పీఏసీ పదవికోసం టీడీపీలో పోటీ

 

విజయవాడ, జూలై 22 (globelmedianews.com)
ఏపీ అసెంబ్లీ కమిటీలపై స్పీకర్ తమ్మినేని సీతారాం కసరత్తు మొదలు పెట్టారు. స్పీకర్ కార్యాలయం వివిధ కమిటీల్లో ప్రాతినిధ్యం కోసం అధికార, విపక్షాల నుంచి పేర్లను తీసుకునే పనిలో ఉంది. ఇక ప్రతిపక్షానికి దక్కే పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ మొదలయ్యింది. ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. ప్రతిపక్షానికి సంబంధించిన కీలక పదవి కావడంతో టీడీపీ అధినేత ఆచితూచి అడుగులు వేస్తున్నారట. కేబినెట్ హోదా ఉండే ఈ పదవి కోసం టీడీపీలో పోటీ ఉందట. పీఏసీ ఛైర్మన్ అంటే మంత్రి పదవి ఉన్నట్టే.. ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టుల్లో అవినీతి, భూకేటాయింపులు, ఉద్యోగ నియామకాలు ఇలా అన్ని అంశాల్లో ప్రశ్నించే హక్కు ఉంటుంది. 
 పీఏసీ పదవికోసం టీడీపీలో పోటీ

ఇలా కీలకమైన పదవి కావడంతో.. టీడీపీ నేతలు పోటీపడుతున్నారట. పీఏసీ ఛైర్మన్ పదవి రేసులో నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఈ రేసులో ఉన్నారట. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి అధినేత చంద్రబాబుకి అండగా ఉన్నారు. అచ్చెన్న కుటుంబం మొదటి నుంచి టీడీపీ అధినేతకు విధేయులుగా ఉన్నారు. ప్రస్తుతం బీసీ సామాజికవర్గం నుంచి ఆ కుటుంబంలో అచ్చెన్నాయుడుతో పాటూ ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. అంటే ఆ కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఇక అచ్చెన్న అసెంబ్లీలో అధికారపక్షాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. అధికారపక్షానికి టార్గెట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పీఏసీ చైర్మన్ కచ్చితంగా ఆయనకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పోటీలో ఉన్నారట. టీడీపీలో ఉన్న సీనియర్.. చంద్రబాబు కంటే సీనియర్ నేత.. సామాజిక వర్గాల సమీకరణాలతో ఆయనకు టీడీపీ హయాంలో మంత్రి పదవి దక్కలేదు. ఈసారి పీఏసీ చైర్మన్ పదవి తనకిస్తే గౌరవంగా ఉంటుందని భావిస్తున్నారట. అలాగే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా రేసులో ఉన్నారట. కాపు సామాజికవర్గం నేత.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.. అసెంబ్లీలో, బయట తన వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. కాబట్టి ఆయన పేరు కూడా వనిపిస్తోందట. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బలరాం పేర్లు వినపడుతున్నా.. వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపరనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా పదవి ఆశిస్తున్నారట. తనకు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందంటున్నారట. మరి అధినేత చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తిగా మారింది. 

No comments:
Write comments