ఆందోళనలో అదిలాబాద్ రైతన్న

 

అదిలాబాద్, జూలై 10, (globelmedianews.com)
వర్షాదారంగా పంటలను సాగు చేసే రైతులు చినుకు జాడ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగడం కనీసం మబ్బులు పట్టి వర్షాలు కురిసే అవకాశాలు సైతం కనిపించక పోవడంతో అదును దాటుతోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జూన్ ప్రారంభంలో వర్షాలు పడాల్సి ఉండగా చివరి వారం కావస్తున్నప్పటికి వర్షాలు పడక పోవడంతో రైతన్నలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడక పోతే తాను విత్తుకున్న విత్తనాలు నష్టపోతామేనని దిగాలు చెందుతున్నారు. వర్షం పడక పోతే పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని ఆవేధన చెందుతున్నారు. 
ఆందోళనలో అదిలాబాద్ రైతన్న

సాగు నీటి ప్రాజెక్టులు, బోర్లపై ఆధారపడ్డ కొంత మంది రైతులు విత్తు వేసుకున్నప్పటికి భూగర్భజలాలు అడుగంటి పోయి పంటకు నీరందక దిగాలు పడుతున్నారు. బోర్ల కింద సాగు చేసే రైతులు మరిన్ని వైపులు లోనికి దించుతూ నీటి జాడను పట్టే ప్రయత్నం చేస్తున్నారు.నిండా నీటితో కళకళలాడే తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుపై ఆదారపడి పంటలను సాగు చేసే ఆయకట్టు రైతుల పరిస్థితి సైతం అగమ్యగొచరంగా మారింది. కాలువ ద్వారా వచ్చే ప్రాజెక్టు నీటిపై ఆశలతో విత్తుకున్న ఆయకట్టు రైతులు ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో చేసేదేమి లేక చినుకు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం 271.5 మీటర్లకు నీటి నిలువ పడిపోయింది. ఎడమకాలవ ద్వారా 6 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉన్నప్పటికి వంద నుంచి 2 వందల ఎకరాలకు సైతం నీటిని అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు నీటిపై ఆశతో విత్తుకున్నామని, కాలువ ద్వారా నీఉ అందడం లేదని, విత్తనాలు వేసి వారం దాటినా వర్షం కూడా కురవడం లేదని జామిడి గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి అనే రైతు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.అటు చినుకు లేక ఇటు ప్రాజెక్టు నీరందక విత్తు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. ఈ విషయమై మత్తడి వాగు ప్రాజెక్టు జేఈ సంగీత్‌ను సంప్రదించగా.. ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్‌స్టోరేజికి చేరుకుందని, వర్షాలు కురిసి ఇన్‌ఫ్లో వస్తే తప్ప నీటిని అందించే వీలు లేదని పేర్కొన్నారు. ఒక వేళ ఉన్న నీటిని మొత్తం వదిలినా చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరే పరిస్థితి లేదని వెల్లడించారు. ఇదిలా ఉంటే వర్షాలు సంవృద్దిగా కురువాలని పలువురు గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేస్తుండగా మరోపక్క అగ్రో ఎప్లాయిస్ అసోసియేషన్ కప్పతల్లి పూజలు, హనుమాన్ ఆలయంలో వర్ణహోమం, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికైన వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు.

No comments:
Write comments