సామాన్యులతో సామాన్యులా ఇద్దరు ఎమ్మెల్యేలు

 

విశాఖపట్టణం, జూలై 11, (globelmedianews.com)
వైసీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇపుడు విశాఖ జిల్లా ప్రజలను ఆకర్షిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కొట్టిగుళ్ళ భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ తాము ఎమ్మెల్యేలమన్న బేషజాలు కానీ అధికార ఆర్భాటాలు కానీ పెట్టుకోవడం లేదు. సామాన్యులలో సామాన్యులుగా ఉంటున్నారు. ఓటేసిన ప్రజలతో కలసిపోయి వారి కష్ట సుఖాల్లో ఒకరుగా ఉంటున్నారు. నిజంగా ఈనాటి తరంలో ఇది ఒక సంచలనమే. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తండ్రి చిట్టినాయుడు మూడుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పనిచేశారు. రాజకీయ కుటుంబం ఆమెది అయినా గర్వం లేదు, తాజాగా ఉత్తరాంధ్రలో అత్యధిక మెజారిటీతో గెలిచిన భాగ్యలక్ష్మి ప్రజలకు చేరువగా ఉండి వారి మన్ననలు అందుకుంటానని అంటున్నారు.పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి డిగ్రీ వరకూ చదువుకున్నారు. రాజకీయాలపైన, గిరిజన సమస్యల పైన మంచి అవగాహన ఉంది. మహిళా చైతన్యం పట్ల కూడా నిబద్ధత ఉంది. 
సామాన్యులతో సామాన్యులా ఇద్దరు ఎమ్మెల్యేలు

ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వాలని జగన్ కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా భాగ్యలక్ష్మి తాజాగా తన పొలంలో నాట్లు వేస్తూ కనిపించారు. తోటి గిరిజనుల‌తో కలసి ఆడుతూ పాడుతూ ఆమె సందడి చేశారు పొలం పనులు చేసుకోవడంలో తప్పులేదని, తన ప్రజా సేవకు అది అడ్డు రాదని ఆమె భావిస్తున్నారు. ఓ వైపు పొలం పనులు చేస్తూనే జగన్ తీసుకువస్తున్న రైతు భరోసా గురించి తోటి గిరిజనులకు వివరిస్తూ ఆమె చైతన్యం చేస్తున్నారు. గిరిజనులకు వైసీపీ ప్రభుత్వం తరఫున ఏమేమి కార్యక్రమాలు అమలవుతున్నాయో విడమరచి చెబుతున్నారు. అంతా వాటిని సద్వినియోగం చేసుకోవాలని హిత బోధ చేస్తున్నారు. ఓ విధంగా భాగ్యలక్ష్మి మంచి ఎమ్మెల్యేగా అపుడే మన్ననలు అందుకుంటున్నారు.ఇక మరో ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన అరకు నుంచి వైసీపీ తరఫున మంచి మెజారిటీతో గెలిచిన శెట్టి ఫల్గుణుడు. ఆయన సైతం రాజకీయాల్లోకి రాక ముందు బ్యాంక్ అధికారిగా ఉంటూ పేదలకు సేవ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి మేలు చేయాలన్న తలంపుతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చేశారు. మూడేళ్ల పాటు అరకుని వదిలిపెట్టకుండా ప్రజలతో మమేకం అయిన ఫల్గుణ్ సైతం భారీ అధిక్యతను సంపాదించుకున్నారు. ఇపుడు ఎమ్మెల్యే అయ్యాక ఆయన ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నేరుగా వారినే కలుసుకుంటున్నారు. ఎర్ర బస్సు ఎక్కి తోటి ప్రయాణీకుల్లో ఒకరుగా ప్రయాణం చేస్తున్నారు. వారి సాదకబాధలు వారితో ఉంటేనే బాగా అర్ధమవుతాయని ఫల్గుణ అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు వైసీపీ ఎమెల్యేలు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గతంలో గిరిజన ఎమ్మెల్యేలు కార్లతో, సెక్యూరిటీతో కనిపిసే వీరు మాత్రం జనంలోనే ఉంటూ వారే తమకు రక్షణ అంటున్నారు

No comments:
Write comments