కుటుంబ సర్వే వివరాలు ఇవ్వాలి

 


సిద్ధిపేట, జూలై 3 (globelmedianews.com
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వగ్రామమైన చింతమడక గ్రామానికి రానున్న నేపథ్యంలో గ్రామంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల నివేదికను సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం డీఆర్వో చంద్రశేఖర్, సీపీఓ ఓం ప్రకాశ్, జిల్లా అధికారులు, పది ప్రత్యేక బృందాల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

కుటుంబ సర్వే వివరాలు ఇవ్వాలి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చింతమడక గ్రామాన్ని మోడల్ విలేజ్ గా రూపొందించడానికి గత రెండు రోజులుగా చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే లో వచ్చిన అంశాలను నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను కోరారు. ప్రధానంగా వ్యవసాయం, రెవెన్యూ భూములు, భూ సమస్యలు, గ్రామంలో ఉన్న కుటుంబాలెన్ని..? గ్రామంలో భూ వైశాల్యమెంత..? గ్రామంలో ఏ ఏ రకాల భూములున్నాయి.. ? వాటిలో వినియోగం ఉన్న భూమి, వినియోగంలో లేని భూమి రైతుల భూ సమస్యలు వారికి ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయ సహకారాలు వంటి అంశాలను నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా గ్రామంలో జనాభా ఎంత..? అందులో సామాజిక వర్గాల వారీగా వారి సమస్యలు ఏమిటి.? వారి సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? అలాగే పాఠశాల, కళాశాల విద్యార్థుల సంఖ్య  బ్యాంకులు, మహిళా గ్రూపులు, మత్స్య కారులు, గీతా కార్మికులు, ముదిరాజ్, త్రాగునీరు, సాగునీరు, పాల ఉత్పత్తి దారుల యొక్క సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. చింతమడక గ్రామంలో రెండు రోజులుగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను సాయంత్రంలోపు సీపీఓ ద్వారా జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments