వెదకే ఓటు (కృష్ణాజిల్లా)

 

మచిలీపట్నం, జూలై 25 (globelmedianews.com): 
ఈ ఖరీఫ్‌లో అటు ప్రకృతి సహకరించక ఇటు సకాలంలో నీరు వదలక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జూలై నెల పూర్తవుతున్నా ఇంతవరకు ఎక్కడా పూర్తిస్థాయిలో నారుమళ్లు పడని పరిస్థితి. సాగు మరింత జాప్యం అవుతుందేమోనన్న ఆందోళనతో అన్నదాతలు వెదసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు ఈ సాగుకు దూరంగా ఉండే రైతులు కూడా ఈసారి ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 3,16,770 హెక్టార్లు కాగా 3,37,277 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేశారు. వారు అనుకున్నట్లు అంతా జరిగితే లక్ష్యానికి మించి సాగు జరిగేదే. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు ఇటు పాలకులు కూడా సాగు నీరు సకాలంలో అందించలేకపోవడంతో ప్రస్తుతం వెదపద్ధతే సరైన విధానమని అన్నదాతలు భావిస్తున్నారు.
వెదకే ఓటు (కృష్ణాజిల్లా)

ప్రస్తుతం డెల్టాకు నీరు వదిలినా అవి ఇంతవరకు అన్ని కాలువలకూ చేరలేదు. ఎప్పటికి వస్తాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఎక్కువ మంది రైతులు ఇప్పటికే వెదసాగు చేపట్టారు. పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, బందరు, గుడ్లవల్లేరు, పామర్రు తదితర మండలాల్లో రైతులందరూ తమ పొలాలను మెట్టదుక్కు చేసి సాగుకు సిద్ధంగా ఉంచుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కాలువలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పటికే విత్తనాలు సిద్ధంగా ఉంచుకున్న రైతులందరూ పొలాల్లో వెదజల్లేస్తున్నారు. అడపా దడపా వర్షం పడినా మొలకలు వచ్చేస్తాయని ఈ సాగుకు సిద్ధమయ్యారు.జిల్లాలోని అన్ని నేలల్లోనూ వెదసాగు చేస్తున్నారు. పెడన నియోజకవర్గ పరిధిలో 80 వేల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం ఉంది. ఈ నియోజకవర్గంలో గతంతో పోల్చుకుంటే ఈ సాగు గణనీయంగా పెరుగుతోంది. గూడూరు మండలంలో 25 వేల ఎకరాలకు మల్లవోలు, కప్పలదొడ్డి, ఆకులమన్నాడు, కోకనారాయణపాలెం తదితర గ్రామాల్లో చాలామంది రైతులు వెదసాగు చేపట్టారు. పెడన మండలంలో చేవెండ్ర, కమలాపురం, పెనుమల్లి, నందిగామ, చెన్నూరు. కొంగంచెర్ల, గురివిందగుంట తదితర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. బంటుమిల్లి, కృత్తివెన్ను, ఘంటసాల, మోపిదేవి, మొవ్వ తదితర మండలాల్లో కూడా వెదపద్ధతిలోనే సాగు చేస్తున్నారు. దివిసీమ ప్రాంతాల్లో సీడ్‌ డ్రిల్‌ ద్వారా విత్తనాలు చల్లుతున్నారు. దీనికి సంబంధించిన యంత్రాలు కూడా ఆయా ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. పెడన మండలంలోని పలు గ్రామాల్లో కూడా యంత్రాల ద్వారానే విత్తనాలు చల్లుతున్నారు. ఎక్కువ శాతం గ్రామాల్లో రైతులే నేరుగా విత్తనాలు చల్లుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా వెదపొలాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఖరీఫ్‌లో ఎక్కువగా వెదసాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న పెట్టుబడికి ప్రత్యామ్నాయం. ప్రస్తుతం సాగులో పెట్టుబడి అన్నదాతలకు భారంగా మారింది. నారు మళ్లు వేసిన దగ్గరనుంచి పంట చేతికొచ్చేవరకు రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దీంతో ఎకరానికి 40 బస్తాలు పండినా ఏమాత్రం లాభాలు మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. సాగులో అనేక అవసరాలకు యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంపై అవగాహన లేని రైతులు ఇప్పటికీ కూలీలనే ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయ పనులు అందరికీ ఒకే సారి రావడంతో కూలీల కొరత కూడా తీవ్రమవుతోంది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువమంది వేతనదారులు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారు. 10-20 రోజుల్లో ఇక్కడ గ్రామాల్లోనే ఉండి పనులు చేసుకుని వెళ్లేవారు. కొన్నేళ్లుగా వాళ్లు రావడం లేదు. అక్కడ రెండు పంటలు పండడంతో అక్కడి పనులే సరిపోతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం అక్కడక్కడా శ్రీకాకుళం జిల్లానుంచి వచ్చేవారు మాత్రమే కనిపిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు కూడా తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు కూలీలకు అధిక వేతనం ఇచ్చి తెచ్చుకోవాల్సి వస్తుంది. కూలీలు దొరకని పరిస్థితితోపాటు పెరుగుతున్న పెట్టుబడికి ఈ వెదసాగు ప్రత్యామ్నాయంగా రైతులు భావిస్తున్నారు. 2016లో జిల్లా వ్యాప్తంగా 25వేల హెక్టార్లలో వెదసాగు జరిగితే గత ఖరీఫ్‌లో 40వేల హెక్టార్లలో చేపట్టారు. ఈసారి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తరహాసాగుకు పెద్దగా నీటి అవసరం కూడా ఉండదు. అప్పుడప్పుడు వర్షాలు పడినా సరిపోతుంది. ఇలా సాగునీటి ఎద్దడి, కూలీల సమస్య తదితరాలను పరిగణనలోకి తీసుకుని రైతులు వెదసాగు పట్ల మెగ్గు చూపుతున్నారు.

No comments:
Write comments