మరోవివాదంలో కర్నాటకం

 

బెంగళూర్, జూలై 16   (globelmedianews.com)
రాజకీయం రాజ్యాంగాన్ని సైతం వివాదాస్పదం చేయగలదు. రెండు వ్యవస్థల మధ్య పీటముడి వేయగలదు. అధికారపోరాటంలో అరాచకం సృష్టించగలదు. కర్ణాటకలో గడచిన వారం రోజులుగా ఎడతెగని రచ్చ ఇప్పుడు రాజ్యాంగంపైనే కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సుప్రీం అధికారాలు , శాసనసభాపతి విచక్షణపై సందేహాలను లేవనెత్తుతోంది. ఈ రెండు రాజ్యాంగవ్యవస్థల్లో ఎవరి పరిధి ఏమిటనే శషభిషలకు తావిస్తోంది. మొత్తమ్మీద కర్ణాటకలో ఉంటుందో, ఊడుతుందో తెలియని జేడీఎస్, కాంగ్రెసు సర్కారు సుప్రీం కోర్టుకే సవాల్ గా మారింది. పార్టీ పరమైన అనర్హత వేటు, స్వచ్చంద రాజీనామాల రూటు దేనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో ఇప్పుడు న్యాయ, శాసనవ్యవస్థలు తల పట్టుకునే పరిస్థితి. పౌరుల ప్రాథమిక హక్కులతోపాటు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలను న్యాయవ్యవస్థకు అప్పగించారు మన రాజ్యాంగ నిర్మాతలు. 
మరోవివాదంలో కర్నాటకం

