సర్కారీ స్కూళ్లకు క్యూ కడుతున్నారు

 


కరీంనగర్, జూలై 1, (globelmedianews.com)
మోడల్, కస్తూర్బా, గురుకుల పాఠశాలల్లో సీట్లు దొరకడమే కష్టమవుతున్నది.. కొన్ని జడ్పీహెచ్‌ఎస్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.. పలుచోట్ల గ్రామస్తులంతా తీర్మానం చేసుకొని మరీ పిల్లలను చేర్పిస్తుండగా, మూతపడే స్కూళ్లు కూడా తిరిగి తెరుచుకుంటున్నాయి.. ఇన్నాళ్లూ ప్రైవేట్ మోజులోపడిన చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూశారు. ఆర్థికంగా ఎదుగుతున్న క్రమంలో ప్రభుత్వ చదువంటే చిన్నతనంగా భావించారు. పిల్లల చదువుల కోసం ఉన్న సంపాదనంతా వెచ్చించారు. కానీ, నాలుగేళ్లలో సర్కారు బడుల్లో వచ్చిన మార్పులను చూసి, ప్రభుత్వ పాఠశాలలవైపు మెగ్గు చూపుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనను చూసి ఈ సారి ప్రవేశాలకు పోటీ పడ్డారు. మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు దొరక్క ఎంతో మంది నిరాశ చెందారు.ఈ యేడాది జిల్లా వ్యాప్తంగా 2,172 మంది కొత్తగా చేరగా, మెజారిటీ సర్కారు బడులన్నీ కళకళలాడుతున్నాయి.చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడేళ్ల కిందటి వరకు 20 మంది విద్యార్థులే ఉండేది. 

సర్కారీ స్కూళ్లకు క్యూ కడుతున్నారు

ఎప్పుడు మూతపడుతుందో తెలియని పరిస్థితి.ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మంచి భోజనం, ఇంగ్లిష్ మీడియం బోధన, నాణ్యమైన విద్య, అన్నింటికీ మించి మెరుగైన ఫలితాలను చూసి తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగగా, ఇప్పుడా పాఠశాల సందడిగా మారింది. ఒక్క చిన్నముల్కనూరు బడే కాదు, జిల్లాలోని మెజారిటీ సర్కారు స్కూళ్లు కళకళలాడుతున్నాయి. ప్రైవేట్‌ను వదిలి క్యూ కడుతుండగా, వందలాది మంది విద్యార్థులతో పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి..జిల్లాలోని చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, కరీంనగర్, మానకొండూర్, రామడుగు, సైదాపూర్, శంకరపట్నం, టేకుర్తి, తిమ్మాపూర్, వీణవంకలోని పాఠశాలల్లో కో ఎడ్యుకేషన్ విధానంలో విద్యా బోధన చేస్తుండగా, ప్రస్తుతం 2,405 మంది బాలురులు, 2,959 మంది బాలికల చొప్పున 5,364 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు బాలికల విద్యలో అనూహ్య మార్పులు తెచ్చాయి. జిల్లాలోని చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, జమ్మికుంట, కరీంనగర్, మానకొండూర్, రామడుగు, సైదాపూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, వీణవంకలోని పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో బోధన చేస్తుండగా, కొత్తగా మంజూరు చేసిన ఇల్లందకుంట కేజీబీవీలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టారు. ఈ విద్యాలయాల్లో గతేడాది వరకు 1,494 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 426 మందికి ఈ పాఠశాలలో ప్రవేశం కల్పించారు. ఇపుడు 1,920 మంది బాలికలు వివిధ తరగతుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. రెండు విద్యాలయాల్లో ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశారు. ఇపుడు వీటిలో ప్రవేశాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. కేజీబీవీల్లో మంచి ఆహారంతోపాటు చక్కటి విద్యా బోధన జరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి తర్వాత అడ్మిషన్లు కరువైనాయి. ఇల్లందకుంటలో కొత్తగా ఇంగ్లీష్ మీడియంతో కేజీబీవీని ప్రారంభించారు. ఇప్పటికే నిర్వహిస్తున్న శంకరపట్నం, జమ్మికుంట, చొప్పదండిలో 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నారు. దీంతో ఈ పాఠశాల్లో అడ్మిషన్లు దొరకడం కష్టంగా మారింది. కేజీ నుంచి పీజీ లక్ష్యంగా గడిచిన నాలుగేళ్లలో ఎన్నో సంస్కరణలు చేసింది. సర్కారు బడులను గాడిన పెడుతూనే, రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తున్నది. ఆధునిక భవనాలు నిర్మిస్తున్నది. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, పౌష్ఠికాహారం, వసతి అందిస్తున్నది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన చేస్తున్నది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రైవేట్‌కు దీటుగా ఫలితాలతో రికార్డులు సృష్టిస్తున్నది. అందుకే ప్రభుత్వ బడులంటే చిన్నచూపు పోతున్నది. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగి, పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. జిల్లాలో ఈ యేడాది బడిబాటకు ముందు అన్ని పాఠశాలల్లో 40,749 మంది విద్యార్థులుంటే, బడిబాట తర్వాత ఆ సంఖ్య 42,921కు చేరుకున్నది. అంటే జిల్లాలో 2,172 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. పలుచోట్ల ప్రైవేట్ నుంచి సర్కారుకు క్యూ కడుతున్నారు. పలు గ్రామాల్లో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తామని తీర్మానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో మూతబడిన నాలుగు పాఠశాలలు తిరిగి తెరిచారు.

No comments:
Write comments