టీడీపీ నెట్టింట్లో గొడవలు

 

విజయవాడ, జూలై 26, (globelmedianews.com)
తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఒక కంపెనీ మాదిరిగా మారిపోయింది. రాజకీయం వ్యాపారమే అన్న రీతిలో వ్యవహారం సాగుతుంది. నేతల మధ్య మానవ సంబంధాలే లేకుండా పోయాయి. మంచి మర్యాదా మాటే లేకుండా పోయింది. హ్యూమన్ టచ్ ఏది ? ఇవన్నీ తమ్ముళ్ళు ఆవేదనతో చెప్పిన మాటలే. ఎన్నికల్లో ఘోర ఓటమికి దారి తీసిన పరిస్థితులపై సీనియర్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. ఇప్పుడు వాటిలో ఒక్కోటి సరిదిద్దుకుని పార్టీని గాడిన పెట్టే ప్రయత్నాల్లో కదులుతున్నారు అధినేత చంద్రబాబు.ఒక పక్క వైసిపి నేతలు లంచ్, డిన్నర్ లు లాగేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సైతం అధికారులతో సమీక్షల్లో మంచి చెడ్డా మాట్లాడుతూ భోజనానికి దగ్గరుండి తీసుకువెళుతున్నారు. 
టీడీపీ నెట్టింట్లో గొడవలు

మరో పక్క టిడిపి లో భిన్నమైన వాతావరణం నడుస్తుంది. కనీసం చాయ్ కి కూడా నలుగురు నేతలు కలిసి పోలేకపోతున్నారు. పార్టీ ఓటమి బాధ నుంచి ఇంకా ఎవ్వరు తేరుకోలేదు. ఇంకోపక్క కృష్ణా జిల్లా నేతలు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నెట్టింట్లో నూరేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు పయ్యావుల కేశవ్ నడుమ సాగిన సంభాషణ లో పార్టీలో హ్యూమన్ టచ్ బొత్తిగా దూరం అయ్యిందని తేల్చారు ఇద్దరు. ఒక్కరు కూడా అందరిని భోజనానికి పిలిచింది లేదని పయ్యావుల వాపోవడంతో చంద్రబాబు కూడా నొచ్చుకున్నారని సమాచారం.కృష్ణా జిల్లాలో ఇద్దరు నేతలు మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. మిగిలిన వారంతా ఇతర జిల్లాల వారే. గెలిచింది 23 మంది అయితే వారికి ఆతిధ్యం ఇచ్చేవారే లేకుండా పోయారు. గతంలో నడిచిన వైభోగం మాటెలా వున్నా కష్టకాలంలో కలిసి భోజనం చేసే వాతావరణం మృగ్యం కావడంతో చంద్రబాబు గద్దె రామ్మోహన్ ను పిలిచి ఈ విషయం ప్రస్తావించినట్లు టిడిపి వర్గాలు అంటున్నాయి. వెంటనే ఆయన కేశవ్ ను కలిసి అందరం త్వరలో భోజనం చేసేందుకు తేదీ చెబుతా అని చెప్పి వెళ్లినట్లు తెలుస్తుంది. మొత్తానికి గాడి తప్పుతున్న తమ్ముళ్ళను తిరిగి లైన్లో పెట్టేందుకు హ్యూమన్ టచ్ ఇస్తున్న బాబు ప్రయత్నం ప్రస్తుతానికి ఫలించినా భవిష్యత్తులో ఎలా వుండబోతుందో చూడాలి. అయితే ఇటీవల కొంత కాలం క్రితం కృష్ణా జిల్లా టిడిపి నేత ఇచ్చిన విందుకు ముగ్గురు నలుగురు నేతలు మాత్రమే హాజరుకావడంతో త్వరలో జరగబోయే విందు కు ఎందరు రానున్నారో చూడాలి.

No comments:
Write comments