అదే సమయంలో ప్రజాప్రతినిధుల హక్కులు దెబ్బతినకుండా చూడాలనే ఉద్దేశంతో లోక్ సభ, రాజ్యసభ, శాసనమండలి, శాసనసభకూ స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. సభాపతులకు విశేష అధికారాలను అప్పగించారు. తమ పరిధుల్లో వేటికవి స్వేచ్ఛగా వ్యవహరించాలనే సత్సంకల్పం ఇందులో దాగి ఉంది.రాజ్యాంగనిర్దేశిత ఆశయం, ప్రవచిత విలువలు బాగానే ఉన్నాయి. కానీ అనునిత్యం రాజకీయంతో ముడిపడింది శాసనవ్యవస్థ. అందులోనూ పవర్ పాలిటిక్స్ లో ప్రజాప్రతినిధులదే పెత్తనం. పార్టీ విధేయత, ప్రలోభాలు, బెదిరింపులు, ఆర్థిక అవసరాలు రకరకాల రూపాల్లో వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటాయి. రాజకీయ అనిశ్చితి ప్రభుత్వాలపై పడకూడదనే ఉద్దేశంతోనే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారు. ఒకపార్టీ తరఫున ఎన్నికైన ప్రతినిధి వేరే పార్టీలోకి ఇష్టారాజ్యంగా మారకుండా చూడటమే ఈ చట్టం లక్ష్యం. కానీ దాని అమలు బాధ్యతను స్పీకర్ చేతిలోనే పెట్టారు. సభాపతులు సైతం అధికారపక్షం నుంచి ఎన్నికైన ప్రతినిధులే కావడంతోనే చిక్కు వచ్చిపడుతోంది. పవర్ గేమ్ లో పక్షపాత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. గంపగుత్తగా విపక్ష సభ్యులు పార్టీ ఫిరాయించినా స్పీకర్లు సకాలంలో చర్యలు తీసుకోవడం లేదు. అదే అధికారపక్షం నుంచి ఎవరేని ఫిరాయిద్దామని చూస్తే మాత్రం ముకుతాడు వేస్తున్నారు. రాజ్యాంగంలో ఉన్న సందిగ్ధత కారణంగా న్యాయస్థానాలు సైతం ఈ విషయంలో నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి. దీంతో రాజకీయ అరాచకత్వమే రాజ్యం చేస్తోంది.కర్ణాటకలో బొటాబొటి మెజార్టీతో దినదినగండంగా కొనసాగుతున్న జేడీఎస్, కాంగ్రెసు ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. పదవుల పందేరంలో తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల నుంచి అనేకమంది సీనియర్లు అసంత్రుప్తితో రగిలిపోతున్నారు. అధిష్ఠానాలు బలమైన హామీలతో వారిని కాపాడుకుంటూ వస్తున్నాయి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు, జేడీఎస్ ల పరిపాలన పట్ల ప్రజల్లో ఏమాత్రం సంత్రుప్తి లేదన్న విషయం తేటతెల్లమైపోయింది. దాంతో అసమ్మతి మరోసారి పడగ విప్పింది. వీరు రాజీనామా చేస్తే చాలు తిరిగి గెలిపించుకునే బాధ్యతను తీసుకునేందుకు బీజేపీ హామీ ఇచ్చిందనేది ప్రచారం. బలవంతంగానైనా సరే వీరిని సంకీర్ణ శిబిరంలోనే ఉంచాలనేది పాలకపక్షాల యోచన. మధ్యలో స్పీకర్ పావుగా మారిపోయారు. రాజీనామాలు ఆమోదం పొందిన మరుక్షణం ప్రభుత్వం సంఖ్యాపరంగా కూలిపోయినట్లే లెక్క. 224 మంది సభ్యులున్న శాసనసభలో నిన్నామొన్నటివరకూ 117 మంది బలంతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం 15 మంది రాజీనామాతో 102 కి చేరిపోయింది. స్వతంత్రులిద్దరూ విడిచిపెట్టేయడంతో ప్రస్తుత బలం వందకే పరిమితం. మరి అటువైపు చూస్తే బీజేపీకి 105 మంది సొంత సభ్యులతోపాటు ఇద్దరు స్వతంత్రులను కలుపుకుంటే 107 కి చేరిపోయింది. రాజీనామాలు ఆమోదం పొందినా లేక వారిపై ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించినా సభలోసభ్యుల సంఖ్య 208 పడిపోతుంది. దాంతో స్పష్టంగా బీజేపీకి అధికారం దఖలవుతుంది. ఇది జరగకుండా స్పీకర్ అడ్డుచక్రం వేస్తున్నారనేదే ఆరోపణ.కర్ణాటక ప్రభుత్వ మనుగడ అనేది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం. అంతకంటే పెద్ద ప్రశ్న ప్రస్తుతం రాజ్యాంగ సంక్షోభాన్ని స్రుష్టిస్తోంది. స్పీకర్ ను న్యాయస్థానం నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోమని ఆదేశించగలుగుతుందా? అన్నది ఒక ప్రశ్న. అదే విధంగా ఎమ్మెల్యే రాజీనామాలను ముందుగా ఆమోదించకుండా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తే వారు కొన్ని ప్రయోజనాలకు దూరమవుతారు. ఆరకంగా వారిని కట్టడి చేయాలని చూస్తున్నారనేది అనుమానం. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోగలుగుతుందా? అనర్హత వేటు వేయకుండా రాజీనామాలను ఆమోదించమని స్పీకర్ కు చెప్పగలుగుతుందా? నిజంగా న్యాయస్థానానికి ఆ అధికారం ఉందా? అన్నది న్యాయనిపుణులను వేధిస్తున్న సందేహం. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనుకుంటున్న ఎమ్మెల్యేల ప్రాథమిక హక్కును స్పీకర్ నిరోధించగలుగుతారా? అన్నది మరో న్యాయసంశయం. గొంతెమ్మ కోర్కెలు, గోడ దూకుడు వ్యవహారాలు, పక్షపాత ధోరణులు, అవకాశవాద రాజకీయాలకు చరమగీతం పాడాలంటే ఇప్పటికైనా రాజ్యాంగ ధర్మాసనం కొలువుతీరి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేకపోతే ఇటువంటి వివాదాలు దేశంలోని రాజ్యాంగ వ్యవస్థల ప్రతిష్ఠను మసకబారుస్తాయి. ఇప్పటికే అథోగతిలో ప్రస్థానిస్తున్న ప్రజాప్రాతినిధ్యంలోని నైతిక విలువలను మరింతగా దిగజారుస్తారు

No comments:
Write comments