హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ సహకారంతో స్కూళ్లలో కురగాయల మొక్కలు

 

నిజామాబాద్ జూలై 12, (globelmedianews.com)
పాఠశాలల్లో ఇకపై కూరగాయలు సాగు చేయనున్నారు. నిత్యావసర ధరల సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. వర్షాభావం కారణంగా ధరలు అధికంగా ఉండటంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు నీళ్ల చారుతో సరిపెడుతున్నారు.తరచూ కూరగాయల ధరల పెరుగుదలతో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన పాఠశాల విద్యాశాఖ చర్యలకు సిద్ధమైంది. పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడాలనే ఆలోచనతో పాఠశాల ఆవరణలోనే కూరగాయల సాగు చేపట్టాలని భావిస్తున్నారు. తొలుత ఉన్నత, రెండో విడతలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చర్యలు చేపట్టనున్నారు.ఉమ్మడి జిల్లాలో 1532 ప్రాథమిక, 326 ప్రాథమికోన్నత, 317 ఉన్నత పాఠశాలలున్నాయి. 1.80 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 
హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ సహకారంతో స్కూళ్లలో కురగాయల మొక్కలు

పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపుదామని ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలవుతోంది. పర్యవేక్షణ లోపం, నిర్వహణ లోపాలు వెరసి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పౌష్టికాహారం అందక విద్యార్థులు బలహీనంగా మారుతున్నారు. ఏడాదికి రూ.32కోట్లు వెచ్చిస్తున్నా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలో 2,556 ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఒకటి నుంచి 5వ తరగతి చదివే ఒక్కో విద్యార్థికి రూ. 4, 6 నుంచి 10 వతరగతి చదివే విద్యార్థులకు రూ.4.40 చెల్లిస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులకు తలకు మించిన భారమవుతోంది. ఈ కారణంగా పిల్లలకు నాసిరక ఆహారమే గతవుతోంది. నాసిరకం ఆహారం కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. చిన్నతనంలోనే పోషకాహారం అందక అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తాజాగా విద్యాశాఖ స్థలం ఎక్కువగా ఉన్నచోట కాయగూరలు పండించాలని నిర్ణయించారు. ఉద్యానవన శాఖ సహకారంతో పాఠశాలలకు కూరగాయలకు సంబంధించిన విత్తనాలను సరఫరా చేయనున్నారు. ప్రతి ఏటా మే నెలలోనే నేలను చదును చేసి నీళ్లను పట్టి అందులో విత్తనాలు వేయనున్నారు. జూన్‌ మొదటి వారంలో బడులు తెరుచుకునే సరికి కూరగాయల మొక్కలు కాస్తా పెరుగుతాయి. జూన్‌ రెండో వారంలో వర్షాలు కురియగానే రెండో విడత పంటకు సిద్ధం చేయనున్నారు. మధ్యాహ్న భోజనానికి సరిపడా టమాట, పాలకూర, మిర్చి, ఆలు, వంకాయ, కొత్తిమీర, కరివేపాకు తదితర విత్తనాలు, మొలకలను ఏర్పాటు చేయనున్నారు. ఏజెన్సీ నిర్వాహకులకు అండగా తీసుకున్న నిర్ణయాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు.

No comments:
Write comments