నిధులు ల్లేవు...

 

కలెక్టర్లకు అదనపు బాధ్యతలు
హైద్రాబాద్, జూలై 23, (globelmedianews.com)
అసెంబ్లీలో ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ చట్టం-2019పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. సరైన అధ్యయనం చేయకుండానే, శాసనసభ, మండలిలో సమగ్ర చర్చ జరగకుండానే చట్టం చేయడం సరికాదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ చట్టం ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడానికి మాత్రమే పనికొస్తుందని చెబుతున్నాయి. భారత రాజ్యాంగంలోని 73, 74 సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నికలను కచ్చితంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాటైంది. టీఆర్‌ఎస్‌ సర్కారు తెచ్చిన చట్టంతో ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని, ఇది సరికాదని అంటున్నాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 నిధులు ల్లేవు... 

హడావుడిగా చట్టం చేయడం ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నదని అభిప్రాయపడుతున్నాయి. 299 సెక్షన్లు, 181 పేజీలు ఉన్న మున్సిపల్‌ చట్టంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగకుండానే, ప్రతిపక్షాల అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోకుండానే బిల్లును ఆమోదించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 100 శాఖలకు చెందిన బాధ్యతలు చూస్తున్న కలెక్టర్ల నెత్తినే మళ్లీ మున్సిపాల్టీల పనులు పెట్టడం మంచిది కాదని, అలా చేయడం మూలానా నష్టం జరుగుతుందని గుర్తు చేస్తున్నారు. కొత్త చట్టంలోని సెక్షన్‌ 195(2) ప్రకారం మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ, చైర్మెన్‌, వైస్‌చైర్మెన్‌, వార్డుల సభ్యుల విధులు, రికార్డుల తనిఖీలు, మున్సిపాల్టీల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాల్లో కలెక్టర్లకే అధికారాలిస్తూ చట్టం చేసిన సంగతి తెలిసిందే. సెక్షన్‌ 24 ప్రకారం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లల్లో నాటిన మొక్కల్లో 85 శాతం కంటే తక్కువగా బతికితే ప్రత్యేకాధికారి, ఆ వార్డు సభ్యుడిని విధుల నుంచి తొలగించే అధికారాన్ని కలెక్టర్‌కు కట్టబెట్టడాన్ని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు. ప్రజలచేత ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించడం మంచి పరిణామం కాదని అంటున్నారు. అలాగే ఈ చట్టం ద్వారా మంత్రుల అధికారాలను తగ్గించడంపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది. మొక్కల పెంపకానికి కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా, నిధులు మంజూరు చేయకుండా పెంచడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ఇప్పటికే అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం 22 శాతానికి తగ్గించిన విషయం విదితమే. తాజాగా అమల్లోకి వచ్చే మున్సిపల్‌ చట్టంలో ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఒక నిబంధనను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని, బీసీ రిజర్వేషన్ల తగ్గింపు మాత్రమే అమల్లోకి వస్తుందనే విమర్శలు సైతం వస్తున్నాయి. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని చెబుతున్నాయి. ఈమేరకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరీని తప్పుబడుతున్నాయి

No comments:
Write comments