కలుషితంగా మారుతున్న గోదారి జలాలు

 


అదిలాబాద్, జూలై 5, (globelmedianews.com
గోదారమ్మా.. కలుషితంగా మారుతోంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో వ్యర్థాలు వచ్చి చేరుతుండగా.. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోనూ ప్రమాదకరమైన వ్యర్థాలు, రసాయనాలు కలుస్తున్నాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలుకా బాలాపూర్ శివారులో ఓ డిస్ట్రీలరీస్  ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు, రసాయనాలు గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాల్వలో ప్రమాదకర వ్యర్థాలు, రసాయనాలతో రంగు మారిన నీరంతా వచ్చి రైల్వే వంతెనకు ఎగువన గోదావరిలో కలుస్తోంది. దీంతో గోదావరి నీరంతా బురుగుతో నలుపు రంగులో ఉంటోంది. రైల్వే వంతెనకు దిగువనే.. రోడ్డు వంతెనకు ఆనుకుని, శివాలయం వద్ద భక్తులకు స్నానాల కోసం పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఈ రసాయనాలు, వ్యర్థాలు నీటితో కలిసిపోయి.. పుష్కరఘాట్ల వద్దకు చేరుతుండగా.. భక్తులు ఈ కలుషిత జలాలతో పుణ్యస్నానాలు చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు వదలడంతో.. పుష్కరఘాట్ల వద్దకు వచ్చే సరికి గోదావరి నీటిలో కలిసి పోతోంది. దీంతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. 

కలుషితంగా  మారుతున్న గోదారి జలాలు

ఇక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోని 177గ్రామాలకు యంచ తాగునీటి పథకానికి నీరు సరఫరా అవుతోంది. బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఏడు వేల మందికి, బాసర అమ్మవారి ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు, బాసర, బిద్రెల్లి, కిర్గుల్ గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ఈ వ్యర్థాలు, రసాయనాలతో ఈ నీరంతా కలుషితమవుతోంది.ఈ ఆల్కహాల్ ఫ్యాక్టరీలో ఎంసీ, డీఎస్‌పీ, బ్యాక్‌పైపర్ అల్కాహాల్, వైన్‌లు తయారవుతుండగా.. వీటి వ్యర్థాలు, రసాయనాలను వర్షాలు కురిసినప్పుడు, గోదావరికి వరద నీటి ప్రవాహం ఉన్నప్పుడు, బాబ్లీ గేట్లు ఎత్తిన సమయంలో నదిలోకి వదులుతున్నారు. బాలాపూర్, నయాగాం మీదుగా కాల్వ ద్వారా బాసర వద్ద రైల్వే వంతెనకు ఎగువన రవీంద్రపూర్ శివారుల్లో గోదావరిలో కలుస్తుండగా.. వర్షపు, వరద నీటిలో కలిసిపోతున్నాయి. పరిశ్రమలో వచ్చే వ్యర్థాలు, రసాయనాలు ట్యాంకర్లలో నింపి బయటకు పంపడం.. ఎక్కువ లోతులో బోర్లు తవ్వి.. భూగర్భంలోకి పంపడం చేయాలి. తమ వ్యయాన్ని తగ్గించుకునేందుకుగాను ఇలా గోదావరిలోకి వదిలేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్గంధంతో రాత్రి వేళల్లో భైంసా-బాసర, బాసర-నిజామాబాద్ మార్గాల్లో ప్రయాణికులు, స్థానిక గ్రామాల ప్రజలు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సారెస్పీకి ఎగువన ఈ వ్యర్థాలు, రసాయనాలు కలుస్తుండగా.. ఇందులోకి చేరే నీరంతా కలుషితంగా మారుతోంది. అవతలి వైపున నిజామాబాద్ జిల్లా ఉండగా.. నిజామాబాద్ జిల్లాలోని రైసుమిల్లుల నుంచి వెలువడే వ్యర్థాలు, రసాయనాలు కూడా గోదావరిలోనే కలుస్తున్నాయి. జన్నేపల్లి వాగు ద్వారా నాళేశ్వర్ వద్ద గోదావరిలో ఈ వ్యర్థాలు, రసాయనాలతో కూడిన నీరు వచ్చి కలుస్తోంది. బాసరకు వచ్చే భక్తులు కూడా గోదావరి నదిలో వివిధ రకాల సామాగ్రి, వ్యర్థాలు పారేస్తుండటంతో.. నీరంతా కలుషితంగా మారుతోంది. ఈ నీరంతా ఎస్సారెస్పీకి చేరగా.. వ్యర్థాలు, రసాయనాలు నిల్వ నీటిలో అడుగుకు చేరుతున్నాయి. గత ఏడాది వేసవిలో ఎస్సారెస్పీలో చేపలకు ఎర్రతోక వ్యాధి సోకడంతో పెద్ద ఎత్తున చనిపోగా.. నీరు కలుషితమై చనిపోయినట్లు మత్య్సశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎస్సారెస్పీ నుంచి దిగువ ప్రాంతంలోని చెరువులు నింపగా.. ఈ కలుషిత జలాలతో చేపలు పెద్ద ఎత్తున చనిపోయాయి.

No comments:
Write comments