ఎయిర్ పోర్టు నిర్వాసితుల ఆందోళన

 


నిజామాబాద్, జూలై 5 (globelmedianews.com)
నిజామాబాద్ అసలే కరవు నేల.. అందులోనూ కొద్దిపాటి భూమే వారికి ఆధారం. ఇప్పుడా భూముల్లోనే ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జీవనాధారమైన  పంట పొలాలను కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే ప్రాణాలొడ్డైనా సరే భూముల్ని కాపాడుకుంటామని సంబంధిత రైతులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి పరిసరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం స్థానిక రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. బంగారం లాంటి పంటలు పండే పొలాలను నాశనం చేసి ఎయిర్‌పోర్టు నిర్మించాల్సిన అగత్యం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జక్రాన్‌పల్లి పరిసరాలు.. కరవు పీడిత ప్రాంతాలు. ఇక్కడ వర్షం వస్తే పంట.. లేకుంటే గల్ఫ్‌ దేశాలకు వలస.. అన్నది ఆనవాయితీగా మారింది. ఆర్మూరు, నందిపేట్, జక్రాన్ పల్లి, సిరికొండ, బాల్కొండ, మోర్తాడ్ మండలాల నుంచి ఏటా వేలాది మంది విదేశాలకు వెళుతుంటారు. 

ఎయిర్ పోర్టు నిర్వాసితుల ఆందోళన

వీరంతా ఆకలి బాధలు తీర్చుకునేందుకే సుదూర దేశాలకు వలస వెళుతున్నారన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. పైగా ఇక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు భారీ సంఖ్యలో వెళుతున్నారంటూ.. జక్రాన్‌పల్లి చెంత మినీ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వమూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానయాన శాఖ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి.. మినీ విమానాశ్రయానికి జక్రాన్‌పల్లి పరిసరాలు అనువైనవని తేల్చారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి దాదాపు 2400 ఎకరాల భూమి అవసరమని అధికారులు తేల్చారు. కానీ ఇక్కడ ప్రభుత్వ భూమి దాదాపు 1400 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతా వేయి ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకుంటే తప్ప.. ఎయిర్‌పోర్టు నిర్మాణం కుదరదు.  అధికారులు విమానాశ్రయం కోసం.. తొర్లికొండ, అర్గుల్‌, కొలిప్యాక్‌, మనోహరాబాద్‌, జక్రాన్‌పల్లి గ్రామాల పరిధిలోని భూముల సేకరణకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్థానిక రైతులు అధికారుల కసరత్తును వ్యతిరేకిస్తున్నారు. తమ జీవనాధారమైన భూములను ఇచ్చేందుకు స్థానిక రైతులు ససేమిరా అంటున్నారు.తమ ప్రాంతంలో ఫ్యాక్టరీలు, ఐఐటీలు ఏర్పాటు చేస్తే కనీసం ఉపాధి అయినా లభిస్తుందని.. విమానాశ్రయం వల్ల తమకేమీ ఒరగదని గ్రామస్థులు అంటున్నారు. ఉన్న కొద్దిపాటి భూముల్ని సర్కార్‌ కొట్టేసే ప్రయత్నం చేస్తోందని, వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ప్రాణాలొడ్డైనా భూముల్ని కాపాడుకుంటామని రైతులు చెబుతున్నారు. అత్యంత విలువైన భూములను.. ప్రభుత్వం నామమాత్రపు ధరలు చెల్లించి హస్తగతం చేసుకోవాలని చూస్తోందని, దీంతో తమ కుటుంబాలు రోడ్డుపాలయ్యే ప్రమాదం ఉందని సంబంధిత గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ భూముల జోలికి వస్తే.. పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు. 

No comments:
Write comments