రోజుకో మలుపు తిరుగుతున్న కర్నాటకం

 

21 మంది మంత్రుల రాజీనామా
మాకేం సంబంధం లేదంటున్న బీజేపీ
బెంగళూర్, జూలై 8  (globelmedianews.com):
కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో కర్ణాటక ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే ఆ పార్టీకి మద్దతిస్తానని గవర్నర్‌కు రాసిన లేఖలో నగేశ్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన ఆయన ఇప్పటికే ముంబయి చేరుకుని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిశారు. అలాగే మరో మంత్రి, బీదర్‌ నార్త్‌ ఎమ్మెల్యే రహీమ్‌ ఖాన్‌ కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే అధిష్ఠానానికి సమాచారమిచ్చానని ఆయన తెలిపారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అసంతృప్తులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల కోసం తమ పార్టీ మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్‌వెల్లడించారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్ సహా మొత్తం 22 మంది మంత్రులు రాజీనామా చేశారని మాజీ సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. వీరిలో 21 మంది కాంగ్రెస్ మంత్రులున్నారని తెలిపారు.  
 రోజుకో మలుపు తిరుగుతున్న కర్నాటకం

రాజీనామా వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ‘రాష్ట్రాల్లో ఎక్కడైనా బీజేపీ కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తుంటారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని సురేశ్‌ దుయ్యబట్టారు. మరోవైపు, పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వరతో భేటీ అయ్యారు. కాసేపట్లో ఇద్దరూ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. స్వతంత్ర అభ్యర్థి నగేశ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత శోభా కరంద్లాజే స్పందించారు. ఎవరైనా తమ పార్టీలోకి వస్తామంటే స్వాగతిస్తామని అన్నారు. అలాగే రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని, వీళ్లంతా వారి వారి పార్టీలతోనే ఉన్నారని శోభా పేర్కొన్నారు. కుమారస్వామి మెజార్టీ కోల్పోయారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, మరో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఇవ్వాలని వ్యాఖ్యానించారు
21 మంది మంత్రులు రాజీనామా : సిద్ధరామయ్య
క‌ర్ణాట‌క రాజ‌కీయ సంక్షోభం కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది మంత్రులు రాజీనామా చేసిన‌ట్లు ఆ పార్టీ నేత, మాజీ సీఎం సిద్ధిరామ‌య్య తెలిపారు. జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సిద్దరామ‌య్య చెప్పారు. క్యాబినెట్ నుంచి మంత్రులంతా స్వ‌చ్ఛందంగా రిజైన్ చేసిన‌ట్లు తెలిపారు. కొత్త క్యాబినెట్‌ను రూపొందించాల‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేసారు. బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న మంత్రుల‌కు హ్యాట్సాప్ అంటూ ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీఎం కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి గుడ్‌బై చెబుతూ ఇప్ప‌టికే 12 మంది కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ముంబైకి వెళ్లిన విష‌యం తెలిసిందే. వారికి తోడుగా ఇవాళ మ‌రో ఎమ్మెల్యే న‌గేశ్ కూడా రాజీనామా చేశారు. అయితే న‌గేశ్‌ను కిడ్నాప్ చేశార‌ని జ‌ల‌వ‌ర‌న‌రుల శాఖ మంత్రి డీకే శివ‌కుమార్ తెలిపారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితిపై సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి మాట్లాడారు. స‌మ‌స్య త్వ‌ర‌లోనే తీరుతుంద‌న్నారు. దీని గురించి ఆందోళ‌న లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం సాఫీగా సాగుతుంద‌న్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన‌ట్లే, జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసిన‌ట్లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. త్వ‌ర‌లోనే కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సీఎంవో వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిస్థితిపై తాను ఎటువంటి ఉద్వేగానికి లోను కావ‌డం లేద‌ని, రాజ‌కీయాల గురించి చ‌ర్చించాల్సిన త‌న‌కు లేద‌ని సీఎం కుమార‌స్వామి తెలిపారు.
మాకేం సంబంధం లేదు : రాజ్ నాధ్
కర్ణాటక సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. లోక్‌సభలో జీరో అవర్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అధిర్‌ రంజన్‌.. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ప్రశ్న లేవనెత్తారు. కర్ణాటక సంక్షోభానికి భారతీయ జనతాపార్టీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ స్పందిస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయదు అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. రాజీనామాల పరంపర రాహుల్‌ గాంధీతోనే ప్రారంభమైందన్నారు. రాజీనామాలు చేయాలని రాహులే అందరినీ అడుగుతున్నారని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.
మా సర్కార్ కు ఢోకా లేదు
కర్ణాటకలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. సంకీర్ణ సర్కార్‌ ముందున్న సమస్యలు త్వరలో సమసిపోతాయని చెప్పారు. త్వరలోనే కేబినెట్‌ పునర్వ్యస్థీకరణ చేపడతామని తెలిపారు. కాగా కర్ణాటకలో సంక్షోభం ఎదుర్కొంటున్న జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ సమస్యలను అధిగమించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలకు పదునుపెట్టింది.కాంగ్రెస్‌ మంత్రులు ఇప్పటికే రాజీనామా చేయగా, జేడీఎస్‌ మంత్రులు సైతం రాజీనామా చేసి ఇరు పార్టీలకు రాజీనామా చేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఆఫర్‌ చేస్తామనే సంకేతాలు పంపారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం కుమారస్వామి ప్రకటించి రెబెల్‌ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేరువయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్‌ చేయడం ద్వారా వారు బీజేపీకి దగ్గరకాకుండా నిలువరించాలని సంకీర్ణ సర్కార్‌ యోచిస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్‌ 35 మంది పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది.

No comments:
Write comments