పర్యాటక కేంద్రంగా హార్స్‌లీహిల్స్‌

 

తిరుపతి, జూలై 11, (globelmedianews.com)
ప్రముఖ పర్యాటక కేంద్రంగా చిత్తూరు జిల్లా మదనపల్లి హార్స్‌లీహిల్స్‌ను రూపొందించాలని ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. దేశ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా అధునాతన, వౌలిక వసతులతో కూడిన రిసార్ట్స్‌ను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబందించి త్వరలో టెండర్లు ఖరారు చేసి ఈ హార్స్‌లీహిల్స్‌పై 54 రిసార్ట్స్‌ను ఒకేసారి నిర్మించాలని పర్యాటకశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చెందుతున్న కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా రిసార్ట్స్ నిర్మించడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. త్వరలో టెండర్లు ఖరారు చేసి దీనికి తగిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన తదుపరి నిర్మాణ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేయాలని పర్యాటకశాఖాధికారులు నిర్ణయించారు. 
పర్యాటక కేంద్రంగా హార్స్‌లీహిల్స్‌

అలాగే శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని తరించేందుకు వీలుగా దేశంలో పలు రాష్ట్రాలకు ‘టూరిజం బస్సుల’ను నడపడానికి సన్నాహాలు చేస్తోంది. తిరుపతి నుంచి కోయంబత్తూరు, బెంగళూరు ప్రాంతాలకు రెండేసి బస్సులను నిర్వహిస్తుండగా త్వరలో తిరుపతి-విశాఖ మధ్య మరో రెండింటిని ప్రవేశపెడుతున్నట్టు తిరుపతి పర్యాటకశాఖ డివిజనల్ మేనేజర్ సురేశ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీని ఈ నెలాఖరు నుంచి ప్రారంభించనున్నామన్నారు. ఇప్పటికే బెంగళూరుకు నాలుగు, చెన్నైకి మూడు, కోయంబత్తూరుకు రెండు, కర్నూలుకు రెండు, మధురైకి ఒకటి చొప్పున పర్యాటక బస్సులు నడుపుతున్నారు. ఏపీలో దాదాపు 70 టూరిజం బస్సులుండగా వీటిని క్రమేపీ పెంచుకుంటూ పర్యాటక కేంద్రాల నుంచి మరికొన్నింటినీ అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ముఖ్యంగా తూర్పు కనుముల అందాలను పర్యాటకులు వీక్షించేందుకు వీలుగా విశాఖ అరకువేలీ, సాగరతీరం, బౌద్ధారామాల సందర్శన, అమరావతి, తిరుపతి, చిత్తూరు మదనమల్లి హార్స్‌లీహిల్స్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధిపరిచి దేశ, విదేశీ పర్యాటకులు ఆకర్షించే విధంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఏపీని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నందున ఈ క్రమంలో చర్యలు చేపడుతున్నామన్నారు

No comments:
Write comments