర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌ల పక్క నుంచి జలాశయంలోకి నీటిని తీసుకెళ్లే వాగులు, వంకలనే వినియోగించుకోడానికి రిటైర్డ్ ఇంజనీర్లు సైతం ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ వాగులోకి నీరు ఎక్కడెక్కడి నుంచి వెళుతుందో, గొలుసుకట్టు వ్యవస్థ ఎక్కడ మొదలవుతుందో భువన్ సాఫ్ట్‌వేర్ సాయంతో, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇరిగేషన్ శాఖ రూపొందించిన జలవనరుల వ్యవస్థ ద్వారా అధ్యయనం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ చుట్టూ ఉన్న అతి పెద్ద నల్లమల అభయారణ్యాన్ని, దాని బఫర్ జోన్‌లను సైతం దూరంగా ఉండేలా ప్రతిపాదనలు తయారు చేయడానికి తెలంగాణ ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తుపాకులగూడెం, అకినేపల్లి, దుమ్ముగూడెం ప్రాంతాల నుంచి రెండు టిఎంసిలు తీసుకెళ్లడం, నాలుగు టిఎంసిలు మళ్లించడానికి వేర్వేరుగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. అయితే ప్రతి చోట అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ ఇద్దరూ అటవీ, వన్యప్రాణి అనుమతులతో ఇబ్బందులు రాకుండా, ఆయా ప్రాంతాలకు దూరంగా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరడంతో, వీటిని తప్పించడం కోసం జలవనరుల వ్యవస్థ వెబ్‌సైట్ సాయంతో అధ్యయనం చేస్తున్నారు.తుపాకులగూడెం బ్యారేజీ సమీపం నుంచి రెండు టిఎంసిలు మళ్లించే ప్రతిపాదనలపై అధ్యయనం చివరి దశకు చేరింది. బ్యారేజీనుంచి లక్నవరం చెరువు, కాకతీయ కాలువ మీదుగా రెండు టిఎంసిల నీటిని మూసీ నది వరకు తీసుకువెళ్లవచ్చు. అక్కడి నుంచి మూసీ బ్యారేజీ నుంచి ఒక టిఎంసిని నాగార్జునసాగర్‌కు, మరో టిఎంసిని శ్రీశైలంకు తరలించే ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై కూలంకుశంగా చర్చించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి తుపాకులగూడెం బ్యారేజి సమీపం నుంచి తరలించే ప్రతిపాదనలపైనే ఇంజనీర్లు దృష్టిపెట్టారు. మూసీ బ్యారేజి వరకు తీసుకువచ్చిన నీటిని ఉదయ సముద్రంలో పోస్తే అక్కడి నుంచి అడవిదేవులపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు నేరుగా గ్రావిటీ ద్వారా వెళుతుంది. మూసీ, లేదా ఉదయ సముద్రం నుంచే కనగల్, నాంపల్లి మీదుగా కొల్లాపూర్, అచ్చంపేట సమీపంలోని చెరువుల్లోకి పంపితే గొలుసుకట్టు వ్యవస్థ ద్వారా నేరుగా శ్రీశైలం రిజర్వాయర్‌లోకి చేరుతాయి. కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు ఎత్తిపోతల కోసం తవ్విన అప్రోచ్ చానల్‌లో ద్వారా రిజర్వాయర్‌లో నీరు కలిసేలా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇందుకోసం మధ్యలో రెండు లేదా మూడు దశల్లో నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని సమాచారం. క్షేత్రస్థాయి సర్వే చేస్తే గానీ ఈ ప్రతిపాదనలపై ఓ నిర్ణయానికి రాలేమని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనికి రూ.70 నుంచి 80 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. నీటిని తరలించే మార్గమంతా ఏదో ఓ ప్రాజెక్టులో ఆయకట్టుగా ఉండడం ప్రతిబంధకంగా మారుతుందని, తప్పించేందుకు టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని, ఇది 90 కిలోమీటర్ల మేర ఉంటుందని చెబుతున్నారు.

No comments:
Write comments