కరీంనగర్ లో కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్

 

డివిజన్ల ఏర్పాటులో అవకతవకలు
కరీంనగర్, జూలై 22, (globelmedianews.com)
నిర్ధిష్ట ప్రమాణాలు పాటించకుండా.. మాజీ కార్పొరేటర్లకు ప్రయోజనం చేకూరేలా అధికార యంత్రాంగం హడావుడిగా చేసిన వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదటికే మోసం తెచ్చింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో డివిజన్ల పునర్విభజన, ఓటర్ల కుల గణనలో అవకతవకలపై సాక్ష్యాధారాలతో పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపాలను సవరించేంత వరకు ఎన్నికలు నిర్వహించరాదని స్టే జారీ చేసింది. దీంతో కరీంనగర్‌ మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణపై గందరగోళం ఏర్పడింది.పునర్విభజన అనంతరం ఏర్పాటైన 2, 3, 18 డివిజన్లలో అవకతవకలు జరిగాయని, ఇష్టానుసారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఓటర్లను తారుమారు చేశారని మాజీ కార్పొరేటర్‌ కూర తిరుపతి, హౌజింగ్‌బోర్డుకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు వాడె వెంకటరెడ్డితోపాటు ఎన్నం శ్రీనివాస్, చిగురు వెంకటేశం తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి రిట్‌ పిటిషన్లలో మరో 26 మంది వరకు ఇంప్లీడ్‌ అయినట్లు సమాచారం.
కరీంనగర్ లో కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్

ప్రభుత్వం మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోనే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ముందుగా డివిజన్ల సంఖ్యను ప్రకటించిన అధికారులు, ఆ సంఖ్యకు అనుగుణంగా ఓటర్లను నిర్ధారిస్తూ హద్దులను నిర్ణయించారు. ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. కరీంనగర్‌లో 50 డివిజన్లు గతంలో ఉండగా, చుట్టుపక్కలున్న 8 గ్రామాలను విలీనం చేయడంతో వాటి సంఖ్య 60కి పెరిగింది. ఒక్కో డివిజన్‌లో ఓటర్ల సంఖ్య 3,700 నుంచి 4,600 వరకు ఉండాలని మునిసిపల్‌ అధికారులు నిర్ణయించారు. తదనుగుణంగా తొలుత డివిజన్లను పునర్విభజించినప్పటికీ, ఇంటి నెంబర్ల ఆధారంగా విభజన జరపడంతో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యంతరాలకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో మార్పులు చేసి ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతోపాటు రిజర్వేషన్ల ముసాయిదా కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరించినప్పుడే రాజకీయ జోక్యం మొదలైంది. తాజా మాజీ కార్పొరేటర్లు మునిసిపల్‌ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. డివిజన్ల రిజర్వేషన్లు ప్రభావితం అయ్యేలా ఓటర్లను ఇష్టానుసారంగా మార్చివేశారు. తాజా మాజీలైన కార్పొరేటర్లు చెప్పినట్టే మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది డివిజన్లలో ఓటర్లను చేర్చడం, తొలగించడం జరిగిందనేది వాస్తవం. శాస్త్రీయ పద్ధతి లేకుండా కొంతమంది ప్రయోజనాల కోసమే ఓటర్లను మార్చడంతో ఏకంగా 26 మంది వరకు కోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఇప్పటివరకు బీసీగానో, జనరల్‌గానో ఉన్న డివిజన్‌ ఎస్సీ లేదా ఎస్టీ అయితే పదేళ్ల వరకు తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం రాదనే ఉద్దేశ్యంతో ఓ మాజీ కార్పొరేటర్‌ రాష్ట్ర స్థాయిలో పైరవీ చేసి, ఒక వర్గం ఓటర్లను పక్క డివిజన్‌లోకి మార్పించారనే విమర్శ ఉంది. కౌన్సిల్‌లో మొన్నటిదాకా కీలకస్థానంలో ఉన్న ఓ నాయకుడు తన డివిజన్‌లో కొత్తగా వేరే డివిజన్ల ఓట్లు చేరకుండా జాగ్రత్త పడడంతో అతితక్కువ ఓటర్లుగా నమోదయ్యాయి. ఆ పక్కనే ఉన్న డివిజన్‌లో దాదాపు రెట్టింపు ఓటర్లు ఉండడం గమనార్హం3వ డివిజన్‌లో ఎస్టీ ఓటర్లు 350కి పైగా ఉండగా, అవన్నీ రాత్రికి రాత్రే 2వ డివిజన్‌లోకి చేరాయి. కేవలం ఎస్టీ ఓటర్లున్న ఇళ్లను మాత్రమే 2వ డివిజన్‌లో కలిపి, మిగతా ఓటర్లను యధాతథంగా 3వ డివిజన్‌లో ఉంచడం వల్ల ఎస్టీ రిజర్వేషన్‌ కావలసిన ఈ డివిజన్‌ జనరల్‌గానో, బీసీగానో చేసే కుట్ర జరిగిందని మాజీ కార్పొరేటర్‌ కూర తిరుపతి వాదన. ఇదే అంశాన్ని ఆయన కోర్టులో సవాల్‌ చేశారు. ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్న 2వ డివిజన్‌లో ఎస్టీ ఓటర్లను చేర్చడం వల్ల తమకు కేటాయించాల్సిన రిజర్వేషన్‌ కాకుండా పోతుందని ఎన్నం శ్రీనివాస్, చిగురు వెంకటేశం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.18వ డివిజన్‌లో ఏకంగా 600 అగ్రవర్ణ ఓటర్లను బీసీలుగా చూపించారని హౌజింగ్‌బోర్డుకు చెందిన వాడె వెంకటరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. డివిజన్‌లో 4,600కు మించకుండా ఓటర్లు ఉండాలనే నిబంధనను పక్కన బెట్టి 4,813 మంది ఓటర్లతో డివిజన్‌ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. 24వ డివిజన్లో ఏకంగా 2900 మంది ఓటర్లు మాత్రమే ఉంటే, పక్కనున్న 25వ డివిజన్‌లో 5,100 మంది ఓటర్లు ఉన్నారు. 19వ డివిజన్‌లో కూడా ఓటర్లను చేర్చడంలో అవకతవకలు జరిగాయని మాజీ కార్పొరేటర్‌ సతీష్‌ సైతం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 40వ డివిజన్‌లో ఒకే ఇంట్లో వంద మంది ఓటర్లు ఉన్నారని బీజేపీ నాయకులు చిట్టిబాబు, రాజేష్‌ సైతం కోర్టుకు విన్నవించారు.ప్రధానంగా 2,3, 18, 19 వార్డులతోపాటు అభ్యంతరాలు వ్యక్తమైన ఇతర డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రక్రియలో జరిగిన లోటుపాట్లను సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. కాగా కోర్టు ఆదేశాల మేరకు డీలిమిటేషన్‌లో హైకోర్టు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, లోపాలను సవరించి కౌంటర్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని మునిసిపాలిటీలతోపాటే కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు

No comments:
Write comments