ఇక డిండి ఎత్తిపోతల పరుగులు

 

నిజామాబాద్, జూలై 9,(globelmedianews.com)
డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణ దశలోనే అవకాశం ఉన్నంతమేర సాగునీటిని ఆయకట్టుకు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు కసరత్తు మొదలుపెట్టింది.నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో శాశ్వత సాగునీటి వసతి కల్పించడంతోపాటు ఫ్లోరైడ్ విముక్తికి శాశ్వత పరిష్కారం చూపనున్న డిండి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2015 జూన్ 2న సీఎం కేసీఆర్ మర్రిగూడ మండలం చర్లగూడెం వద్ద ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 6,190కోట్లకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వగా ఐదు రిజర్వాయర్లతోపాటు 60కి.మీ.మేర ప్రధాన కాల్వ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఓ పక్క రిజర్వాయర్ పనులను చేపడుతూనే మరోపక్క ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతంగా పూర్తిచేస్తోంది. 
 ఇక డిండి ఎత్తిపోతల పరుగులు

ఐదు రిజర్వాయర్ నిర్మాణాల కోసం 10,369ఎకరాల భూ మిని సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 5,915 ఎకరాల్లో భూసేకరణ పూర్తయింది. సేకరించిన పట్టా భూములకు సంబంధించి ఇప్పటివరకు రూ.200కోట్లకు పైగా పరిహారాన్ని ప్రభుత్వం రైతులకు అందజేసింది. పునరావాసానికి సంబంధించిన ప్రక్రియను సైతం ప్రభుత్వం మొదలుపెట్టింది. 2019చివరి నాటికి పంట కాల్వల ద్వారా ఆయకట్టులోని ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉండగానే చెరువులను నింపి అన్నదాతకు నీళ్లందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా డిండి ఎత్తిపోతల పథకం కింద కూడా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్ర్టాంపల్లి, శివన్నగూడెం వద్ద ఐదు రిజర్వాయర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే సింగరాజుపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్ల నిర్మాణ ప్రాంతంలో ఆశించిన నీటి లభ్యత ఉండడంతో వృథా చేయకుండా ముందస్తుగానే ఆయకట్టుకు అందించాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది దేవరకొండ, చందంపేట, డిండి మండలాల పరిధిలో 30వరకు చెరువులను నింపారు. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. మరోపక్క వర్షాకాలంలో రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతా ల్లో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు జలసిరులను గుర్తించడంతో వీలైనంత మేర ఆ వృథా నీటిని సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నారు. కొద్దిరోజుల కిందట కురిసిన వర్షానికి గొట్టిముక్కల రిజర్వాయర్ నిర్మాణ జరుగుతున్న ప్రాంతం మీదుగా ఏకంగా ఒక టీఎంసీ నీరు దిగువకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో గొట్టిముక్కల రిజర్వాయర్ కింద వాస్తవికంగా ఉన్న 28వేల ఎకరాల ఆయకట్టులో ఆరు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వానాకాలంలోనే ఈ రెండు రిజర్వాయర్ల కింద సాగు నీరందించాలని కొంతకాలం కిందట డిండి ఎత్తిపోతల పథకంపై జరిగిన సమీక్షలో మంత్రి హరీష్ రావు ఆదేశించడంతో ఆ దిశగా నీటి పారుదల శాఖ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. . 

No comments:
Write comments