అమాంతం పెరిగిన భూముల ధరలు

 

అదిలాబాద్, జూలై 12, (globelmedianews.com)
నిర్మల్‌ జిల్లాలో పల్లెల్లో రియల్  వ్యాపారం జోరందుకుంది. భూముల ధరలు అమాంతం పెరిగాయి. పట్టణం చుట్టూ ఉన్న గ్రామాల్లో పంట పొలాలన్నీ ప్లాట్లుగా మార్చుతున్నారు. అనుమతుల్లేకుండా లేఅవుట్లు చేస్తూ పంచాయతీలకు రావాల్సిన రూ. లక్షల ఆదాయానికి గండికొడుతున్నా అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడం గమనార్హం. ఈ అక్రమ లేఅవుట్ల విషయంలో పంచాయతీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది.వాస్తవానికి ఎక్కడైనా లేఅవుట్‌ చేసేముందు పంచాయితీ అనుమతి పొందాలి. ఒకవేళ వ్యవసాయ భూమి అయితే దాన్ని లేఅవుట్‌గా కన్వర్షన్‌ చేసేందుకు అనుమతి తప్పనిసరి. ఎంతస్థలంలో లేఅవుట్‌ చేస్తున్నారు, ఎలా తయారుచేస్తున్నారు.. తదితర వివరాలతో తయారుచేసిన ప్లానింగ్‌తో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం స్థలంలో 10 శాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలి. వచ్చిన దరఖాస్తులపై గ్రామ సభలో చర్చించి అందరి అంగీకారం మేరకు అనుమతులు తీసుకోవాలి. 
అమాంతం పెరిగిన  భూముల ధరలు

ఆ తర్వాత లేఅవుట్‌ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా అనుమతి పొందిన లేఅవుట్‌లో 33 అడుగుల వెడల్పుతో రహదార్లు, వీధిదీపాలు, నీటిట్యాంకు, ప్రార్థనా మందిరాలు, తదితర ఏర్పాట్లను నిర్వాహకులే చేపట్టాల్సి ఉంది. ఈ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుమతి కోసం పంచాయతీకి చెల్లించాల్సిన రుసుమును ఎగవేస్తున్నారు. భూమి స్వభావాన్ని మార్పిడి చేయకుండానే పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చుతున్నారు. పన్నులు చెల్లించకపోవడం ఆ స్థలాల్లో రహదారులు, మురుగుకాలువలు, విద్యుత్‌, తదితర వసలేవీ కల్పించడం లేదు. ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూస్తూ ఉండిపోవడంతో అక్రమ లేఅవుట్ల దందా జోరుగా సాగుతోంది.ఎక్కడ కూడా అసలు అనుమతులు పొందకుండానే అక్రమలేఅవుట్లను దర్జాగా ఏర్పాటు చేస్తున్నారు.నిర్మల్‌ చుట్టూ ఉన్న పల్లెల్లో అక్రమ లేఅవుట్లు జోరందుకున్నాయి. అన్ని వసతులు అందుబాటులో ఉండటంతో చుట్టూ పల్లెవాసులు సమీపంలో ఉన్న గ్రామాల్లో ప్లాట్లు కొనుగోలు చేసుకుంటున్నారు. పంచాయతీ ద్వారా ఇళ్ల నిర్మాణాలకు అనుమతి తొందరంగా లభిస్తుండటంతో ఈ పల్లెల్లో ప్లాట్లు కొనుగోలు చేయడానికి  మొగ్గుచూపుతున్నారు. రెండేళ్ల క్రితం  ఇప్పటికి ధరలు బాగా పెరిగిపోయాయి. ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా స్తిరాస్థి వ్యాపారులు వాలిపోయి వాటిని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఇష్టారీతిన ధరలు పెంచుతున్నారు.  పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది స్థిరాస్తి వ్యాపారాలు ఎక్కడపడితే అక్కడ లేఅవుట్లు  చేస్తున్నారు. కాలువలు, కుంటలు, పంటపొలాలు, గుట్టలు.. ఇలా ఏ ప్రదేశం అందుబాటులోఉన్నా.. ఆ స్థలాలను లేఅవుట్‌గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌ రోజురోజుకు విస్తరిస్తుండటంతో సమీపంలో పల్లెల్లోనూ రియల్‌ వ్యాపారం జోరందుకుంది. నిర్మల్‌ మండలంలోని మంజులాపూర్‌, తల్వెద, కొండాపూర్‌, లండ్డాపూర్‌, వెంగ్వాపేట్‌, సారంగాపూర్‌ మండలం చించోలి(బి), సోన్‌ మండలం కడ్తాల్‌, లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌, తదితర గ్రామాల్లో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. కనీస అనుమతులు లేకుండానే ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట లేకపోవడం, స్థిరాస్తి వ్యాపారులకు రాజకీయ పార్టీల అండదండలు ఉండటంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

No comments:
Write comments