తండ్రి బాటలో స్టాలిన్...

 


చెన్నై, జూలై 8 (globelmedianews.com)
లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న డీఎంకే అధినేత స్టాలిన్ తన నిర్ణయాలను కూడా వేగంగా తీసుకుంటున్నారు. తండ్రి కరుణానిధి తరహాలోనే రాజకీయాలను చేస్తున్నారు. ఎవరిని నొప్పించకుండా.. అలాగని తాను, తన పార్టీ నష్టపోకుండా నిర్ణయాలు తీసుకుంటుండటం, విధేయులకు పెద్దపీట వేస్తుండటంలో తండ్రిని స్టాలిన్ మరిపిస్తున్నారన్న వ్యాఖ్యలు డీఎంకేలో బాగానే విన్పిస్తున్నాయి. స్టాలిన్ తన సోదరుడు ఆళగిరి విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా ఆయన ఇమేజ్ పార్టీలో మరింత పెరిగేలా చేసిందని చెప్పకతప్పదు.ఆళగిరి స్టాలిన్ నాయకత్వానికి ఎదురుతిరగడం, చెన్నైలో ర్యాలీ నిర్వహించి కొంత అలజడి సృష్టించారు. కానీ స్టాలిన్ మాత్రం బెదరలేదు. ఆళగిరి వెంట నిలిచిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని బలమైన హెచ్చరికలను పార్టీలోకి పంపగలిగారు. దీంతో లీడర్లు ఆళగిరి వైపు వెళ్లేందుకు జంకారు. 

తండ్రి బాటలో స్టాలిన్...

దీంతో ఆళగిరి రాజకీయంగా మౌనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా లోకల్ కాంగ్రెస్ నేతలు పేట్రేగిపోవడంతో సెలెంట్ గానే వారికి తన సత్తా చూపినట్లయింది.తమిళనాడులో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో మూడు స్థానాలు అన్నాడీఎంకే, మూడు స్థానాలు డీఎంకేకు దక్కుతాయి. ఇటీవల ఉప ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలను గెలవడంతో స్టాలిన్ తన పార్టీ తరుపును ముగ్గురు రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే వీలుంది. అయితే కాంగ్రెస్ ఒక రాజ్యసభ స్థానాన్ని కోరింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపాలని భావించింది. అయితే ఈలోపు తమిళనాడు కాంగ్రెస్ నేతలు అనవసర వ్యాఖ్యలతో చేయాల్సినంత డ్యామేజీ చేసేశారు. దీంతో స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఇచ్చేందుకు అంగీకరించలేదు.స్టాలిన్ ఎక్కువగా లోకల్ గా తనకు ఉపయోగపడే వారినే రాజ్యసభకు ఎంపిక చేశారు. కరుణానిధి మరణించినప్పుడు అంతిమ సంస్కారాలను జరిపే స్థలం విషయంలో హైకోర్టులో డీఎంకే తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది విల్సన్ ను రాజ్యసభకు ఎంపిక చేసింది. సామాజిక వర్గ కోణంలోనూ విల్సన్ ఎంపిక జరిగింది. ఇక పార్టీకి నమ్మకంగా ఉండి, ఏ పదవులను ఆశించని డీఎంకే కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి షణ్ముగం కు రాజ్యసభ పదవిని స్టాలిన్ ఇచ్చారు. ఇక తనకు నమ్మకమైన మిత్రుడిగా ఉండి, భవిష్యత్తులో తనకు ఉపయోగపడనున్న ఎండీఎంకే నేత వైగోకు మరో రాజ్యసభ పదవిని కేటాయించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును కూడా పక్కన పెట్టి లోకల్ ఫ్లేవర్ కే స్టాలిన్ ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు డీఎంకే నేతలు. మొత్తం మీద స్టాలిన్ పార్టీ వ్యవహారాలను నడపటంలో తన తండ్రి కరుణానిధిని మరిపిస్తున్నారు.

No comments:
Write comments