వామ్మో... కూరలకు గాయాలు...

 


శ్రీకాకుళం,జూలై 6, (globelmedianews.com)
శ్రీకాకుళం తొలకరి పలకరింపు వేళ కూడా మార్కెట్లో కూరగాయలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇన్నాళ్లూ వేసవి ఉండడంతో కూరగాయల కొరత ఉందని అనుకున్నా.. ఇప్పుడా పరిస్థితీ లేదు. అయినా ఉల్లి మొదలుకుని మిర్చి దాకా అన్నింటి ధరలూ సామాన్యుడి జేబులు చిల్లులు వేస్తున్నాయి. నెల రోజుల క్రితంతో పోలిస్తే ధరలు రూ. 10 నుంచి రూ. 15 దిగిరాని ధరలు సామాన్యులు మార్కెట్కు వెళ్లాలంటే హడలెత్తక తప్పదు. రెండు కిలోల కూరగాయలు కొనుగోలు చేయాలనుకుంటే కేవలం ఒక్క కిలోతోనో, అర కిలోతోనో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ధరల నియంత్రణకు సంబంధించి అధికారుల నిఘా కొరవడడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది ఓ ఆరోపణ. 

వామ్మో... కూరలకు గాయాలు... 

వ్యవసాయ మార్కెటింగ్, వాణిజ్య పన్నుల , పౌర సరఫరా, ఉద్యానవన, వ్యవసాయ శాఖలు సహా వినియోగదారుల సంఘం, వర్తక సంఘం సమన్వయంతో పనిచేసి ధరలను వారం వారం సమీక్షించి హెచ్చు తగ్గులను పరిశీలించి సవరించాల్సి ఉంది. అధికారుల నియంత్రణ కొరవడడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారనేది ఓ ఆరోపణ. ధరల నియంత్రణపై సంబంధిత కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి బహిరంగ మార్కెట్ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉన్నా.. అదేమీ లేకపోవడంతో ధరలు నింగిని అంటుతున్నాయి. అరకొర జీతాలతో నెట్టుకువచ్చే సామాన్యులను ధరాఘాతం వేధిస్తోంది. కలెక్టర్ /సంయుక్త కలెక్టర్ చైర్మన్గా ఉండే ధరల నియంత్రణ కమిటీ సమావేశం ఒక్కటీ ఇటీవల కాలంలో నిర్వహించకపోవడం శోచనీయం. గడిచిన మూడు నెలలుగా ఎటువంటి సమీక్షలు లేకపోవడంతో ధరల నియంత్రణ మాట అటుంచితే వ్యాపారుల అక్రమ నిల్వలు కూడా యథేచ్చగా సాగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు దిగిరావాలంటే వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ నియంత్రణ నిఘా తప్పనిసరి. లేకుంటే ఇంకా ధరలు పెరిగి సామాన్యులకు ఆర్థిక భారం అవుతుందనడంలో సందేహం లేదు. 

No comments:
Write comments