కరవు కాటు (నెల్లూరు)

 

నెల్లూరు, జూలై 25 (globelmedianews.com):
కరవు కన్నీళ్లు పెట్టిస్తోంది. బతుకు భారంగా మారింది. కాయకష్టం చేసినా ఫలితం చేతికందకుండా పోతుంటే కన్నీరు రాల్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులు. పంటకు కాదు కదా..కనీసం తాగడానికీ నీరు లేక అలమటిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో వలస బాట పడుతున్నారు. వ్యవసాయం తప్ప వేరే పని చేయలేని వారు గ్రామాల్లోనే బతుకీడుస్తున్నారు. కరవు రక్కసి పంజాకు చతికిలపడుతున్నారు. భారత ధాన్యాగారంగా పేరొందిన నెల్లూరు జిల్లాలో దైన్య పరిస్థితి తాండవిస్తోంది. గత కొన్నేళ్లుగా సరైన వర్షపాతం లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. ప్రాణాధారమైన పెన్నా, స్వర్ణముఖి నదులు వట్టిపోవడంతో నీరు బంగారమయింది. 
కరవు కాటు (నెల్లూరు)

సింహపురి జలప్రదాయినిగా పేరొందిన సోమశిల జలాశయంలోనే ప్రస్తుతం 2 నుంచి 3 టీఎంసీ నీరుందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ, మత్స్యరంగాలు కీలకంగా ఉన్న జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. 68శాతం మేర వరిసాగు ఉన్న జిల్లాలో ప్రస్తుతం రెండొంతుల పైగా సాగు తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లోని పరిస్థితి ఒకే విధంగా ఉంది. మామిడి, నిమ్మచెట్లు మలమలా మాడిపోతుండగా, జామాయిల్, టేకు వంటి వాటిదీ అదే పరిస్థితి. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి బతికించుకునే ప్రయత్నం చేస్తున్నా..ఖర్చు పెరగడం తప్ప ఫలితం ఉండటం లేదు. కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు నియోజకవర్గాల పరిధిలో చూస్తే ఈ సమస్య స్పష్టంగా దర్శనమిస్తోంది. చెరువులు, వాగులు వట్టిపోగా భూగర్భజలం పాతాళంలోకి వెళ్లిపోతోంది. అనేక పల్లెల్లో ఇళ్ల ముందు డ్రమ్ములు దర్శనమిస్తుండగా..నిత్యం ట్యాంకర్లతో వాటిని నింపాల్సిన పరిస్థితి. వింజమూరు మండల కేంద్రంలో అయితే ప్రతి ఇంటి ముందు 2 నుంచి 3 డ్రమ్ములు ఉండటం నీటి సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. వర్షాలు లేక పొలాల్లో పచ్చిక కరవైంది. ఫలితం..మట్టిపెడ్డలు తింటూ జీవాలు అనారోగ్యానికి గురువుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో కాపరులు ఇతర జిల్లాలకు వలస పోతుండగా..మరికొందరు ఇతర ప్రాంతాల్లో పచ్చిక పొలాలను అద్దెకు తీసుకుని మేపుకుంటున్నారు. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, ఆత్మకూరు పరిధిలోని అనేక గ్రామాల్లో అయితే ఇది మరింత దారుణంగా పరిణమిస్తోంది. పనులు లేక స్థానికులు వేరే ప్రాంతాలకు వలస పోయిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. భవిష్యత్తులో వర్షాలు పడకపోతే జిల్లా పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

No comments:
Write comments