అసైన్డ్ భూముల వ్యవహారంలో కొత్త మెలికలు

 

హైద్రాబాద్, జూలై 10, (globelmedianews.com)
అసైన్డ్‌ భూములకు పాస్‌పుస్తకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. అసైన్డ్‌ భూముల్లో కబ్జాలో ఉండి సాగు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే పాస్‌పుస్తకాలివ్వాలని, ఇతరుల ద్వారా కొనుగోలు చేసిన భూములను రీ అసైన్‌ చేసినప్పటికీ వాటికి పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసైన్డ్‌ భూములను గతంలో కొనుగోలు చేసి ఇప్పుడు రీఅసైన్‌ అయిన రైతులకు కూడా పాస్‌పుస్తకాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇది న్యాయపరంగా సమ్మతం కాదని, అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం పొంది, డీఫాం పట్టా వచ్చిన తర్వాతే వాటికి పాస్‌పుస్తకాలు ముద్రించాలని గత వారం సీసీఎల్‌ఏ నుంచి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
అసైన్డ్ భూముల వ్యవహారంలో కొత్త మెలికలు

దీంతో పాటు సాదాబైనామాల కింద పరిష్కారం చేసిన భూములకు కూడా పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.వాస్తవానికి, సాదాబైనామాల కింద రైతులకు భూములపై యాజమాన్య హక్కులు కల్పించారు. అయితే, ఆ తర్వాత సాదాబైనామాలు రాసిన వారి వారసులు, ఇతరుల నుంచి ఫిర్యాదులు వచ్చిన సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ఆ క్రమంలోనే సాదాబైనామాల ద్వారా పరిష్కారమయి, వివాదాస్పదమయిన భూములకు కూడా పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని తాజా ఉత్తర్వుల్లో జిల్లా స్థాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈరెండు కేటగిరీల సర్వే నెంబర్లను ప్రత్యేకంగా నోషనల్‌ ఖాతాల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. దీంతో రీఅసైన్, సాదాబైనామా కోటాలో యాజమాన్య హక్కులు పొందిన రైతులకు పాస్‌పుస్తకాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో ఇచ్చే రబీ సీజన్‌ పెట్టుబడి సాయానికి కూడా పుస్తకాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. దీంతో పాస్‌పుస్తకాలు వచ్చేంతవరకు రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి.

No comments:
Write comments